India vs England: తొలిరోజు భారత్ దే.. గిల్, జైస్వాల్ సెంచరీలు, రాణించిన రాహుల్, పంత్, భారీ స్కోరు దిశగా టీమిండియా.. ఇంగ్లాండ్ తో తొలి టెస్టు
అంచనాలు లేకుండా ఇంగ్లాండ్ లో ఆడుతున్న టీమిండియా.. ఫస్ట్ టెస్టులో అదరగొట్టింది. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్, జైస్వాల్ సూపర్ సెంచరీతో కదం తొక్కడంతో తొలిరేజే భారత్ ఈ మ్యాచ్ లో డామినేట్ చేసింది.

Ind Vs Eng 1st Test Latest Updates: ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. లీడ్స్ లో శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ తొలి రోజు ఆటముగిసేసరికి 85 ఓవర్లలో 3 వికెట్లకు 359 పరుగులు చేసింది. అరంగేట్ర కెప్టెన్ శుభమాన్ గిల్ (175 బంతుల్లో 127 బ్యాటింగ్, 16 ఫోర్లు, 1 సిక్సర్), విధ్వంసక ఓపెనర్ యశస్వి జైస్వాల్ (159 బంతుల్లో 101, 16 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీలతో సత్తా చాటడంతో తొలి రోజే మ్యాచ్ పై భారత్ పట్టు సాధించింది. ఫస్ట్ డే ఆటముగిసేసరికి గిల్ తోపాటు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (65 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కు రెండు వికెట్లు దక్కాయి. సీనియర్ వెటరన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వారి స్థానాల్లో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ లకు జట్టులో చోటు కల్పించారు. ఈ మ్యాచ్ లో సెంచరీ ద్వారా గిల్.. సేనా కంట్రీల్లో తొలి శతకాన్ని బాదాడు. అలాగే ఓవర్సీస్ లో డెబ్యూ కెప్టెన్సీలో సెంచరీ చేసిన మూడో భారత ప్లేయర్ గా నిలిచాడు.
Yashasvi Jaiswal and Shubman Gill score hundreds as Indian batters make merry on the opening day in Leeds 💪#ENGvIND 📝: https://t.co/FXxW1HkGLm pic.twitter.com/PE8oiAa2Aj
— ICC (@ICC) June 20, 2025
పునాది వేసిన ఓపెనర్లు..
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (42), జైస్వాల్ చక్కని ఆరంభాన్నిచ్చారు. అంతగా అనుభవం లేని ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. చెత్త బంతుల కోసం నిరీక్షించి, ఒక్కసారి అవకాశం రాగానే చెలరేగి ఆడారు. ఇలా వీరిద్దరూ భారత్ కు శుభారంభాన్నిచ్చారు. దాదాపు తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసిన ఈ జంట.. చూడచక్కని బౌండరీలతో, ఇంగ్లీష్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. అయితే లంచ్ విరామానికి కొద్దిసేపు ముందు చక్కగా ఆడిన రాహుల్ తొలుత క్యాచ్ ఔటవగా, నెం.3లో వచ్చిన సాయి సుదర్శన్ కీపర్ క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు.
సూపర్ భాగస్వామ్యం..
లంచ్ విరామం తర్వాత కాస్త ఒత్తిడిలో పడిన భారత్ ను గిల్ ఆకట్టుకున్నాడు. దిగ్గజాలు ఆడిన నెం.4లో బరిలోకి దిగిన గిల్.. స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించాడు. వన్డే తరహాలో ఆడుతూ, జట్టుపై ఒత్తిడి పడకుండా చూశాడు. మరో ఎండ్ లో జైస్వాల్ కూడా గేర్ మార్చడంతో పరుగులు వేగంగా వచ్చాయి. ఈ క్రమంలో రెండో సెషన్ మొత్తం వికెట్ పడకుండా ఆడారు. ఈ క్రమంలో 144 బంతుల్లో జైస్వాల్ సెంచరీ కొట్టగా, 56 బంతుల్లో గిల్ ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఇక టీ విరామం తర్వాత కాసేపటికే భారత్ కు షాక్ తగిలింది. జైస్వాల్ ను స్టోక్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో రెండో వికెట్ కు నమోదైన 129 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ తర్వాత పంత్, గిల్ ధాటిగా ఆడుతూ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. కెప్టెన్, వైస్ కెప్టెన్లయిన గిల్, పంత్.. బాధ్యతాయుతంగా ఆడుతూ, ఇంగ్లీష్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. గిల్ పర్ఫెక్టుగా ఆడగా, పంత్ కి మాత్రం కాస్త లక్కు కలిసి వచ్చింది. ఇలా జోరుగా ఆడుతూ, 140 బంతుల్లో గిల్ సెంచరీని పూర్తి చేశాడు. విదేశాల్లో కెప్టెన్సీ డెబ్యూ చేసి సెంచరీ చేసిన మూడో భారత కెప్టెన్ గా గిల్ నిలిచాడు. మరోవైపు 91 బంతుల్లో ఫిఫ్టీ చేసిన పంత్.. చివర్లో కాస్త నిర్లక్ష్యంగా ఆడినా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇలా అబేధ్యమైన నాలుగో వికెట్ కు 138 పరుగులు జోడించారు. అలాగే టెస్టుల్లో 3వేల పరుగుల మార్కును కూడా పంత్ చేరుకున్నాడు.




















