Samson On T20 WC Snub: టీ20 ప్రపంచకప్ జట్టులో చోటివ్వకపోవడంపై సంజూ శాంసన్ బిగ్ స్టేట్‌మెంట్!
Samson On T20 WC Snub: ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దొరక్కపోవడంపై టీమ్‌ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్ స్పందించాడు. ఓపెనింగ్ నుంచి ఫినిషర్ వరకు అన్ని రోల్స్ పోషిస్తున్నా అన్నాడు.
![Samson On T20 WC Snub: టీ20 ప్రపంచకప్ జట్టులో చోటివ్వకపోవడంపై సంజూ శాంసన్ బిగ్ స్టేట్‌మెంట్! Sanju Samson Makes Big Statement After T20 World Cup Snub From Team India Squad Samson On T20 WC Snub: టీ20 ప్రపంచకప్ జట్టులో చోటివ్వకపోవడంపై సంజూ శాంసన్ బిగ్ స్టేట్‌మెంట్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/25/3a766766e2e50c3ead619423cc8cc7d8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Samson On T20 WC Snub: ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దొరక్కపోవడంపై టీమ్‌ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్ స్పందించాడు. కేవలం బయటి నుంచే కాకుండా జట్టులో అంతర్గతంగా ఎంతో పోటీ నెలకొందని పేర్కొన్నాడు. కొన్నాళ్లుగా తన ఆటలో వైవిధ్యం పెరిగిందన్నాడు. ఓపెనింగ్ నుంచి ఫినిషర్ వరకు అన్ని పాత్రలను పోషిస్తున్నానని వెల్లడించాడు. న్యూజిలాండ్-ఏతో తొలి వన్డేకు ముందు అతడు పీటీఐతో మాట్లాడాడు.
'టీమ్‌ఇండియాలో చోటు దొరకడం అత్యంత సవాల్‌గా మారింది. రోజురోజుకీ పోటీ విపరీతంగా పెరుగుతోంది. బయట నుంచే కాకుండా జట్టులోని ఆటగాళ్ల మధ్యా పోటీ తీవ్రంగా ఉంది. ఇలాంటివి జరిగినప్పుడు నాపై నేను ఫోకస్ పెట్టుకోవడం మంచిది' అని సంజూ శాంసన్ అన్నాడు. 'కొన్నేళ్లుగా నేను వేర్వేరు పాత్రలను పోషించేందుకు అలవాటు పడ్డాను. బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడొచ్చినా ఆడగలిగే ఆత్మవిశ్వాసం నాకుంది' అని పేర్కొన్నాడు.
'కచ్చితంగా ఒకే పొజిషన్లో ఆడేందుకు ఫిక్సవ్వొద్దు. నేను ఓపెనర్, నేను ఫినిషర్ అని చెప్పొద్దు. మూడు నాలుగేళ్లుగా నేను వేర్వేరు స్థానాల్లో ఆడుతున్నాను. టాప్, మిడిలార్డర్లో వేర్వేరు పాత్రలు పోషించాను. ఇది నా ఆటకు సరికొత్త డైమెన్షన్ తీసుకొచ్చింది. ఇప్పుడు నా ఆటతీరు పట్ల సంతోషంగా ఉన్నాను. నేను మరింత మెరుగవ్వాలని కోరుకుంటున్నాను' అని శాంసన్ చెప్పాడు.
బీసీసీఐకి వ్యతిరేకంగా ఆందోళన
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు సంజు శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంతో బోర్డుపై ఆక్రోశం వెల్లగక్కేందుకు ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారని తెలిసింది. తిరువనంతపురంలో భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచు జరిగేటప్పుడు భారీ నిరసనలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ మేరకు ఐఏఎన్‌ఎస్ ఓ కథనం పబ్లిష్ చేసింది.
ఈ ఏడాది ఐపీఎల్‌లో సంజూ శాంసన్ అదరగొట్టాడు. తన కెప్టెన్సీ నైపుణ్యంతో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. రన్నరప్‌గా నిలిపాడు. 17 మ్యాచుల్లో 28 సగటు, 146 స్ట్రైక్‌రేట్‌తో 458 పరుగులు చేశాడు. టీమ్‌ఇండియా తరఫున 2022లో 6 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనల్లో అందరినీ ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ ఆసియాకప్‌లో అతడికి చోటివ్వలేదు. ఇక ఐసీసీ టీ20 ప్రపంచకప్ తుది 15 మందిలో తీసుకోలేదు. కనీసం రిజర్వుగా అయినా ఎంపిక చేయలేదు.
ఇవన్నీ పక్కన పెడితే ఏ మాత్రం ఆకట్టుకోని రిషభ్ పంత్‌ను తీసుకోవడం సంజూ అభిమానులకు నచ్చలేదు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించనప్పటి నుంచి అతడికి మద్దతుగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు, సోషల్ మీడియాలో ప్రతి రోజు ఈ అంశాన్ని ట్రెండింగ్‌లో ఉంచుతున్నారు. సునిల్ గావస్కర్, రవిశాస్త్రి సహా మరికొందరు మాజీలు అతడిని తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిందని పేర్కొన్నారు. ఆసీస్ బౌన్సీ పిచ్‌లు అతడి బ్యాటింగ్ శైలికి నప్పుతాయని అన్నారు. అయినప్పటికీ సెలక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో ఫ్యాన్స్ నిరసనలు తెలపాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇండియా-ఏ కెప్టెన్‌గా సంజూ
అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు అనిపిస్తోంది! టీమ్‌ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్‌ను (Sanju Samson) భారత్-ఏ కెప్టెన్‌గా నియమించింది. న్యూజిలాండ్-ఏతో జరిగే మూడు వన్డేల సిరీసుకు సెలక్టర్లు జట్టును ప్రకటించారు.
మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్-ఏ భారత్‌లో పర్యటిస్తోంది. టీమ్‌ఇండియాతో మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్ 22 నుంచి ఈ సిరీస్ మొదలవుతుంది. 22, 25, 27న మ్యాచులు జరుగుతాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం ఇందుకు వేదిక.
భారత్ ఏ జట్టు: పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, రజత్ పాటిదార్, సంజు శాంసన్ (కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), కుల్‌దీప్ యాదవ్, షాబాజ్ అహ్మద్, రాహుల్ చాహర్, తిలక్ వర్మ, కుల్దీప్ సేన్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, నవదీప్ సైని, రాజ్ అంగద్ బవా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)