WPL 2024 title: బెంగళూరు బెంగ తీరింది - మహిళలు సాధించేశారు
Women’s Premier League 2024: దాదాపుగా 16 ఏళ్లుగా దిగ్గజ క్రికెటర్లకు సాధ్యంకాని కలను ఆర్సీబీ అమ్మాయిలు సాకారం చేశారు. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేశారు.
Royal Challengers Bangalore beat Delhi Capitals in the final: ఈ సాలా కప్ మనదే(‘Finally Ee Sala Cup Namdu’) ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు((RCB) బరిలో దిగినప్పటి నుంచి వినిపిస్తున్న ఒకే మాట. ఈ సాలా కప్ మనదే అంటూ హంగామా చేసి.... తీరా కీలక మ్యాచ్‌లలో ఓడిపోతూ పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్ విజేత కలను ఉమెన్స్ ప్రీమియర్‌ల లీగ్(WPL)లో అమ్మాయిలు నెరవేర్చారు. కోహ్లీ, డివిలియర్స్ సహా దిగ్గజ ఆటగాళ్లతో చాలా పటిష్టంగా కనింపించిన RCB... ఐపీఎల్‌లో ప్రతీసారి టైటిల్ ఫేవరెట్‌గానే బరిలోకి దిగేది. కానీ విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే, ఏబీ డివిలియర్స్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి దిగ్గజాలు.. ఈ కలను సాకారం చేయలేకపోయారు. దాదాపుగా 16 ఏళ్లుగా దిగ్గజ క్రికెటర్లకు సాధ్యంకాని కలను ఆర్సీబీ అమ్మాయిలు సాకారం చేశారు. దశాబ్దంన్నర కాలంగా పురుషుల జట్టు సాధించలేకపోతున్న ట్రోఫీ కలను.. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(DC)ను చిత్తు చేసి నిజం చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ఆ జట్టు ఫ్యాన్స్ సగర్వంగా కాలర్ ఎగరేసే ప్రదర్శన చేసింది.
అమ్మాయిలు సాధించేశారు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి సీజన్‌లో పురుషుల జట్టు మాదిరిగానే విఫలమైనా రెండో సీజన్‌లో మాత్రం విజేతగా నిలిచింది. ఫైనల్లో ఎలాంటి తడబాటుకు చోటు లేకుండా సాధికార ఆటతీరుతో ఢిల్లీను చిత్తు చేసి ఆర్సీబీ ఛాంపియన్స్‌గా తొలి ట్రోఫీని సొంతం చేసుకుంది. 2008లో ఐపీఎల్‌లో ఆరంభ సీజన్ నుంచి ఆడుతున్నా ఆర్సీబీ ఇంతవరకూ ట్రోఫీని నెగ్గలేదు. 2009, 2011, 2016లలో ఆ జట్టు ఫైనల్ చేరినా ట్రోఫీ నెగ్గలేకపోయింది. దిగ్గజ క్రికెటర్లు ఆడిన ఆర్సీబీకి పురుషుల ఇంతవరకూ కప్ నెగ్గకపోయినా అమ్మాయిలు మాత్రం రెండో ప్రయత్నంలోనే ఆ కల తీర్చారు. ప్రతిసారి ఆశలు ఆవిరవుతుంటే ఆ జట్టుకు భారీగా ఉన్న అభిమాన గణం చెప్పలేని బాధను అనుభవిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆర్సీబీ మహిళలు ట్రోఫీ సొంతం చేసుకోవడంతో అభిమానులు ఆనందంలో తేలుతున్నారు. ఎంతో మంది దిగ్గజాలు, స్టార్ క్రికెటర్లు ఐపీఎల్‌లో పురుషుల ఆర్సీబీ జట్టుకు ఆడినా ఒక్కసారి కూడా జట్టు టైటిల్ గెలవలేకపోయింది. 2009, 2011, 2016లో టైటిల్‌కు చేరువగా వెళ్లి.. తుదిమెట్టుపై బోల్తాపడింది. నిరుడు స్మృతి మంధాన సారథ్యంలో డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టిన ఆర్సీబీ ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలే నమోదు చేసింది. దీంతో ఆర్సీబీ రాత అంతేనేమో అనిపించింది. సవాళ్లను దాటి ఫైనల్ చేరిన తొలిసారే బెంగళూరు ఛాంపియన్‌గా అవతరించింది. అమ్మాయిల స్ఫూర్తితో పురుషుల జట్టు ఐపీఎల్‌లోనూ ఆర్సీబీ విజేతగా నిలవాలని కోరుకుంటున్నారు. అదే జరిగితే కోహ్లి అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు. ఈ పోరులో దిల్లీ ఓపెనర్లు ఆరంభంలో దంచికొట్టినా.. బౌలింగ్‌లో బలంగా పుంజుకుని ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే ఆర్సీబీ కుప్పకూల్చింది. ఛేదనలో కఠిన పరిస్థితుల్లోనూ గొప్ప పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకుంది. డబ్ల్యూపీఎల్‌లో రెండుసార్లు ఫైనల్ చేరినా తుదిపోరులో ఢిల్లీ రెండుసార్లూ రన్నరప్‌గానే నిలిచింది.