(Source: ECI | ABP NEWS)
Rashid World Record: రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. టీ20ల్లో లీడింగ్ వికెట్ టేకర్ గా ఘనత
పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు (631) రికార్డును రషీద్ అధిగమించాడు. డ్వేన్ బ్రావో పేరిట ఈ రికార్డు ఉండగా, తాజాగా బద్దలైంది. మొత్తానికి కెరీర్లో 461 టీ20లు ఆడిన రషీద్.. 633 వికెట్లతో సత్తా చాటాడు.

Rashid Khan News: మిస్టరీ స్పిన్నర్, ఆఫ్గానిస్థాన్ కు చెందిన రషీద్ ఖాన్ టీ20ల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. సౌతాఫ్రికా లీగ్ ఎస్ఏటీ20లో క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో భాగంగా ఈ రికార్డు నెలకొల్పాడు. ఎంఐ కేప్ టౌన్ తరపున ఆడుతున్న రషీద్.. ప్రత్యర్థి పార్ల్ రాయల్స్ ఆటగాళ్లు దునిత్ వెల్లలాగే, దినేశ్ కార్తీక్ వికెట్లను తీసి, ఈ ఘనత సాధించాడు. దీంతో పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు (631) వికెట్ల రికార్డును అధిగమించాడు. వెస్టిండీస్ గ్రేట్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో పేరిట ఈ రికార్డు ఉండగా, తాజాగా బద్దలైంది. మొత్తానికి కెరీర్లో 461 టీ20లు ఆడిన రషీద్.. 633 వికెట్లతో సత్తా చాటాడు. తన యావరేజీ కేవలం 18.07 కావడం విశేషం. అత్యుత్తమ ప్రదర్శన 6/17. తన కెరీర్లో నాలుగుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
A new T20 king is crowned 👑
— ESPNcricinfo (@ESPNcricinfo) February 5, 2025
Rashid Khan climbs past Dwayne Bravo, who had been the top T20 wicket-taker since April 2016 🤯 pic.twitter.com/8AcO33pBPi
18 ఏళ్ల కెరీర్..
వెస్టిండీస్ కు చెందిన బ్రావో 18 ఏళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్ లు ఆడాడు. తను 24.40 సగటుతో 631 వికెట్లు తీశాడు. అతని బెస్ట్ 5/23 కావడం విశేషం. మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇక ఈ జాబితాలో మరికొందరు క్రికెటర్లు ఉన్నారు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ (536 మ్యాచ్ ల్లో 574 వికెట్లు), సౌతాఫ్రికా దిగ్గజ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (428 మ్యాచ్ ల్లో 531 వికెట్లు), బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ (444 మ్యాచ్ ల్లో 492 వికెట్లు) ఉన్నారు.
ఫైనల్లో ఎంఐ కేప్ టౌన్..
లీగ్ దశలో టేబుల్ టాపర్ గా నిలిచిన ఎంఐ కేప్ టౌన్.. అదే జోరుతో ఫైనల్లోకి ప్రవేశించింది. తాజాగా జరిగిన క్వాలిఫయర్ 1లో 39 పరుగులతో రాయల్స్ ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేప్ టౌన్.. ఓవర్లన్నీ ఆడి నాలుగు వికెట్లకు 199 పరుగులు చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్ట్సన్ (44), డివాల్డ్ బ్రెవిస్ (44), రస్సీ వాన్ డర్ డస్సెన్ (40) సత్తా చాటారు. బౌలర్లలో దునిత్ వెల్లలాగే కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో 19.4 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (45) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (31) అతనికి కాస్త సహకారం అందించాడు. బౌలర్లలో రషీద్, కగిసో రబాడ, కార్బిన్ బాష్, ట్రెంట్ బౌల్ట్ లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఈ విజయంతో కేప్ టౌన్ ఫైనల్లోకి వెళ్లిపోయింది. ఇక క్వాలిఫయర్ -2లో ఎలిమినేటర్ మ్యాచ్ లో విజేతతో రాయల్స్ తలపడుతుంది. ఎలిమినేటర్లో జోబర్గ్ సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుతో తలపడుతుంది.




















