Hanuma Vihari: శెబ్బాష్ హనుమ విహారీ! మణికట్టు విరిగినా ఆంధ్రా కోసం బ్యాటింగ్ చేశాడు!
Hanuma Vihari: తెలుగు క్రికెటర్ హనుమ విహారి (Hanuma Vihari) మరోసారి తన పట్టుదలను ప్రదర్శించాడు. ఎడమచేతి మణికట్టు విరిగినా బ్యాటింగ్‌కు వచ్చాడు.
Hanuma Vihari:
తెలుగు క్రికెటర్ హనుమ విహారి (Hanuma Vihari) మరోసారి తన పట్టుదలను ప్రదర్శించాడు. జట్టు కోసం ఎంతకైనా తెగిస్తానని చాటి చెప్పాడు. ఎడమచేతి మణికట్టు విరిగినా బ్యాటింగ్‌కు వచ్చాడు. తన సహజ శైలికి విరుద్ధంగా ఎడమచేత్తో బ్యాటింగ్ చేసి ఆంధ్రా జట్టును ఆదుకున్నాడు.
ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ జట్టు ఇండోర్ వేదికగా మధ్యప్రదేశ్‌తో రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో తలపడుతోంది. తొలి ఇన్నింగ్సులో 37 బంతుల్లో 16 పరుగులతో ఉన్నప్పుడు విహారి మణికట్టు విరిగింది. దాంతో అతడు స్కానింగ్‌కు వెళ్లాడు. వైద్యులు మణికట్టులో చీలిక వచ్చిందని వెల్లడించారు. నాలుగు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాంతో జట్టు యాజమాన్యం అతడితో అవసరమైతే తప్ప బ్యాటింగ్ చేయించొద్దని భావించింది.
Do it for the team. Do it for the bunch.
— Hanuma vihari (@Hanumavihari) February 1, 2023
Never give up!!
Thank you everyone for your wishes. Means a lot!! pic.twitter.com/sFPbHxKpnZ
తొలి ఇన్నింగ్సులో రికీ భుయ్ (149), కరణ్ షిండె (110) సెంచరీలు చేయడంతో ఆంధ్రా 323/2తో పటిష్ఠ స్థితిలో కనిపించింది. వారిద్దరూ ఔటయ్యాక వెంటవెంటనే వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. 328/4తో ఉన్న జట్టు 353/9కు చేరుకుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విరిగిన చేత్తోనే హనుమ విహారీ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఎడమ చేతి స్టాన్స్ తీసుకొని ఒక్క కుడి చేత్తోనే బంతులు ఎదుర్కొన్నాడు. నంబర్ 9 ఆటగాడు లలిత్ మోహన్‌తో కలిసి దాదాపుగా పది ఓవర్లు ఆడిన అతడు 26 పరుగులు చేసి లంచ్‌కు వెళ్లాడు. విరామం తర్వాత ఆడిన మొదటి బంతికే 27 పరుగులకు ఎల్బీ అయ్యాడు.
జట్టు కోసం మరోసారి గాయంతోనే బరిలోకి దిగానని హనుమ విహారి అన్నాడు. ఎప్పుడూ ఓటమిని అంగీకరించొద్దని వెల్లడించాడు. అభినందనలు తెలియజేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. సినీ నటి సయామీ సైతం అతడిని అభినందించింది. 'అతడి మణికట్టు విరిగింది. అయితే ఒంటిచేత్తోనే బ్యాటింగ్ చేశాడు. గొప్ప యోధుడు! హనుమ విహారి ఆస్ట్రేలియాలోని క్రీడాస్ఫూర్తినే రంజీ మ్యాచులోనూ చూపించాడు' అని ట్వీట్ చేసింది.
సిడ్నీ టెస్టులో హనుమ విహారీ అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడుతున్నా రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి రోజంతా బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. ఇప్పుడు అవేశ్ ఖాన్ వంటి బౌలర్లను అడ్డుకున్నాడు.
WARRIOR VIHARI!
— Saiyami Kher (@SaiyamiKher) February 1, 2023
Broke his wrist and batted left handed with 1 hand! What a true fighter!@Hanumavihari showed the same spirit in Australia and now at the Ranji game. Incredible. #HanumaVihari pic.twitter.com/hMQailJYFi
ఆంధ్రా తొలి ఇన్నింగ్సులో 127.1 ఓవర్లకు 379 పరుగులు చేసింది. బదులుగా మధ్యప్రదేశ్ 69.1 ఓవర్లకే 228కి కుప్పకూలింది. బౌలర్లు శశికాంత్ (3), పృథ్వీ రాజ్ (5) వారికి చుక్కలు చూపించారు. అయితే అవేశ్ (4), గౌరవ్ (3), కుమార్ కార్తికేయ (2) దెబ్బకు రెండో ఇన్నింగ్సులో ఆంధ్రా 32.3 ఓవర్లకు 93 పరుగులకే ఆలౌటైంది. ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ఆఖరి రోజు లంచ్ టైమ్‌కు మధ్యప్రదేశ్ 46 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 135తో ఉంది. గెలుపునకు 110 పరుగులు అవసరం.