Prithvi Shaw vs Sapna Gill Case: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ సప్నా గిల్‌తో వివాదం- క్రికెటర్ పృథ్వీ షాకు కోర్టు జరిమానా
Prithvi Shaw fined | సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ సప్నా గిల్ తో వివాదం కేసులో ముంబై కోర్టు క్రికెటర్ కు రూపాయల జరిమానా విధించింది. తప్పు దిద్దుకునే అవకాశాన్ని ఇచ్చింది.

Prithvi Shaw and Sapna Gill controversy | ముంబై: టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాకు ముంబై కోర్టు షాకిచ్చింది. ముంబైలోని డిండోషి సెషన్స్ కోర్టు క్రికెటర్‌కు రూ.100 జరిమానా విధించింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ సప్నా గిల్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించని కారణంగా, బదులు ఇవ్వకపోవడంతో కోర్టు చర్యలు చేపట్టింది. కోర్టు గతంలో పృథ్వీ షాకు కౌంటర్ దాఖలు చేయడానికి చివరి అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ అతని నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
ఫిబ్రవరి 2023న పృథ్వీ షా, సప్నా గిల్ మధ్య వివాదం జరిగింది. ముంబైలోని అంధేరి ప్రాంతంలోని ఒక పబ్లో పృథ్వీ షా, సప్నా గిల్ గొడవ పడ్డారు. సప్నా గిల్ తన స్నేహితురాలు పృథ్వీ షాతో సెల్ఫీ కోరిందని, క్రికెటర్ దానిని తిరస్కరించడంతో పాటు ఫోన్ లాక్కుని విసిరేశాడని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత సప్నా గిల్ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా క్రికెటర్ షా, అతని స్నేహితులు తనపై దాడికి యత్నించారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ తీవ్రమైన ఆరోపణలు చేయడం కలకలం రేపింది.
ఘటన తర్వాత తాను పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారని సప్నా గిల్ ఆరోపించింది. ఆ తర్వాత ఆమె అంధేరిలోని మెజిస్ట్రేట్ కోర్టులో దీనిపై పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం జరిగిందని ఏప్రిల్ 2024లో మెజిస్ట్రేట్ కోర్టు భావించింది, కాని ఆరోపణలు తీవ్రమైనవి, కాబట్టి విచారణ అవసరమని అభిప్రాయపడింది. సిఆర్పిసి సెక్షన్ 202 కింద విచారణ జరిపి నివేదిక సమర్పించాలని శాంతాక్రూజ్ పోలీసులనుట్ కోర్టు ఆదేశించింది. తనకు వ్యతిరేకంగా నమోదైన పిటిషన్‌కు పృథ్వీ షా బదులివ్వకపోవడాన్ని సెషన్స్ కోర్టు తీవ్రంగా పరిగణించి, క్రికెటర్‌కు జరిమానా విధించింది. మరోవైపు దర్యాప్తు నివేదిక ఈ కేసులో మరింత కీలకం కానుంది.
సప్నా గిల్ లాయర్ ఏమన్నారు..
బాధితురాలిగా చెప్పుకుంటున్న సప్నా గిల్ తరపున వాదిస్తున్న లాయర్ అలీ కాషిఫ్ ఖాన్ దేశ్ముఖ్ ABP న్యూస్ తో మాట్లాడుతూ, "ముంబైలోని డిండోషి సెషన్స్ కోర్టు భారత క్రికెటర్ పృథ్వీ షాకు రూ.100 జరిమానా విధించింది. ఇన్‌ఫ్లూయెన్సర్ సప్నా గిల్ ఫైల్ చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్లో పదేపదే తన సమాధానం ఇవ్వకుండా దాటవేస్తున్నందుకు షా మీద కోర్టు చర్యలు తీసుకుంది. సప్నా గిల్ ఫిబ్రవరి 2023లో ముంబైలోని అంధేరిలో ఉన్న ఒక పబ్లో పృథ్వీ షా, అతడి స్నేహితులు తనను కొట్టారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేసింది.
విచారణ చేపట్టిన కోర్టు క్రికెటర్ వివరణ కోరుతూ షాకు చాలాసార్లు సమన్లు పంపించింది. కానీ సప్నా గిల్ చేసిన ఆరోపణలపై కోర్టు ఇచ్చిన సమన్లకు పృథ్వీ షా స్పందించలేదు. కోర్టు మరోసారి గడువు ఇచ్చిందని, త్వరలోనే తన క్లయింట్ కు న్యాయం జరుగుతుందని దేశ్ముఖ్ అన్నారు.
తదుపరి విచారణ ఎప్పుడు
విచారణను వాయిదా వేయడం క్రికెటర్ షా ప్లాన్ అని సప్నాగిల్ లాయర్ దేశ్ముఖ్ అన్నారు. షా తన దుష్ప్రవర్తనపై ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేకపోతున్నాడు. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 16కు వాయిదా పడినట్లు ఆయన తెలిపారు.





















