Paul Valthaty Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన పాల్ వాల్తాటి - 12 ఏండ్లుగా ఐపీఎల్‌లో చెక్కు చెదరని రికార్డు
దేశవాళీ క్రికెట్‌లో సుపరిచితుడై ఐపీఎల్ - 2011 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో వీరవిహారం చేసి సెంచరీ సాధించిన పాల్ వాల్తాటి క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.
Paul Valthaty Retirement: ఐపీఎల్‌లో గతంలో పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన పాల్ వాల్తాటి.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ముంబై వాసి అయిన వాల్తాటి.. అక్కడ అవకాశాలు లేక హిమాచల్‌ప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఐపీఎల్ సీజన్లలో ఆడిన వాల్తాటి.. నేడు తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఆ రికార్డు అతడికే సొంతం..
ముంబైలో పుట్టి పెరిగిన వాల్తాటి.. 2009లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడాడు. 2011 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్‌లో నాటి కింగ్స్ లెవన్ పంజాబ్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన 9వ లీగ్ మ్యాచ్‌లో సీఎస్కే నిర్దేశించిన 189 పరుగుల లక్ష్య ఛేదనలో వాల్తాటి వీరవిహారం చేశాడు. 63 బంతుల్లోనే 19 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కాగా ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అతడు అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ రికార్డు 12 ఏండ్లుగా భద్రంగా ఉంది. 2015లో సౌతాఫ్రికా బ్యాటర్ ఏబీ డివిలియర్స్.. ఆర్సీబీ తరఫున ఆడుతూ.. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కూడా 19 ఫోర్లు కొట్టి ఈ రికార్డును సమం చేశాడే గానీ బ్రేక్ చేయలేకపోయాడు.
Paul valthaty, who became famous after scoring a brilliant century for Kings XI Punjab (now Punjab Kings) in the 2011 IPL, has retired from first-class cricket.
— Vipin Tiwari (@vipintiwari952) July 18, 2023
After making his List A debut in 2006 for Mumbai, Valthaty played five first-class matches for Himachal Pradesh. pic.twitter.com/40kqi0n3s7
రెండేండ్లలోనే కనుమరుగు..
ఓపెనర్‌గా వచ్చి చెన్నైతో మ్యాచ్‌లో వీరవిహారం చేసిన వాల్తాటి.. ఐపీఎల్‌లో సెంచరీ చేసిన ఫస్ట్ ముంబై బ్యాటర్ (నాలుగో భారత బ్యాటర్) గా రికార్డు సృష్టించాడు. అయితే సెంచరీ తర్వాత అతడు తన క్రేజ్‌తో పాటు ఆటను కూడా కోల్పోయాడు. వరుసగా రెండు సీజన్లలో అతడి ప్రదర్శన నానాటికీ పడిపోయింది. దీంతో 2013 తర్వాత అతడికి అవకాశాలు సన్నగిల్లాయి. ఐపీఎల్‌లో సెంచరీ చేసి అంతర్జాతీయ క్రికెట్ ఆడని క్రికెటర్లలో భారత్ నుంచి అతడు కూడా ఒకడిగా ఉన్నాడు.
వాల్తాటి తన కెరీర్‌లో ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 4 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడిన అతడు ఐపీఎల్‌లో మొత్తంగా 23 మ్యాచ్‌లు ఆడాడు. కెరీర్ ఆరంభంల ఇండియా అండర్ - 19, ఇండియా బ్లూ, ముంబై జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. రిటైర్మెంట్ విషయాన్ని వాల్తాటి ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు మెయిల్ చేశాడు. ఈ మేరకు తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ తో పాటు బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలు పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించిన వాల్తాటి.. ఎయిరిండియాలో పనిచేస్తూ దేశవాళీ క్రికెట్ ఆడాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial