Virat Kohli: అప్పుడే విరాట్ తనయుడి రికార్డ్, పాక్‌లోనూ సంబరాలు
Virat Kohli and Anushka Sharma: తండ్రి క్రికెట్ మైదానంలో రికార్డులు నెలకొల్పడంలో రారాజు అయితే జూనియర్ విరాట్ పుట్టిన వారంలోనే ఓ రికార్డును సృష్టించాడు.
Akaay Kohli Record : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) రెండోసారి తండ్రయ్యాడు. తన భార్య అనుష్క శర్మ(Anshuka Sharma) ఈ నెల 15న మగబిడ్డకు జన్మనిచ్చిందని కోహ్లి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపాడు. కొడుకు పేరు అకాయ్(Akaay) అని పేర్కొన్నాడు. కోహ్లి, అనుష్కలకు ఇప్పటికే మూడేళ్ల కుమార్తె వామిక ఉంది. ఫిబ్రవరి 15న వామిక తమ్ముడు అకాయ్‌ని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించామని కోహ్లీ తెలిపాడు. ఈ విషయం అందరికీ చెప్పడానికి సంతోషిస్తున్నామని... ఈ అందమైన సమయంలో అందరీ ఆశీర్వాదాలు కావాలంటూ కోహ్లీ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. తమ ఏకాంతాన్ని గౌరవించమని విజ్ఞప్తి చేస్తున్నామన్నాడు. కోహ్లీ ప్రకటనతో క్రికెట్ ప్రపంచం విరుష్క దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతోంది. అయితే అప్పుడే విరుష్క ముద్దుల తనయుడు ఓ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తండ్రి క్రికెట్ మైదానంలో రికార్డులు నెలకొల్పడంలో రారాజు అయితే జూనియర్ విరాట్ పుట్టిన వారంలోనే ఓ రికార్డును సృష్టించాడు.
ఇంతకీ ఏంటంటే..
ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ అకాయ్ పుట్టాడంటూ పెట్టిన పోస్ట్ గంటలోనే ఐదు మిలియన్లకు పైగా లైకులను అందుకుంది. ఆసియాలోనే అత్యంత వేగంగా ఎక్కువగా లైకులను అందుకున్న పోస్ట్‌గా ఇది రికార్డు సృష్టించింది. దీంతో జూనియర్ కోహ్లి కూడా అప్పుడే రికార్డులను వేటాడం మొదలుపెట్టాడని విరాట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ సంబరపడుతున్నారు. ప్రస్తుతానికి 'అకాయ్' పోస్ట్‌ను సుమారు ఎనిమిది మిలియన్లకుపైగా లైక్స్‌ను అందుకుంది.
పాకిస్థాన్‌లో సంబరాలు
కోహ్లీ రెండో సారి తండ్రి అయ్యాడని తెలియడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నఅతడి అభిమానుల సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా కోహ్లీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దాయాది దేశం పాకిస్థాన్‌లోనూ ఉన్న విరాట్ అభిమానులు కొందరు స్వీట్స్ పంచుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆకాయ్ అంటే అర్థం ఏంటంటే..
ఇంతకీ ఆకాయ్ అంటే ఏంటో తెలుసా. సంస్కృతంలో కాయ్ అంటే శాశ్వతమైనది, చిరంజీవి, పాడు కానిది అని అర్థం. కాయం, శరీరం. హిందీలో కాయ్ అంటే కాయం లేదా శరీరం. పరమశివుడు శరీరం లేనివాడు కాబట్టి ఆకాయ్ అంటే పరమ శివుడనే అర్థం కూడా ఉంది. ఇక తుర్కిష్ భాషలో అకాయ్ అంటే.. నిండు చందమామ లేదా కాంతులీనుతున్న పున్నమి చంద్రుడు అని అర్థం. ఈ వార్త తెలిసిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు విరుష్క జంటను అభినందిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ కూడా సోషల్ మీడియా వేదికగా కోహ్లీ, అనుష్కలకు శుభాకాంక్షలు తెలియజేశాడు. మీ అందమైన కుటుంబంలోకి అమూల్యమైన అకాయ్ వచ్చినందుకు విరాట్, అనుష్కలకు అభినందనలంటూ సచిన్ పోస్ట్ చేశాడు. అకాయ్ అనే పేరులోనే నిండుచంద్రుడు ఉన్నాడని.. అతడు మీ ఇంట్లో ఇక వెలుగులు నింపినట్టే అని సచిన్ అన్నాడు. అతను మీ ప్రపంచాన్ని అంతులేని ఆనందం, నవ్వుతో నింపుతాడని అన్నాడు. మీరు ఎప్పటికీ ఆదరించే జ్ఞాపకాలు మీ వెంటే ఉంటాయని ఆశిస్తున్నాను. ప్రపంచానికి స్వాగతం.. లిటిల్ ఛాంప్!’ అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే రషీద్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, వరుణ్ చక్రవర్తి క్రికెటర్లు విరాట్, అనుష్కలకు శుభాకాంక్షలు తెలిపారు.