PAK vs NED: హైదరాబాద్‌లో పాక్ ఫస్ట్ మ్యాచ్! పోరాట స్ఫూర్తినే నమ్మిన నెదర్లాండ్స్
PAK vs NED: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో శుక్రవారం రెండో మ్యాచ్ జరుగుతుంది. హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్, నెదర్లాండ్స్ తలపడుతున్నాయి.
PAK vs NED:
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో శుక్రవారం రెండో మ్యాచ్ జరుగుతుంది. హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్, నెదర్లాండ్స్ తలపడుతున్నాయి. దాయాది కొన్నేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టింది. ఆటగాళ్లు గాయపడటంతో ఇబ్బంది పడుతోంది. నెదర్లాండ్స్ మాత్రం ఉత్సాహంతో కనిపిస్తుంది. దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న తపనతో ఉంది. మరి ఈ పోరులో గెలిచేదెవరు? తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి?
పాక్.. ఫామ్‌లో లేని ఆటగాళ్లు
మొన్నటి వరకు పాకిస్థాన్ ప్రపంచంలో నంబర్ వన్ జట్టు! ఆ ముగ్గురు పేసర్లు ఆడుతున్నప్పుడు ప్రపంచ జట్లను వణికించింది. వారిప్పుడు గాయపడటంతో ఆందోళన చెందుతోంది. ఆసియాకప్‌లో వరుస ఓటములతో ర్యాంకు తగ్గింది. కీలక బ్యాటర్లు, బౌలర్లు సైతం ఫామ్ కోల్పోయారు. దాంతో భారమంతా కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై పడింది. ఎంత నిలకడగా సహచరుల అండలేకపోతే ఒత్తిడికి లోనై త్వరగానే ఔటవుతున్నాడు. వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ ఫామ్‌లేమి నిరుత్సాహం కలిగిస్తోంది. ఫకర్ జమాన్, రిజ్వాన్ సైతం ఫామ్‌లో లేరు. ఉసామా మిర్ లెగ్‌స్పిన్‌తో ఆకట్టుకుంటున్నాడు. గాయపడ్డ తర్వాత షాహిది అఫ్రిది బౌలింగ్‌లో పస తగ్గింది. నసీమ్ షా లేకపోవడంతో అతడిపై భారం పెరిగింది. పేస్ ఉన్నప్పటికీ హ్యారిస్ రౌఫ్ ఎప్పుడు ఎలాంటి బౌలింగ్ చేస్తాడో తెలియదు. మొత్తంగా నెదర్లాండ్స్‌తో మ్యాచులో పాక్‌పై ఒత్తిడేమీ లేకపోవడం గమనార్హం. చివరి రెండు ప్రపంచకప్ టోర్నీలో పాక్ తొలి మ్యాచుల్లో ఓడిపోయింది. ఆఖరి ఐదులో నాలుగింట్లో ఓటమి చవిచూసింది.
పోరాటమే నెదర్లాండ్స్ బలం
అర్హత టోర్నీల్లో మంచి ప్రదర్శనతో నెదర్లాండ్స్ ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ఎంపికైంది. పరిస్థితులు ఎలాగున్నా పోరాట స్ఫూర్తిలో వారికి ఎదురులేదు. ప్రతి ఒక్కరూ దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఒకప్పుడు పసికూనగా ఉన్న నెదర్లాండ్స్ ఇప్పుడు ఒత్తిడిని తట్టుకొని మరీ నిలబడుతోంది. పెద్ద జట్లపైనా మంచి ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. మాక్స్ ఓ డౌడ్, బాస్ డి లీడ్, కొలిన్ అకెర్‌మన్, స్కాట్ ఎడ్‌వర్డ్స్ బాగా ఆడతారు. పాల్ వాన్ మీకెరన్, షరిజ్ అహ్మద్, రోయిలెఫ్ వాన్‌డెర్ మెర్వ్ బౌలింగ్ బాగుంటుంది. తమదైన రోజున ఈ జట్టు ఎవరినైనా ఓడించగలదు. వర్షం కారణంగా సన్నాహక మ్యాచుల్లో సరిగ్గా ఆడలేదు. భారత సంతతికి చెందిన విక్రమ్ జీత్ ఆకర్షణగా మారాడు.
పిచ్ కండీషన్
హైదరాబాద్ గురించి అందరికీ తెలిసిందే. చివరి వారం వర్షం కారణంగా మ్యాచులకు అంతరాయం కలిగింది. ఇప్పుడేమో భాగ్యనగరం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వేసవిని తలపిస్తోంది. వర్షం పడే అవకాశమే లేదు. పిచ్ ఫ్లాట్‌గా ఉండటంతో భారీ స్కోర్లు నమోదవుతాయి. తెలివిగా బౌలింగ్ చేస్తే బౌలర్లు రాణించగలరు.
పాకిస్థాన్ జట్టు (అంచనా): ఫకర్ జమాన్, ఇమాముల్ హఖ్, బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ / సల్మాన్ అలీ అఘా, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హ్యారిస్ రౌఫ్
నెదర్లాండ్స్ జట్టు (అంచనా): విక్రమ్ జీత్ సింగ్, మాక్స్ ఓ డౌడ్, వెస్లీ బారెసి, బాస్ డి లీడ్, కొలిన్ అకెర్‌మన్, స్కాట్ ఎడ్‌వర్డ్స్, రియాన్ క్లెయిన్, లోగన్ వాన్ బీక్, రోయిలెఫ్ వాన్ డెర్ మెర్వ్, షరీఫ్ అహ్మద్, పాల్ వాన్ మీకెరన్