ODI World Cup 2023: గాయాలు బాబోయ్! - మెగా టోర్నీకి ముందు అన్ని జట్లకూ కొత్త తలనొప్పులు
వన్డే వరల్డ్ కప్ కౌంట్ డౌన్ మొదలైంది. మరో రెండున్నర వారాలలో క్రికెట్‌లో బిగ్గెస్ట్ ఈవెంట్‌కు తెరలేవనున్న నేపథ్యంలో ఆటగాళ్ల గాయాలు జట్లకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.
ODI World Cup 2023: నేటికి కచ్చితంగా 17 రోజులు మాత్రమే ఉన్న వన్డే వరల్డ్ కప్‌కు ముందు అన్ని జట్లూ మెగా టోర్నీలో అనుసరించిన వ్యూహాలు, తమ బలాలు, ప్రత్యర్థుల బలహీనతలు, పిచ్, పరిస్థితుల కంటే ఎక్కువగా ఆందోళన చెందుతున్న అంశం గాయాలు. ఈ జట్టు ఆ జట్టు అనే తేడా లేకుండా దాదాపు అన్ని టీమ్స్‌నూ ‘గాయాలు’ వేధిస్తున్నాయి. తమ జట్టులోని కీలక ఆటగాళ్లలో కొంతమంది ఇప్పటికే ఇంజ్యూర్డ్ లిస్ట్‌లో ఉండగా మరికొంతమంది టోర్నీ నుంచి తప్పుకునేదాకా వెళ్లారు. వివిధ జట్లలో గాయాల బారిన పడుతున్న ఆటగాళ్ల వివరాలు ఇక్కడ చూద్దాం.
భారత్..
స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌ను ఎలాగైనా నెగ్గి పదేండ్ల ఐసీసీ ట్రోఫీ కరువు తీర్చాలనుకుంటున్న టీమిండియాకు గాయాల బెడద నిత్యకృత్యమే. ఆసియా కప్‌కు ముందే గాయాల పాలై సర్జరీలు చేసుకుని కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రిత్ బుమ్రాలు జట్టులోకి తిరిగొచ్చారు. వీరి ఫిట్‌నెస్‌పై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో రాహుల్, బుమ్రాలు మెరుగైనా అయ్యర్ మళ్లీ మొదటికొచ్చాడు. ఆసియా కప్‌లో ఒక్కటే మ్యాచ్ ఆడిన అతడికి గాయం తిరగబెట్టింది. దీంతో మిగతా మ్యాచ్‌లకు అతడు అందుబాటులో లేడు. ఆస్ట్రేలియాతో సిరీస్ వరకైనా అయ్యర్ కోలుకుంటాడా..? అన్నది అనుమానంగానే ఉంది. దీనికి తోడు ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడుతూ అక్షర్ పటేల్ కూడా గాయపడ్డాడు. అతడూ ఆసీస్‌తో వన్డే సిరీస్ ఆడటం కష్టమేనని తెలుస్తున్నది.
పాకిస్తాన్..
భారత్ మాదిరిగానే ఆసియా కప్‌లో పాకిస్తాన్‌కు ఆటగాళ్ల గాయాలు భారీ షాకిచ్చాయి. ఆ జట్టు స్టార్ పేసర్లు హరీస్ రౌఫ్, నసీమ్ షాలు భారత్‌తో సూపర్ - 4 మ్యాచ్‌లో గాయపడ్డారు. వీరిలో హరీస్ రౌఫ్ పరిస్థితి కాస్త మెరుగైనా భుజం గాయంతో బాధపడుతున్న నసీమ్ షా మాత్రం వరల్డ్ కప్‌కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతేగాక భారత్‌తో మ్యాచ్‌లోనే రవీంద్ర జడేజా వేసిన బంతికి పాక్ మిడిలార్డర్ బ్యాటర్ అఘా సల్మాన్ ముఖానికి బలంగా తాకడంతో అతడు కూడా వరల్డ్ కప్‌కు ఆడతాడా..? అన్నది అనుమానమే. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు.
శ్రీలంక..
ఆసియా కప్ ప్రారంభానికి ముందే లంక జట్టు ప్రధాన బౌలర్ల సేవలను కోల్పోయింది. దుష్మంత చమీర, దిల్షాన్ మధుశంక, వనిందు హసరంగ, లాహిరు కుమారలు గాయంతో ఆసియా కప్ నుంచి తప్పుకున్నారు. వీళ్లు ప్రపంచకప్ వరకూ కోలుకుంటారా..? అన్నది తెలియడం లేదు. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతూ స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ కూడా గాయపడ్డాడు. దీంతో అతడు ఆసియా కప్ ఫైనల్‌లో ఆడలేదు.
బంగ్లాదేశ్..
బంగ్లా జట్టూ గాయాలతోనే సావాసం చేస్తున్నది. ఆ జట్టు మెయిన్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ వెన్నునొప్పితో ఆసియా కప్‌కు దూరమయ్యాడు. మోకాలి గాయంతో స్టార్ పేసర్ ఎబాదత్ హోసేన్ ఆసియా కప్‌తో పాటు త్వరలో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లోనూ ఆడేది అనుమానంగానే ఉంది. ఆసియా కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన స్టార్ బ్యాటర్ నజ్ముల్ హోసేన్ శాంతో గాయంతో అర్థాంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు.
న్యూజిలాండ్..
2019 వరల్డ్ కప్ రన్నరప్ న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీకి ఇటీవలే వేలి గాయమైంది. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా మూడో వన్డేలో అతడు గాయపడ్డాడు. అతడు ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యే ప్రమాదం ఉంది. గత ఐపీఎల్ సీజన్‌లో గాయమై సర్జరీ చేయించుకుని జట్టులోకి తిరిగివచ్చినా కివీస్ జట్టు సారథి కేన్ విలియమ్సన్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అతడు ఏ మేరకు ఫిట్‌నెస్ సాధించి వరల్డ్ కప్ ఆడతాడనేది చూడాల్సి ఉంది.
సౌతాఫ్రికా..
సఫారీ జట్టు స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్ లోయర్ బ్యాక్ ఇంజ్యూరీతో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పలు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడు వరల్డ్ కప్ ఆడే అవకాశాలూ తక్కువేనని సమాచారం. మరో పేసర్ సిసంద మగల కూడా ఎడమ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. కెప్టెన్ టెంబ బవుమా పొట్ట కండరాల గాయంతో ఇబ్బందిపడుతున్నాడు.
ఆస్ట్రేలియా..
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఆసీస్ జట్టును టీ20లతో పాటు వన్డేలలో కూడా మిచెల్ మార్ష్ నడిపించాడు. ఆ జట్టు రెగ్యులర్ సారథి పాట్ కమిన్స్ మణికట్టుకు గాయమైంది. అయితే అతడు భారత్‌తో వన్డే సిరీస్ ఆడనున్నాడు. కమిన్స్‌తో పాటు సఫారీ సిరీస్ నుంచి తప్పుకున్న స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు భారత్‌తో ఆడనున్నారని వార్తలు వస్తున్నా వాళ్లింకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని ఆసీస్ మీడియా వెల్లడిస్తోంది. ఇక దక్షిణాఫ్రికా సిరీస్‌లో భాగంగా నాలుగో వన్డేలో బ్యాటింగ్ చేస్తూ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఎడమ చేతికి గాయమైంది. అతడు వన్డే ప్రపంచకప్ ఆడటం కష్టేమనని ఆసీస్ కోచ్ మెక్‌డొనాల్డ్ ఇదివరకే హింట్ ఇచ్చాడు. మరో ఆటగాడు ఆస్టన్ అగర్ కూడా వరల్డ్ కప్ ఆడేది అనుమానమే.
ఇంగ్లాండ్..
ఇంగ్లాండ్ జట్టులో అదిల్ రషీద్, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్‌లు గాయాల బాధితులే. అయినా వీరిలో స్టోక్స్, రషీద్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడారు. వుడ్, వోక్స్ కూడా సభ్యులుగానే ఉన్నారు. వరల్డ్ కప్ నాటికి వీరు పూర్తిగా ఫిట్‌నెస్ సాధిస్తారని ఇంగ్లాండ్ భావిస్తోంది.
వీళ్లైతే కచ్చితంగా డౌటే..
- నసీమ్ షా (పాకిస్తాన్)
- ట్రావిస్ హెడ్ (ఆసీస్)
- ఎబాదత్ హోసేన్ (బంగ్లాదేశ్)
- ఆస్టన్ అగర్ (ఆసీస్)
- అన్రిచ్ నోర్త్జ్ (దక్షిణాఫ్రికా)
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial