ENG Vs BAN, Innings Highlights: ఇంగ్లాండ్ బ్యాక్ టు ఫామ్! బంగ్లా టైగర్స్‌కు 365 టార్గెట్
ENG Vs BAN, Innings Highlights: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. బంగ్లా పులులకు 365 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చింది.
ENG Vs BAN, Innings Highlights:
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. బంగ్లాదేశ్‌తో మ్యాచులో జూలు విదిలించింది. ధర్మశాల పోరులో భారీ స్కోరు చేసింది. బంగ్లా పులులకు 365 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చింది. ఓపెనర్ డేవిడ్ మలన్ (140; 107 బంతుల్లో 16x4, 5x6) వీరోచిత శతకం బాదేశాడు. ఇక మాజీ కెప్టెన్ జో రూట్ (82; 68 బంతుల్లో 8x4, 1x6) సమయోచిత ఇన్నింగ్స్ ఆడాడు. జానీ బెయిర్‌స్టో (52; 80 బంతుల్లో 8x4) హాఫ్ సెంచరీ బాదేశాడు.
మలన్ విధ్వంసం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ తొలి ఓవర్ నుంచే కసిగా ఆడింది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా భారీ స్కోర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్టే ఓపెనర్లు డేవిడ్ మలన్, జానీ బెయిర్ స్టో బ్లాస్టింగ్ ఓపెనింగ్ ఇచ్చారు. బంగ్లా బౌలర్లను ఊచకోతకోశారు. తొలి పవర్‌ప్లేలో ముగిసే సరికే వికెట్లేమీ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 107 బంతుల్లో 115 పరుగుల భాగస్వామ్యం అందించారు. మలన్ 39 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. ఆ తర్వాత 54 బంతుల్లో బెయిర్ స్టో హాఫ్ సెంచరీ చేశాడు. అతడిని జట్టు స్కోరు 115 వద్ద షకిబ్ ఔట్ చేశాడు.
రూట్ రాకతో స్థిరత్వం
జోరూట్ వన్‌డౌన్‌లో వచ్చాక ఇంగ్లాండ్ మరింత భీకరంగా ఆడింది. అతడేమో వికెట్ ఇవ్వడు. మలన్ ఏమో చితక బాదేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో బంగ్లాకు పాలుపోలేదు. మొత్తంగా వీరిద్దరూ రెండో వికెట్‌కు 117 బంతుల్లో 151 పరుగుల భాగస్వామ్యం అందించారు. 91 బంతుల్లో సెంచరీ అందుకున్న మలన్ ఆ తర్వాత వీర బాదుడు బాదేశాడు. మరోవైపు రూట్ 44 బంతుల్లో ఆఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరి ధాటికి ఇంగ్లాండ్ 242 బంతుల్లోనే 300 పరుగులకు చేరువైంది. అయితే జట్టు స్కోరు 307 వద్ద రూట్‌ను ఇస్లామ్, మలన్‌ను మెహదీ హసన్ ఔట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు దూకుడుగా ఆడటంతో ఇంగ్లాండ్ స్కోరు 364/9కి చేరుకుంది.