World Cup 2023: అట్లుంటది మనతోని, బార్మీకి ఆర్మీకి ఇచ్చి పడేసిన అభిమానులు
ODI World Cup 2023: ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది టీమిండియా. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. వెంటనే ఇంగ్లండ్‌కు చెందిన బార్మీ ఆర్మీ వెంటనే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించిన టీమిండియా.. ఈ మెగా టోర్నీలో అప్రతిహాతంగా ముందుకు సాగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో క్లిష్ట సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ తొమ్మిది బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండా అవుటయ్యాడు. ఈ ప్రపంచకప్‌లో తొలిసారి కింగ్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. కోహ్లీ అలా డకౌట్ అవ్వగానే ఇంగ్లండ్‌కు చెందిన బార్మీ ఆర్మీ వెంటనే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. బాతుకు కోహ్లీ ఫోటో అతికించి బార్మీ ఆర్మీ చేసిన ట్వీట్ నిమిషాల్లోనే నెట్టింట వైరల్ అయ్యింది. కోహ్లీ డక్ అవుట్ అయ్యాడనే విధంగా ఉన్న ఈ ఫొటో వైరల్ అయింది.
అయితే బార్మీ ఆర్మీకి ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆరంభం కాగానే భారత నెటిజన్లు ఇంగ్లండ్‌కు మద్దతుగా నిలిచే బార్మి ఆర్మీకి ఇచ్చి పడేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లు జో రూట్, బెన్ స్టోక్స్ సైతం సున్నాకే వెనుదిరిగారు. జో రూట్ ఎదుర్కొన్న తొలి బంతికే బుమ్రా బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత స్టోక్స్‌ను షమీ పెవిలియన్ చేర్చాడు. దీంతో బార్మీ ఆర్మీకి కౌంటర్లు మొదలెట్టారు ఇండియన్ ఫ్యాన్స్. బాతులకు రూట్, స్టోక్స్ ఫోటోలు అతికించి ట్వీట్లు చేశారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలవ్వడంతో బార్మీ ఆర్మీకి తిక్కకుదిరిందంటూ ఇండియన్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. ఇంగ్లండ్-ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌లో మరో ఆసక్తికర రికార్డు నమోదైంది. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో మొట్టమొదటిసారి ఇరు జట్లలోని నంబర్ 3 ఆటగాళ్లు సున్నా పరుగులకే ఔటయ్యారు. ఇన్నేళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. భారత్ తరఫున నంబర్ త్రీగా బరిలోకి దిగిన విరాట్ 9 బంతులు ఆడి డేవిడ్ విల్లే బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ కాగా.. ఇంగ్లండ్ తరఫున నంబర్ త్రీగా బరిలోకి దిగిన జో రూట్ బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (101 బంతుల్లో 87; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. రోహిత్‌తో పాటు కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 39; 3 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (47 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడింది. కేవలం 34.5 ఓవర్లలో 129 పరుగులకే బ్రిటీష్ జట్టు కుప్పకూలింది. దీంతో 100 పరుగుల భారీ తేడాతో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మరోసారి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న భారత్.. ప్రపంచకప్ సెమీఫైనల్‌కు కూడా దూసుకెళ్లింది. వరుసగా వికెట్లు పడుతున్నా రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్‌గా తన వందో మ్యాచ్‌లో జట్టును ముందుండి నడిపించాడు. ఆచితూడి ఆడుతూనే సమయం వచ్చినప్పుడల్లా భారీ షాట్లు ఆడేందుకు భయపడలేదు. సెంచరీ దిశగా సాగుతున్న రోహిత్‌ను అదిల్ రషీద్ అవుట్ చేశాడు. 101 బంతుల్లో 10 ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో రోహిత్ శర్మ 87 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.