సచిన్, సెహ్వాగ్ రికార్డులను సమం చేసిన కేన్ మామ- లంకకు చుక్కలే!
NZ vs SL 2nd Test: న్యూజిలాండ్ టెస్టు జట్టు మాజీ సారథి కేన్ విలియమ్సన్ టెస్టులో తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. శ్రీలంకపై సెంచరీల మోత మోగిస్తున్నాడు.
NZ vs SL 2nd Test:స్వదేశంలో న్యూజిలాండ్ టెస్టు జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జోరుమీదున్నాడు. గత నెలలో ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో సెంచరీ చేసిన కేన్ మామ (సన్ రైజర్స్ అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు) లంకతో సిరీస్ లో కూడా అదే ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ముగిసిన తొలి టెస్టులో సెంచరీ చేసిన అతడు.. తాజాగా వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ద్విశతకంతో మెరిశాడు. తద్వారా కేన్.. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, వీరేంద్ర సెహ్వాగ్ రికార్డులను సమం చేశాడు.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో విలియమ్సన్.. 296 బంతులాడి 23 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 215 రన్స్ చేశాడు. అతడితో పాటు హెన్రీ నికోలస్ (240 బంతుల్లో 200 నాటౌట్, 15 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా డబుల్ సెంచరీ చేశాడు. ఈ ఇద్దరి విజృంభణతో కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోరు చేసి డిక్లేర్ చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి లంక 17 ఓవర్లు ఆడి రెండు వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. ఉత్కంఠభరితంగా ముగిసిన తొలిటెస్టులో కివీస్ చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టెస్టులో కూడా అదే ఫలితం రిపీట్ అయ్యే పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి.
దిగ్గజాల సరసన కేన్ మామ..
ఈ టెస్టులో డబుల్ సెంచరీ చేయడం ద్వారా కేన్ మామ అరుదైన ఘనతను అందుకున్నాడు. టెస్టులలో అతడికి ఇది ఆరో డబుల్ సెంచరీ. తద్వారా పలు రికార్డులను బ్రేక్ చేయడంతో పాటు దిగ్గజ క్రికెటర్ల సరసన నిలిచాడు. టెస్టులలో సచిన్, వీరేంద్ర సెహ్వాగ్, రికీ పాంటింగ్, జావేద్ మియాందాద్, యూనిస్ ఖాన్ ల ఆరు డబుల్ సెంచరీల రికార్డును సమం చేశాడు. ఇదే సమయంలో ఐదు ద్విశతకాలు చేసిన జో రూట్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ల ఐదు డబుల్ సెంచరీల రికార్డును బద్దలుకొట్టాడు. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ.. టెస్టులలో ఏడు డబుల్ సెంచరీలు సాధించాడు. టెస్టు క్రికెట్ లో అత్యధికంగా ఆస్ట్రేలియా దిగ్గజం సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్.. తన కెరీర్ లో 52 టెస్టులే ఆడి ఏకంగా 12 ద్విశతకాలు చేయడం గమనార్హం.
Test double century number SIX for Kane Williamson! His second against Sri Lanka at the @BasinReserve. Follow play LIVE in NZ with @sparknzsport. #NZvSL pic.twitter.com/q6I7u7sFgR
— BLACKCAPS (@BLACKCAPS) March 18, 2023
అంతర్జాతీయంగా ఆధునిక క్రికెట్‌లో ‘ఫ్యాబ్ 4’ ఆటగాళ్లలో విలియమ్సన్ ఒకడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, జో రూట్ (ఇంగ్లాండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) లతో పాటు కేన్ కూడా ఉన్నాడు. 2010 నుంచి కివీస్ తరఫున ఆడుతున్న విలియమ్సన్.. మొత్తంగా తన టెస్టు కెరీర్ లో 94 టెస్టులు ఆడాడు. 164 ఇన్నింగ్స్ లలో 54.89 సగటుతో 8,124 పరుగులు సాధించాడు. ఇందులో 28 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. కాగా చాలాకాలంపాటు ఆ జట్టుకు సారథిగా పనిచేసిన విలియమ్సన్ ఇటీవలే టెస్టు సారథ్య పగ్గాలను టిమ్ సౌథీకి అప్పగించి తాను మాత్రం పరిమిత ఓవర్లకే పరిమితమయ్యాడు.