MS Dhoni: ఐపీఎల్ సమీపిస్తున్న వేళ, ధోనీ ప్రత్యేక పూజలు
MS Dhoni: టీమిండియా మాజీ సారధి మహేంద్రసింగ్ ధోని... జార్ఖండ్ రాంచీలోని పవిత్ర దేవరీ ఆలయాన్ని సందర్శించాడు. అభిమానుల మధ్య క్యూ లైన్‌లో నిల్చొని అమ్మవారిని దర్శించుకున్నాడు
MS Dhoni in Tamar: టీమిండియా మాజీ సారధి మహేంద్రసింగ్ ధోని(MS Dhoni)... జార్ఖండ్(Jarkhand) రాంచీ(Ranchi)లోని పవిత్ర దేవరీ ఆలయాన్ని( Dewri Temple) సందర్శించాడు. అభిమానుల మధ్య క్యూ లైన్‌లో నిల్చొని అమ్మవారిని దర్శించుకున్నాడు. దేవరీ ఆలయంలోని దుర్గాదేవికి మహీ ప్రత్యేక పూజలు చేయగా అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. అభిమానులు ధోనీతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. చెన్నై కెప్టెన్ దేవరీ మా ఆలయంను సందర్శించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.దేవరీ ఆలయంలో ధోనీ ప్రత్యేక పూజలు చేయడం ఇదే తొలిసారి కాదు. కీలక టోర్నీలు, ముఖ్యమైన పనులు చేపట్టే ముందు మహీ ఈ ఆలయాన్ని సందర్శించి దుర్గాదేవి దర్శనం చేసుకుంటాడు. భారత జట్టులోకి ఎంపికైనప్పటి నుంచి ధోనీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రపంచకప్ టోర్నీలు, ఐపీఎల్‌కు ముందు ఈ ఆలయాన్ని సందర్శించి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశాడు.
సిద్ధమవుతున్న ధోనీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024)లో మినీ వేలం ప్రక్రియ ముగిసింది. ఇక ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐపీఎల్ క్రికెట్(Cricket) సమరానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మార్చి 23 నుంచి మే 29 వరకు ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 10 జట్టు 74 మ్యాచ్ లు ఆడనున్నాయి. ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఇటీవలే పూర్తికాగా.. అందుబాటులో ఉన్న ప్లేయర్లు ప్రాంచైజీల పర్యవేక్షలో ప్రాక్టీస్ మొదలు పెడుతున్నారు. 2023 ఐపీఎల్ టోర్నీని చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు గెలుచుకుంది. ఇప్పటికే అయిదుసార్లు కప్పును గెలుచుకున్న చెన్నై మరోసారి కప్పును ఒడిసిపట్టాలని పట్టుదలగా ఉంది. చెన్నై సారధి ఎం.ఎస్. ధోనీ( MS Dhoni) మరోసారి జట్టును విజేతగా నిలపాలని పట్టుదలతో ఉన్నాడు. అద్భుతమైన కెప్టెన్సీతో ఇప్పటికే అయిదుసార్లు జట్టుకు కప్పు అందించిన ధోనీ ఆరోసారి ఐపీఎల్ ట్రోఫీ అందించాలని పట్టుదలగా ఉన్నాడు. ఈసారి ఐపీఎల్‌లో మరోసారి తనసత్తాను చూపేందుకు తలైవా సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2024 టోర్నీకి సంబంధించి ధోనీ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ తలైవా వచ్చేశాడోచ్ అని కామెంట్లు చేస్తున్నారు.
ధోనీ బరిలోకి దిగడం ఖాయం
ఐపీఎల్ 2023 తరువాత ధోనీ ఐపీఎల్ నుంచి తప్పుకుంటారని ప్రచారం జరిగింది. గతేడాది టోర్నీ సమయంలో ధోనీ మోకాలి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఐపీఎల్ 2024 టోర్నీలో ఎంఎస్ ధోనీ పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ధోనీ ఫిట్ గా ఉన్నాడని, రాబోయే సీజన్ లో ఐదుసార్లు విజేతగా నిలిచిన సీఎస్కే జట్టుకు నాయకత్వం వహిస్తాడని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశాడు. ఇప్పుడు ధోనీ ప్రాక్టీస్ మొదలెట్టడంతో అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి.