T20 World Cup 2022: ఒత్తిడిలో ఎలా ఆడాలో ధోనీ నుంచే నేర్చుకున్నా: ఇంగ్లండ్ ఆల్ రౌండర్
T20 World Cup 2022: ఒత్తిడితో ఉండే మ్యాచుల్లో ఎలా ఆడాలో తాను సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ నుంచి నేర్చుకున్నట్లు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ చెప్పాడు.
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో భాగంగా జరిగే రెండో సెమీఫైనల్లో నవంబర్ 10న భారత్, ఇంగ్లండ్ తో తలపడనుంది. ఈ సందర్భంగా ఆ జట్టు ఆల్ రౌండర్ మొయిన్ అలీ మాట్లాడాడు. మ్యాచ్ కోసం తమ సన్నద్ధత, ప్రణాళికలు తదితర అంశాల గురించి చర్చించాడు. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచి తను నేర్చుకున్న అంశాలను చర్చించాడు.
అది ధోనీ నుంచే నేర్చుకున్నాను
మొయిన్ అలీ.. ఇంగ్లండ్ జట్టులో కీలకమైన ఆటగాడు. అతను ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒత్తిడితో ఉండే మ్యాచుల్లో ఎలా ఆడాలో తాను సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ నుంచి నేర్చుకున్నట్లు అలీ వివరించాడు. 'ఐపీఎల్ లో ధోనీ, డ్వేన్ బ్రావోలను చూసి నాకౌట్ ల వంటి పెద్ద మ్యాచుల్లో ఎలా ఆడాలో తెలుసుకున్నాను. సీనియర్ ఆటగాళ్లు జూనియర్లపై చాలా ప్రభావం చూపిస్తారు. పెద్ద మ్యాచుల్లో సీనియర్లు ప్రశాంతంగా ఉండి.. యువకులను కూడా ఒత్తిడికి గురి కాకుండా చూడాలి. అలా ఉంటేనే ఫలితం సానుకూలంగా వస్తుంది. ఈ విషయాన్ని వారిని చూసే నేర్చుకున్నాను.' అని అలీ వివరించాడు.
మా ప్రణాళిక మాకుంది
సెమీఫైనల్ మ్యాచుకు తమ సన్నద్ధత, ప్రణాళికల గురించి కూడా మొయిన్ అలీ మాట్లాడాడు. ముఖ్యంగా కోహ్లీని కట్టడి చేయడానికి తగిన ప్రణాళికతో వస్తున్నట్లు చెప్పాడు. పరుగులను నియంత్రించి, ఒత్తిడి పెంచితే విరాట్ వికెట్ సాధించవచ్చని తెలిపాడు. ఐపీఎల్ లో కోహ్లీతో కలిసి మొయిన్ అలీ మూడేళ్లు ఆర్సీబీకి ఆడాడు. 'అగ్రశ్రేణి ఆటగాళ్లు టీ20 క్రికెట్ లో చెలరేగుతున్నప్పుడు వారిని కట్టడి చేయడం కష్టం. వారిని నియంత్రించేందుకు తగిన సరైన ప్రణాళిక అవసరం. అప్పుడే వారి వికెట్ తీయగలం' అని అలీ తెలిపాడు.
కోహ్లీ ప్రస్తుతం బాగా ఆడుతున్నాడని మొయిన్ అలీ అన్నాడు. ఆసియా కప్ నుంచి తన పూర్వపు ఫామ్ అందుకున్నాడని.. మెగా టోర్నీలో తన అత్యున్నత స్థితికి చేరుకున్నాడని మొయిన్ అభిప్రాయపడ్డాడు. అయితే తమ జట్టు కూడా తగిన ప్లాన్ తోనే బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశాడు. తమ ప్రణాళికలకు కట్టుబడి ఆడితే అతనిని నియంత్రించవచ్చని చెప్పాడు.
రోహిత్ శర్మకు గాయం
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2022లో టీమ్‌ఇండియాకు షాక్! సెమీ ఫైనల్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. అడిలైడ్‌లో మంగళవారం నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా అతడి చేతికి బంతి తగిలింది. త్రో డౌన్ స్పెషలిస్ట్ విసిరిన బంతి ఆడే క్రమంలో హిట్‌మ్యాన్ గాయపడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా ఉందో, సెమీస్‌కు అందుబాటులో ఉంటాడో లేదో బీసీసీఐ ఇంకా అధికారికంగా ఏమీ చెప్పలేదు. భారత్ గురువారం ఇంగ్లాండ్‌తో సెమీస్ ఆడే సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ మీద గెలిస్తే భారత్ ఫైనల్ కు చేరుకుంటుంది. ఒకవేళ ఫైనల్ కు చేరితే గ్రూప్ ఏ విజేతతో కప్పు కోసం పోటీపడుతుంది.