(Source: ECI/ABP News/ABP Majha)
DC vs MI, Match Highlights: ఉత్కంఠ పోరులో బోణీ కొట్టిన ముంబై - ఢిల్లీకి తప్పని నాలుగో ఓటమి
IPL 2023, DC vs MI: ఐపీఎల్ - 2023 సీజన్‌లో రెండు పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ దురదృష్టాన్ని మరికాస్త పొడిగిస్తూ సూపర్ విక్టరీ అందుకుంది.
IPL 2023, DC vs MI: ఐపీఎల్ -16 సీజన్‌లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయాన్ని అందుకుంది. ముంబై సారథి రోహిత్ శర్మ (65: 45 బంతుల్లో, 6 బౌండరీలు, 4 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు ఆంధ్రా కుర్రాడు తిలక్ వర్మ (41: 29 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) , ఇషాన్ కిషన్ (31: 26 బంతుల్లో 6 ఫోర్లు) ల నిలకడైన ఆటతో పాటు చివర్లో కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ ల పోరాటంతో ఎంఐకి తొలి విజయం దక్కింది. ఐపీఎల్‌లో మునపటి రోహిత్ శర్మను గుర్తు చేస్తూ హిట్‌మ్యాన్ అరుణ్ జైట్లీ స్టేడియంలో బౌండరీలు, సిక్సర్లతో అలరించాడు. కానీ చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి ఉత్కంఠగా ముగిసిన మ్యాచ్ లో ముంబై.. ఢిల్లీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. కాగా ఈ సీజన్‌లో ఢిల్లీకి వరుసగా నాలుగో పరాజయం. ఇక నుంచి ఆ జట్టుకు ప్లేఆఫ్స్ కష్టాలు మొదలైనట్టే..!
173 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌కు మంచి ఆరంభమే దక్కింది. రోహిత్‌తో పాటు ఇషాన్ కిషన్ ధాటిగా ఆడాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 7.3 ఓవర్లలో 71 పరుగులు జోడించారు. ముకేష్ కుమార్ వేసిన తొలి ఓవర్లోనే రోహిత్ 4, 6, 4 తో తన ఆట ఎలా ఉండబోతుందో స్పష్టంగా చెప్పాడు. ముస్తాఫిజుర్ వేసిన రెండో ఓవర్లో ఇషాన్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. నోర్జే వేసిన మరుసటి ఓవర్లో ఇషాన్ ఓ బౌండరీ బాదగా చివరి రెండు బంతులను హిట్‌మ్యాన్ 6,4 గా మలిచాడు. అక్షర్ వేసిన ఐదో ఓవర్లో రెండో బంతికి సింగిల్ తీయడం ద్వారా ముంబై 50 పరుగులు దాటింది.
సాఫీగా లక్ష్యం దిశగా సాగుతున్న ఈ జోడీకి సమన్వయం లోపం వల్ల షాక్ తగిలింది. లలిత్ యాదవ్ వేసిన 8వ ఓవర్ మూడో బంతికి ఇషాన్ పాయింట్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న రోహిత్ సగం క్రీజు దాటినా ఇషాన్ మాత్రం కదల్లేదు. కానీ వెంటనే రోహిత్ కోసం వికెట్ త్యాగం చేసి రనౌట్ గా వెనుదిరిగాడు.
హిట్‌మ్యాన్ తోడుగా తిలక్ బాదగా..
ఇషాన్ స్థానంలో వచ్చిన తిలక్ వర్మతో కలిసి హిట్ మ్యాన్ ముంబై ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. కుల్దీప్ వేసిన 12వ ఓవర్లో లెగ్ సైడ్ దిశగా సింగిల్ తీసిన రోహిత్ అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఐపీఎల్ లో రోహిత్ 24 ఇన్నింగ్స్ (2021లో చివరి ఫిఫ్టీ) తర్వాత అతడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఇదే ఓవర్లో తిలక్ వర్మ ఓ సిక్సర్, రోహిత్ ఓ ఫోర్ కొట్టారు. ఈ మ్యాచ్‌లో తప్పుకుండా గెలవాలన్న పట్టుదలతో ఆడిన రోహిత్ - తిలక్ లు వికెట్లు కాపాడుకుంటూనే వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు.
15 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 123-1 గా ఉంది. చివరి ఐదు ఓవర్లలో 50 పరుగులు చేయాల్సి ఉండగా ముకేశ్ కుమార్ వేసిన 16వ ఓవర్లో తిలక్.. 4, 6, 6 తో లక్ష్యాన్ని కరిగించాడు.
ఏడు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు :
తిలక్ భారీ షాట్లతో విరుచుకుపడ్డా.. ముకేశ్ వేసిన అదే ఓవర్లో ఐదో బంతికి లో ఫుల్ టాస్ ను భారీ షాట్ ఆడబోయి డీప్ మిడ్ వికెట్ వద్ద మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చాడు. ఆ మరుసటి బంతికే ఫామ్ లేక తంటాలు పడుతున్న సూర్యకుమార్ యాదవ్ (0) కూడా మరో గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. ముస్తాఫిజుర్ వేసిన 17వ ఓవర్లో రోహిత్.. వికెట్ కీపర్ అభిషేక్ సూపర్ క్యాచ్ తో వెనుదిరిగాడు.
ఆఖర్లో హై డ్రామా..
వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయిన ముంబైకి ఆస్ట్రేలియా కుర్రాళ్లు టిమ్ డేవిడ్ (13 నాటౌట్), కామెరూన్ గ్రీన్ (17 నాటౌట్) లు ఆఖర్లో వచ్చినా భారీ మెరుపులు సాగలేదు. చివరి ఓవర్లో ఆరు పరుగుల కావాల్సి ఉండగా.. తొలి బంతికి ఒక్క పరుగే వచ్చింది. రెండు, మూడు బాల్స్ కు రన్ రాలేదు. నాలుగో బాల్ కు ఒక్క పరుగే వచ్చింది. ఐదో బంతికి ఒక్క పరుగే వచ్చినా చివరి బాల్ కు రెండు రన్స్ అవసరం కాగా.. టిమ్ డేవిడ్ - గ్రీన్ లు వికెట్ల మధ్య వేగంగా పరుగు తీసి ముంబైకి తొలి విజయాన్ని అందించారు.
ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 172 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (51), అక్షర్ పటేల్ (54)లు అర్థ సెంచరీలతో ఆదుకోగా మనీష్ పాండే (26) ఫర్వాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో బెహ్రాండార్ఫ్, చావ్లాలు తలా మూడు వికెట్లు తీయగా మెరిడిత్ రెండు వికెట్లు పడగొట్టాడు.