Rohit Sharma: రోహిత్ శర్మను ఊరిస్తున్న రికార్డులు, అరుదైన ఘనతల ముందు హిట్ మ్యాన్
ODI World Cup 2023: భారత జట్టును ముందుండి నడిపించిన సారధి రోహిత్ శర్మ ఇప్పటికే అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పుడు మరికొన్ని రికార్డులు బద్దలు కొట్టేందుకు రోహిట్ సిద్ధమయ్యాడు.

ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపు మీదున్న టీమిండియా... నెదర్లాండ్స్‌తో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటివరకూ భారత జట్టును ముందుండి నడిపించిన సారధి రోహిత్ శర్మ ఇప్పటికే అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పుడు మరికొన్ని రికార్డులు బద్దలు కొట్టేందుకు రోహిత్ సిద్ధమయ్యాడు. నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా సారధిని ఏడు రికార్డులు ఊరిస్తున్నాయి. ఇవి కూడా చేరుకుంటే భారత జట్టు విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకడిగా రోహిత్ నిలుస్తాడు.
మొత్తం ఏడు రికార్డులు హిట్ మ్యాన్ ముందు ఉండగా.. నెదర్లాండ్స్ మ్యాచ్‌లో రోహిత్ వీటిని అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ప్రపంచకప్‌లో టీమిండియా తరుఫున అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ పేరు మీద రికార్డు ఉంది. 2003 ప్రపంచకప్ ఎడిషన్‌లో దాదా 465 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే 441 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. నెదర్లాండ్స్ మ్యాచ్‌లో మరో 24 పరుగులు చేస్తే గంగూలీ రికార్డును బద్దలు కొడతాడు. నెదర్లాండ్స్ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్రపంచకప్‌లో వరుసగా తొమ్మిది మ్యాచ్‌లో గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ అరుదైన ఖ్యాతినార్జించనున్నాడు. వరల్డ్‌కప్‌లో అత్యంత వేగంగా 1500 పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు కూడా రోహిత్‌ను ఊరిస్తోంది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో 80 పరుగులు చేస్తే ప్రపంచకప్‌లో 1500 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్ల జాబితాలోకి రోహిత్ శర్మ చేరతాడు. ఇదే సమయంలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా కూడా నిలుస్తాడు.
ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్‌లలో 442 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ మరో 58 పరుగులు చేస్తే 500 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ప్రపంచకప్ చరిత్రలో ఈ అరుదైన ఘనతను రెండుసార్లు అందుకున్న బ్యాటర్‌గా రోహిత్ నిలుస్తాడు. వరల్డ్‌కప్ చరిత్రలో సచిన్ ఒక్కడే ఇప్పటివరకూ రెండుసార్లు 500లకు పైగా పరుగులు చేశాడు.1996 ప్రపంచకప్‌లో 523 పరుగులు చేసిన సచిన్.. 2003 ప్రపంచకప్‌లో ఏకంగా 673 పరుగులు సాధించాడు. 2019 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 648 పరుగులు చేశాడు.
ఒక క్యాలెండర్ ఇయర్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకూ 24 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో 58 సిక్సులు కొట్టాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివీలియర్స్ పేరు మీదున్న రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. నెదర్లాండ్స్ మ్యాచ్‌లో మరో సిక్సు కొడితే ఒకే ఏడాదిలో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా రోహిత్ అరుదైన ఘనత సాధిస్తాడు. 2015లో డివిలియర్స్ ఒకే ఏడాదిలో వన్డేల్లో 58 సిక్సర్లు కొట్టాడు. వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకూ హిట్ మ్యాన్ 25 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 45 సిక్సర్లు బాదాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరు మీద ఉంది. మహా సంగ్రామంలో గేల్ 49 సిక్సులు కొట్టగా గేల్ రికార్డు బద్ధలు కొట్టేందుకు రోహిత్ శర్మకు మరో ఐదు సిక్సులు అవసరం. నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ ఘనతను అందుకోవాలని హిట్ మ్యాన్ అభిమానులు ఆశిస్తున్నారు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో కనుక హిట్ మ్యాన్ సెంచరీ చేస్తే ఇండియాలో సచిన్ తర్వాత ఏ బ్యాటర్‌కు దక్కని మరో ఘనత కూడా రోహిత్ సొంతమవుతుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ చేస్తే క్రికెట్ ఆడే 11 దేశాలపైనా వన్డేలలో సెంచరీ చేసిన మూడో బ్యాటర్‌గా రోహిత్ నిలుస్తాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా నిలుస్తాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

