Ind Vs Eng T20 Series: గంభీర్ స్ట్రాటజీని తప్పుపట్టిన ఇంగ్లాండ్ మాజీ స్టార్, అలా ఆడితే తిప్పలేనని విమర్శలు
తరచూ జట్టులో బ్యాటింగ్ స్థానాలను మార్చకూడదని, ఆటగాళ్లకు స్థిరమైన బ్యాటింగ్ పొజిషన్ ఇవ్వాలని పీటర్సన్ సూచించాడు.లెప్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ను అస్థిరపరచడం కరెక్టు కాదన్నాడు.

Gambhir Vs Petersen: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ అమలు చేస్తున్న ఒక స్ట్రాటజీని ఇంగ్లాండ్ మాజీ స్టార్ కెవిన్ పీటర్సన్ తప్పుపట్టాడు. అలా చేయడం సరికాదని విమర్శించాడు. ముఖ్యంగా మూడో టీ20లో టీమిండియా ఓటమికి పరోక్షంగా ఆ స్ట్రాటజీ కారణమైందని తెలిపాడు. ఆ స్ట్రాటజీ ఏంటో కాదు.. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్.. మూడో టీ20లో ఈ పద్ధతితోనే ఇండియా భంగపాటుకు గురైందని ఇప్పటికే పలువురు మాజీలు విమర్శించాడు. తాజాగా పీటర్సన్ కూడా అందులో చేరాడు. ఓపెనర్లుగా వస్తున్న అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ లు ఒకరు కుడిచేతి వాటం కాగా, మరొకరు ఎడమ చేతివాటం కలిగిన బ్యాటర్లు. అయితే వీరిలో ఎవరు ఔటైతే వారి ప్లేసులో అదే చేతి వాటం కలిగిన బ్యాటర్లు బరిలోకి దిగాలన్నది ఈ రూల్. ఈ కారణంగానే నెం.3లో ఎవరు ఆడాలన్న అంశంపై పీటముడి పడుతోంది.
బ్యాటింగ్ ఆర్డర్ లో గందరగోళం..
రెండో టీ20లో అజేయ ఫిఫ్టీతో జట్టును గెలిపించిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మను మూడో టీ20లో అదే స్థానంలో బ్యాటింగ్ కు పంపలేదు. అతనికి బదులుగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ను పంపించారు. అయితే అతను త్వరగానే వెనుదిరిగాడు. అలా, ఒక్కో బ్యాటర్ అవుతున్న కోద్ది, అదే చేతివాటం గల బ్యాటర్లు క్రీజులోకి రావడాన్ని తప్పుపట్టాడు. ఈక్రమంలో స్పెషలిస్టు బ్యాటర్ అయిన ధ్రువ్ జురెల్ నెం.8లో బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది. అతని కంటే ముందు బ్యాటింగ్ కు దిగిన ఆల్ రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ బంతులు వేస్ట్ చేశారు. దీంతో భారత్ ఓటమిపాలైంది. నిజానికి ధ్రువ్ కాస్త ముందు దిగితే ఫలితం వేరేలా ఉండేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. ధ్రువ్ లాంటి స్పెషలిస్టు బ్యాటర్ ను నెం.8లో ఆడించడం ఏంటో తనకు అర్థం కాలేదని, ఇలా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం బ్యాటింగ్ ఆర్డర్ ను దెబ్బతీసుకునడం సరికాదని పీటర్సన్ పేర్కొన్నాడు.
రోల్ పై క్లారిటీ ఉండాలి..
ఇక తరచూ జట్టులో బ్యాటింగ్ స్థానాలను మార్చకూడదని, ఆటగాళ్లకు స్థిరమైన బ్యాటింగ్ పొజిషన్ ఇవ్వాలని పీటర్సన్ సూచించాడు. లెప్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ను అస్థిరపరచడం కరెక్టు కాదని, నాణ్యమైన బ్యాటర్లకు ఎక్కువ బంతులు ఆడే అవకాశం కల్పించాలని సూచించాడు. ఇక శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో భారత టీమ్ మేనేజ్మెంట్ ఇలాంటి ప్రయోగాలకు పోలేదు. అవసరానికి తగిన విధంగా వ్యవహరించి మంచి ఫలితాన్ని రాబట్టింది. ఈ టీ20లో ఇంగ్లాండ్ పై 15 పరుగులతో నెగ్గిన ఇండియా, 3-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య అప్రధాన్యమైన ఐదో టీ20 ముంబైలో జరుగుతుంది. ఆ తర్వాత ఇరుజట్ల మధ్య ఈనెల 6 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

