(Source: ECI/ABP News/ABP Majha)
Jasprit Bumrah: కమ్‌బ్యాక్‌కి ముందే బుమ్రా రికార్డు! టీమ్‌ఇండియా కెప్టెన్‌గా మొదటి బౌలర్ అతడే!
Jasprit Bumrah: టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా పునరాగమనం మామూలుగా లేదు! ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతున్నాడు.
Jasprit Bumrah:
టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) పునరాగమనం మామూలుగా లేదు! ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతున్నాడు. భారత టీ20 జట్టుకు సారథ్యం వహిస్తున్న పదకొండో ఆటగాడిగా ఘనత సాధిస్తున్నాడు. ఇక టీమ్‌ఇండియాకు నాయకత్వం వహిస్తున్న మొదటి పేసర్‌గా చరిత్రలో నిలిచిపోనున్నాడు.
వెస్టిండీస్ సిరీస్ ముగిసిన తర్వాత టీమ్‌ఇండియా ఐర్లాండ్ (India vs Ireland) పర్యటనకు వెళ్లింది. ఆగస్టు 18 నుంచి మూడు టీ20ల సిరీసులో తలపడనుంది. ఆసియాకప్ నేపథ్యంలో సీనియర్లకు విశ్రాంతి ఇచ్చారు. దాంతో సెలక్టర్లు కుర్రాళ్లనే ఎంపిక చేశారు. గాయాలు, శస్త్రచికిత్సతో ఏడాదిన్నరకు పైగా క్రికెట్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీసుతో పునరాగమనం చేస్తున్నాడు. అంతా యువకులే కావడంతో బీసీసీఐ (BCCI) అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించింది.
టీమ్‌ఇండియా ఇప్పటి వరకు 204 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడింది. ఇందులో మహేంద్ సింగ్ ధోనీ 72 మ్యాచులకు సారథ్యం వహించాడు. 41 గెలిచి 28 ఓడాడు. విజయాల శాతం 56.94. ఇక రోహిత్ శర్మ 51 మ్యాచులకు నాయకత్వం వహించాడు. గెలుపోటములు 39-12. కింగ్ కోహ్లీ 50 మ్యాచుల్లో భారత్‌ను నడిపించాడు. 30 గెలిచి 16 ఓడాడు. హార్దిక్ పాండ్య 16 మ్యాచుల్లో జట్టును నడిపించాడు. గెలుపోటముల రికార్డు 10-5. ఒక మ్యాచ్ టై అయింది.
రెగ్యులర్ కెప్టెన్లు లేనప్పుడు రిషభ్ పంత్ (5), శిఖర్ ధావన్ (3), సురేశ్ రైనా (3), అజింక్య రహానె (2), కేఎల్ రాహుల్ (1), వీరేంద్ర సెహ్వాగ్ (1) కొన్ని మ్యాచులకు సారథ్యం వహించాడు. ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా వంతు వచ్చింది. దాంతో టీమ్‌ఇండియాకు నాయకత్వ వహిస్తున్న పదకొండో ఆటగాడిగా రికార్డు సృష్టిస్తున్నాడు. అలాగే కెప్టెన్సీ చేయబోతున్న భారత మొదటి పేసర్ అవుతున్నాడు. ఆసియాకప్, ఆస్ట్రేలియా సిరీస్ సమయంలో చైనాలో ఆసియా క్రీడలు జరుగుతున్నాయి. ఇందులో క్రికెట్‌కు చోటిచ్చారు. ఈ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్‌కు పగ్గాలు అప్పగించారు. దాంతో అతడు 12వ కెప్టెన్ అవుతాడు.
IND vs IRE T20 సిరీస్ పూర్తి షెడ్యూలు
ఆగస్టు 18, 2023: డబ్లిన్‌లో మొదటి టీ20
ఆగస్టు 20, 2023: డబ్లిన్‌లో రెండో టీ20
ఆగస్టు 23, 2023: డబ్లిన్‌లో మూడో టీ20
IND vs IRE T20 సిరీస్‌కు భారత జట్టు
జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్
IND vs IRE T20 సిరీస్‌కు ఐర్లాండ్ జట్టు
పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బాల్‌బిర్నే, రాస్ అడైర్, హ్ఆయరీ టెక్టార్, గరేత్ డిలానీ, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, ఫిన్ హ్యాండ్, లార్కన్ టక్కర్, మార్క్ అడైర్, జోషువా లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, థియో వాన్ వూర్‌కామ్, బెంజమిన్ వైట్, క్రెయిగ్ యంగ్
Also Read: భారత్ vs ఐర్లాండ్ టీ20 సమరం - ఈ యాప్‌లో ఫ్రీ లైవ్‌స్ట్రీమింగ్!