BCCI Planting Tree Initiative: బీసీసీఐ హరిత హారం - ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు!
IPL 2023 Qualifier 1, GT vs CSK: ఐపీఎల్ - 16 ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి సంచలన నిర్ణయం తీసుకుంది.
BCCI Planting Tree Initiative: ప్రపంచంలో అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా పేరుగాంచిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ - 16 లో భాగంగా ప్లేఆఫ్స్ షెడ్యూల్ నేడే మొదలుకాగా.. ఈ నాలుగు మ్యాచ్ (రెండు క్వాలిఫయర్, ఒక ఎలిమినేటర్, ఫైనల్) లలో బౌలర్లు వేసే ప్రతి డాట్ బాల్‌కు బీసీసీఐ ఐదు వందల మొక్కలు నాటనుంది.
చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్‌తో చెపాక్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ క్వాలిఫయర్‌కు ముందు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేస్తున్న స్టార్, జియోలలో డాట్ బాల్స్ వచ్చినప్పుడల్లా స్కోరుకార్డులో చెట్టు సింబల్ కనబడింది. దీంతో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు ఇది కొత్తగా అనిపించి దీనిపై నెట్టింట వెతకడం మొదలుపెట్టడంతో అసలు విషయం తెలిసింది.
దీని ప్రకారం.. ప్లేఆఫ్స్ లో ఆడబోయే నాలుగు మ్యాచ్‌లలో వేసే ప్రతి డాట్ బాల్‌కు బీసీసీఐ ఏకంగా ఐదు వందల మొక్కలను నాటనుంది. ఉదాహరణకు ఒక్క మ్యాచ్ లో 50 డాట్ బాల్స్ నమదైతే ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కల చొప్పున మొత్తంగా 25 వేల మొక్కలు నాటేనుంది. మొక్కలు నాటే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టనుంది బీసీసీఐ.
The BCCI will be planting 500 trees for each dot ball bowled in IPL 2023 Playoffs. pic.twitter.com/Ac3xVog3UH
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 23, 2023
సీఎస్కే - జీటీ మ్యాచ్‌లో..
చెపాక్‌లో చెన్నై - గుజరాత్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భాగంగా టైటాన్స్ బౌలర్లు మొత్తంగా 20 ఓవర్లలో 34 డాట్ బాల్స్ వేశారు. అంటే ఒక్క సీఎస్కే ఇన్నింగ్స్ ద్వారా బీసీసీఐ 17 వేల (34*500=17,000) మొక్కలు నాటనుంది. మరి ఈ మ్యాచ్ మొత్తంతో పాటు రాబోయే మూడు మ్యాచ్‌లలో ఎన్ని డాట్ బాల్స్ నమోదవుతాయో చూడాలి.
34 dot ball in CSK innings.
— Johns. (@CricCrazyJohns) May 23, 2023
BCCI will plant 17,000 trees - a great initiative by Jay Shah & BCCI - this will continue through the knock-outs. pic.twitter.com/B8KBk2qc9h
వాళ్లే స్ఫూర్తి..
గతేడాది ఐపీఎల్ సీజన్‌లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ జట్టు.. ప్రముఖ ఫ్రెంచ్ సంస్థ షిండర్ ఎలక్ట్రిక్ తో కలిసి ఓ అద్భుతైమన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత ఆరు నెలల కాల వ్యవధిలో 17వేల మొక్కలు నాటాలని నిర్ణయించింది. ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ద్వారా సుమారు 10 వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు విడుదలవుతున్నందున.. రాబోయే 30 ఏండ్లలో కార్భన్ ఫ్రీ మ్యాచ్ గా ఆడించేందుకు గాను ఈ ఆలోచన చేసింది. బీసీసీఐ కూడా ఈ కార్యక్రమం నుంచే స్ఫూర్తి పొందిందని తెలుస్తున్నది. ఈ కార్యక్రమం విజయవంతమైతే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివే మరిన్ని చేసే అవకాశం లేకపోలేదు.