యువీ రికార్డును బ్రేక్ చేసిన ఉనద్కత్, ఇండియా ఆరోన్ ఫించ్ అంటూ ట్రోల్స్
IPL 2023: ఐపీఎల్- 16లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న సౌరాష్ట్ర బౌలర్ జయదేవ్ ఉనద్కత్ టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేశాడు.
Jaydev Unadkat Record: టీమిండియాకు 2010లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పదేండ్లకు (2022లో) రీఎంట్రీ ఇచ్చిన జయదేవ్ ఉనద్కత్ ఐపీఎల్ లో యువరాజ్ సింగ్ తో పాటు భారత మాజీ క్రికెటర్లు పార్థీవ్ పటేల్, ఇషాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్, దినేశ్ కార్తీక్, రాబిన్ ఊతప్ప ల రికార్డులను బ్రేక్ చేశాడు. శనివారం లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఎంట్రీ ఇచ్చిన ఉనద్కత్‌కు ఐపీఎల్ లో ఇది ఏడో ఫ్రాంచైజీ. పైన పేర్కొన్న వారంతా ఐపీఎల్ లో ఆరు ఫ్రాంచైజీల తరఫున ఆడారు. ఉనద్కత్ తాజాగా ఈ రికార్డును తుడిపేశాడు.
13 ఏండ్లు.. ఏడు ఫ్రాంచైజీలు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి 2010లో అరంగేట్రం చేశాడు ఉనద్కత్. తొలి సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన అతడు.. 2012 వరకూ ఆ టీమ్ తోనే ఉన్నాడు. 2013లో ఆర్సీబీకి వెళ్లిన ఉనద్కత్.. 2014లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. 2017 లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ కు మారిన ఈ సౌరాష్ట్ర కెప్టెన్.. మరుసటి ఏడాది రాజస్తాన్ రాయల్స్ తో ఆడాడు. ఈ సీజన్ లో రాజస్తాన్ అతడి కోసం ఏకంగా రూ. 11.5 కోట్లు వెచ్చించడం గమనార్హం. 2021 వరకూ ఉనద్కత్ రాజస్తాన్ తోనే ఉన్నాడు. కానీ 2022లో ముంబై అతడిని కొనుగోలు చేసింది. గత డిసెంబర్ లో జరిగిన వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ కు మారాడు ఉనద్కత్.
ఇండియన్ ఫించ్..
ఐపీఎల్ లో ఏడు టీమ్ ల తరఫున ఆడిన ఉనద్కత్ పై సోషల్ మీడియాలో సెటైర్లు కూడా బాగానే పడుతున్నాయి. ఉనద్కత్ ను ‘ఇండియన్ ఆరోన్ ఫించ్’అని నెటిజన్లు ఆటపట్టిస్తున్నారు. ఆసీస్ మాజీ సారథి ఫించ్.. ఐపీఎల్ లో ఏకంగా 9 ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. ప్రతీ సీజన్ కూ ఫ్రాంచైజీ మారే ఫించ్.. గతేడాది కేకేఆర్ కు ఆడి ఐపీఎల్ కెరీర్ కు ముగింపు పలికాడు. మొత్తంగా ఐపీఎల్ లో ఫించ్.. రాజస్తాన్, ఢిల్లీ, పూణె, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, కేకేఆర్ లకు ప్రాతినిథ్యం వహించాడు. వేలంలలో ఫించ్ ను కొనుగోలు చేసిన ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా తర్వాత ఏడాది ఫించ్ ను రిటైన్ చేసుకోలేదు.
వీళ్లేమీ తక్కువ కాదు..
ఫించ్, ఉనద్కత్ తో పాటు ఆరు ఫ్రాంచైజీలకు ఆడిన ఆటగాళ్లు వీరే..
- పార్థీవ్ (సీఎస్కే, కొచ్చి టస్కర్స్, డెక్కన్ చార్జర్స్, ఎస్ఆర్‌హెచ్, ఆర్సీబీ, ముంబై),
- యువరాజ్ సింగ్ (కింగ్స్ లెవన్ పంజాబ్, పూణె వారియర్స్, ఆర్సీబీ, ఢిల్లీ, ఎస్ఆర్‌హెచ్, ముంబై)
- ఇషాంత్ శర్మ (కేకేఆర్, డెక్కన్ ఛార్జర్స్, ఎస్ఆర్‌హెచ్, పూణె, కింగ్ లెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్)
- ఇర్ఫాన్ పఠాన్ (కేకేఆర్, డెక్కన్ ఛార్జర్స్, ఎస్ఆర్‌హెచ్, సీఎస్కే, పూణె, గుజరాత్ లయన్స్)
- దినేశ్ కార్తీక్ (ఢిల్లీ, పంజాబ్, ముంబై, ఆర్సీబీ, గుజరాత్ లయన్స్, కేకేఆర్)
- రాబిన్ ఊతప్ప (ముంబై, ఆర్సీబీ, పూణె, కేకేఆర్, రాజస్తాన్, సీఎస్కే)