Who is Rinku Singh: ఎవరీ రింకూ సింగ్? కేకేఆర్‌ను గెలిపించిన ఓవర్ నైట్ స్టార్ డిటెయిల్స్
IPL 2023: ఐపీఎల్‌లో కాలం కలిసొస్తే యువ క్రికెటర్లు ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో ఓవర్ నైట్ స్టార్ అవుతున్నారు. ఈ జాబితాలో కొత్తగా వచ్చిన హీరో రింకూ సింగ్.
Who is Rinku Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను లలిత్ మోడీ ఏ ఉద్దేశంతో ప్రారంభించాడో.. బీసీసీఐ దీనిని మరే ఉద్దేశంతో కొనసాగిస్తుందో.. ఈ లీగ్‌కు వచ్చే సంపద వల్ల ఆర్థికంగా బోర్డు, ఫ్రాంచైజీలు ఎంత సంపాదిస్తున్నాయో తెలియదు గానీ దేశంలోని మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తీసుకొస్తున్నది ఐపీఎల్. గడిచిన 15 సీజన్లు (ప్రస్తుతం జరుగుతున్నది 16వ సీజన్)గా ఇలా వెలుగులోకి వచ్చినవాళ్లు వందలాది మంది ఉన్నారు. ప్రస్తుతం భారత జాతీయ జట్టులో ఆడుతున్నవారిలో పలువురు ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవారే. కాలం కలిసొస్తే యువ క్రికెటర్లు ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో ఓవర్ నైట్ స్టార్ అవుతున్నారు. ఈ జాబితాలో కొత్తగా వచ్చిన హీరో రింకూ సింగ్. గుజరాత్ టైటాన్స్ - కోల్‌కతా నైట్ రైడర్స్ తో ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్.. చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి అసలు గెలుపు మీద ఆశలే లేని కేకేఆర్‌కు అద్భుత విజయాన్ని అందించి ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.
ఎవరీ రింకూ..?
కేకేఆర్‌కు ఆడుతున్న రింకూది ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్. 1997 అక్టోబర్ 12న అలీగఢ్ లో పుట్టిన రింకూది పేద కుటుంబం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కడు పేదలకు ప్రకటించే అన్ని సంక్షేమ పథకాలకూ వాళ్లు అర్హులే. అతడి నాన్న ఖాన్‌చంద్ర ఓ ఎల్పీజీ సిలిండర్లను డోర్ టు డోర్ సప్లై చేసే ఆటో డ్రైవర్? రింకూ అన్న కూడా అదే పని చేస్తాడు. రెండు గదులు ఉన్న ఇరుకు ఇంట్లో జీవనం. 9వ తరగతి చదువుకున్న రింకూ.. చదువు పెద్దగా అబ్బకపోవడంతో దానిని మానేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లు స్వీపర్, క్లీనర్ గా కూడా పనిచేశాడు. చిన్ననాటి నుంచి క్రికెట్ మీద మక్కువ పెంచుకున్న అతడు.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఐపీఎల్ లో 2018లో ఎంట్రీ ఇచ్చాడు.
ఐదేండ్లుగా కేకేఆర్‌తోనే..
అలీగఢ్ నుంచి ఐపీఎల్ ఆడుతున్న తొలి క్రికెటర్ రింకూనే. దేశవాళీలో రింకూ ప్రదర్శన చూసిన కేకేఆర్ టీమ్.. 2018 ఐపీఎల్ వేలంలో అతడిని రూ. 80 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్ లో ఆడింది నాలుగు మ్యాచ్‌లే. చేసింది 20 పరుగులే. ఆ తర్వాత కూడా 2019 (5 మ్యాచ్ లు - 37 రన్స్), 2020 (1 మ్యాచ్ 11 రన్స్) రెండేండ్లు నిరాశగా గడిచిపోయాయి. 2021లో అతడికి ఆడే ఛాన్సే రాలేదు. కానీ 2022లో రింకూ.. రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 23 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఓ సిక్సర్ తో 42 పరుగులు చేసి వెలుగులోకి వచ్చాడు. ఈ సీజన్ లో రింకూ సింగ్ కూడా నమ్మదగ్గ బ్యాటరే అన్న అవగాహన కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ కు తెలిసొచ్చింది.
Watching this on L➅➅➅➅➅P... and we still can't believe what we just witnessed! 🤯pic.twitter.com/1tyryjm47W
— KolkataKnightRiders (@KKRiders) April 9, 2023
2023లో విశ్వరూపం..
రింకూ సింగ్ భారీ షాట్లు ఆడతాడని అందరికీ తెలిసినా అతడి సామర్థ్యమేంటో కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ తో పాటు అందరికీ నిన్నే తెలిసొచ్చింది. నాలుగు రోజుల క్రితం ఈడెన్ గార్డెన్ లో ఆర్సీబీతో మ్యాచ్ లో 33 బంతుల్లో 46 పరుగులు చేసిన అతడు.. గుజరాత్ తో మ్యాచ్ లో విశ్వరూపమే చూపాడు. వాస్తవానికి నిన్నటి మ్యాచ్ లో.. 19వ ఓవర్ కు ముందు రింకూ.. 11 బంతులాడి 7 పరుగులే చేశాడు. చేయాల్సిన లక్ష్యమేమో 12 బంతుల్లో 43. అసాధ్యమే అనిపించింది. కానీ జోషువా లిటిల్ వేసిన 19వ ఓవర్లో ఆఖరి రెండు బంతులలో 6,4 కొట్టిన రింకూ.. యశ్ దయాల్ వేసిన చివరి ఓవర్లో ఐదు బంతులను భారీ సిక్సర్లుగా మలిచి కేకేఆర్ కు సంచలన విజయాన్ని అందించాడు.
కాగా.. 2022 వరకూ రింకూ ఐపీఎల్ శాలరీ రూ. 80 లక్షలు కాగా 2023 సీజన్ లో అతడిని వేలానిక వదిలేసిన కేకేఆర్.. మళ్లీ వేలంలో రూ. 55 లక్షలే వెచ్చించి దక్కించుకుంది. గతంలో కంటే రూ. 25 లక్షలు తగ్గినా రింకూ మాత్రం.. తన ప్రదర్శనతో తానేంటో నిరూపించుకున్నాడు.
JHOOME JO RINKUUUUU !!! My baby @rinkusingh235 And @NitishRana_27 & @venkateshiyer you beauties!!! And remember Believe that’s all. Congratulations @KKRiders and @VenkyMysore take care of your heart sir! pic.twitter.com/XBVq85FD09
— Shah Rukh Khan (@iamsrk) April 9, 2023
‘ఒక మనిషిని వందేళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి వందేళ్లు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతడు సాధించిన విజయాలు అతడిని వందేళ్లు బతికిస్తాయి’ అంటూ విక్రమార్కుడు సినిమాలో విక్రమ్ సింగ్ రాథోడ్ గురించి రాజీవ్ కనకాల చెప్పే డైలాగ్ ను రింకూ సింగ్ కు అన్వయించుకుంటున్నారు కేకేఆర్ ఫ్యాన్స్. ‘ఐపీఎల్ లో అభిమానులు గుర్తుంచుకోవాలంటే సీజన్‌లకు సీజన్లు పాతుకుపోవాల్సిన పన్లేదు.. ఒక్క ఇన్నింగ్స్ చాలు.. ఆ ఒక్క ఇన్నింగ్స్ తో ప్రజలు అతడిని లీగ్ ఉన్నన్ని రోజులూ గుర్తుంచుకుంటారు’ అని సోషల్ మీడియాలో రింకూ ఫోటోలు, వీడియోలతో హంగామా చేస్తున్నారు.