Rohit Sharma Injured: టీమిండియాకు బిగ్ షాక్- ప్రాక్టీస్ సెషన్లో గాయపడిన రోహిత్.. అతడి పరిస్థితి ఎలా ఉందంటే..!
కుమారుడు జన్మించడం కారణంగా తొలి టెస్టుకు దూరమైన రోహిత్.. అడిలైడ్ లో జరిగిన రెండో టెస్టు నుంచి జట్టులో ఆడుతున్నాడు. అయితే ఇప్పటివరకు రెండు టెస్టులాడిన హిట్ మ్యాన్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు.
Ind Vs Aus 4th test updates: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ కు షాక్. భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడినట్లుగా తెలుస్తోంది. ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టు కోసం గాను టీమిండియా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. నిజానికి సోమవారం హాలిడే అయినప్పటికీ భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ కే మొగ్గు చూపారు. అయితే ఈ ప్రాక్టీస్ లో భాగంగా రోహిత్ ఎడమ మోకాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తననుతానే పొరపాటున గాయపర్చుకున్నట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన తర్వాత ఎడమ మోకాలికి కట్టు కట్టారు. ఒక చోట కూర్చుని రోహిత్ సేద తీరుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే గాయం తర్వాత కూడా రోహిత్ ప్రాక్టీస్ సాగించినట్లు సమాచారం.
During the practice session, Rohit Sharma was hit on the knee and KL Rahul on the right hand. pic.twitter.com/iod1uPYD6U
— Vipin Tiwari (@Vipintiwari952) December 22, 2024
కఠోర సాధనలో టీమిండియా..
తొలి టెస్టులో అద్భుత ప్రదర్శన తర్వాత తర్వాతి రెండు టెస్టులో అంచనాలకు అనుగుణంగా రాణించలేక పోయిన టీమిండియా.. బాక్సింగ్ డే టెస్టులో సత్తా చాటాలని గట్టి పట్టుదలగా ఉంది. ముఖ్యంగా తన పేస్్ తో కంగారూ బ్యాటర్లను వణికిస్తున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. తన పేస్ కు మరింత పదును పెట్టాడు. నెట్ లో రకరకాల అస్త్రాలతో బౌలింగ్ చేశాడు. ఇక తమ లయ దొరకబుచ్చుకునేందుకు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ ప్రయత్నిస్తున్నారు. మంచి లైన్ అండ్ లెంగ్త్ లో బౌలింగ్ చేస్తూ ఆకట్టుకున్నారు. ఇక ఈ సిరీస్ లో తన ముద్ర వేయలేక పోయిన వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నెట్ లో శ్రమిస్తున్నాడు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లను ఎదుర్కుంటూ కనిపించాడు. సిరీస్ లో మంచి టచ్ లో ఉన్న కేఎల్ రాహుల్ కూడా జోరుగా ప్రాక్టీస్ కొనసాగించాడు.
Also Read: Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
రోహిత్ ను తక్కువ అంచనా వేయొద్దు..
ఆసీస్ టూర్ లో మిడిలార్డర్ లో ఆడుతూ పరుగులు చేయడంలో తంటాలు పడుతున్న రోహిత్ ను ఆసీస్ మాజీ సారథి మైకేల్ క్లార్క్ వెనకేసుకొచ్చాడు. ఫామ్ ఆధారంగా రోహిత్ ను అంచనా వేయడం సరికాదని, ప్రస్తుతం కొంచెం సమయం తీసుకుంటున్న హిట్ మ్యాన్ త్వరలోనే గాడిన పడుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. నిజానికి జట్టు ప్రయోజనాల కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసి, ఆరో నెంబర్లలో బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ అంకిత భావాన్ని మెచ్చుకున్నాడు. అతను అందరూ సహకరించాలని కోరాడు. మరోవైపు ప్రాక్టీస్ సెషన్లో గాయం నుంచి రోహిత్ కోలుకున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే తను మెల్ బోర్న్ టెస్టులో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఐదు టెస్టుల ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ ను 295 పరుగులతో భారత్, రెండో టెస్టును పది వికెట్లతో ఆసీస్ గెలుచుకున్నాయి. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో మూడో టెస్టు డ్రాగా ముగిసింది.