Ind Vs Aus Test Series: 'గబ్బా'లో గెలిస్తే సిరీస్ సొంతమైనట్లే.. రోహిత్ ఆ స్థానంలో బ్యాటింగ్ కు దిగాలి... మాజీ కోచ్ సూచన
Rohit Sharma: బ్రిస్బేన్ లో భారత జట్టు గెలుపొందితే, సిరీస్ నెగ్గేందుకు మార్గం సుగమం అవుతుందని మాజీ కోచ్ శాస్త్రి వాఖ్యానించాడు. అలాగే రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్ పై కూడా సూచనలు చేశాడు.
Ind Vs Aus: ఈనెల 14 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలకమైన మూడో టెస్టు మ్యాచ్ బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో జరుగతుంది. సిరీస్ లో చెరో మ్యాచ్ గెలవడంతో ఇరుజట్లు ప్రస్తుతం 1-1తో సమఉజ్జీగా ఉన్నాయి. అయితే గబ్బాలో భారత్ గెలవడం అత్యంత ముఖ్యమని భారత మాజీ కోచ్ రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు. మూడో టెస్టులో గెలుపుతో సిరీస్.. విజేత ఎవరనే దానిపై ఒక అవగాహన వస్తుందని పేర్కొన్నాడు. భారత టీమ్ మేనేజ్మెంట్ సరికొత్త వ్యూహాలతో ఈ టెస్టును నెగ్గేలా ఆడాలని సూచించాడు. తొలి టెస్టులో ఓడినా రెండో టెస్టులో గెలుపొందిన ఆసీస్ లో ఆత్మవిశ్వాసం పతాక స్థాయిలో ఉందని, మూడో టెస్టులో ఆ జట్టును దెబ్బకొడితే, సిరీస్ ను గెలిచే అవకాశముంటుందని శాస్త్రి తెలిపాడు.
రోహిత్ ఓపెనింగ్ లోనే ఆడాలి..
గత తొమ్మిదేళ్లుగా ఓపెనింగ్ స్థానంలోనే రోహిత్ రాణిస్తున్నాడని, ఈ క్రమంలో గబ్బాలోనూ తను ఓపెనర్ గా బరిలోకి దిగాలని శాస్త్రి సూచించాడు. కొత్త బంతిపై తను ఎదురుదాడికి దిగ గలడని, రోహిత్ ను ఓపెనింగ్ లోనే పంపిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించాడు. జట్టును ముందుండి నడిపించేందుకు తను ఆ స్థానంలోనే రావడం ముఖ్యమని తెలిపాడు. నిజానికి కొడుకు పుట్టడంతో పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో రోహిత్ ఆడలేకపోయాడు. అయితే ఆ మ్యాచ్ లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ సత్తా చాటడంతో వారినే రెండో టెస్టులో ఓపెనింగ్ లో పంపించారు. అయితే రెండో టెస్టులో బరిలోకి దిగిన రోహిత్.. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి తొమ్మిది పరుగులే చేసి ఘోరంగా విపలమయ్యాడు. నిజానికి తను ఈ సీజన్ లోనే అంతంతమాత్రంగా రాణిస్తున్నాడు. 12 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ కేవలం ఒక్క ఫిఫ్టీ మాత్రమే సాధించాడు.
విరాట్ ను ఊరిస్తున్న రికార్డు..
మరోవైపు బ్రిస్బేన్ లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఒక రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్ లో సెంచరీ సాధిస్తే, ఆసీస్ లోని అన్ని మైదానాల్లో సెంచరీలు చేసిన మూడో బ్యాటర్ గా నిలుస్తాడు. ఇప్పటివరకు లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆలిస్టర్ కుక్ మాత్రమే ఈ రికార్డు నమోదు చేశారు. అడిలైడ్ లో మూడు, పెర్త్ లో రెండు, మెల్బోర్న్, సిడ్నీలలో ఒక్కో సెంచరీ కోహ్లీ ఖాతాలో ఉన్నాయి. బ్రిస్బేన్ లో జరిగే మూడోటెస్టులోనూ తను సెంచరీ చేస్తే దిగ్గజాల సరసన చేరతాడు. ప్రస్తుతం 36 ఏళ్ల వయస్సున్న కోహ్లీకి ఇదే ఆఖరి ఆసీస్ పర్యటనగా పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ఆసీస్ పర్యటనలో రెండు టెస్టులు ఆడిన కోహ్లీ.. ఒక సెంచరీని సాధించాడు. మిగతా మూడు ఇన్సింగ్స్ లో విఫలమయ్యాడు. దీంతో బ్రిస్బేన్ లో కింగ్ బ్యాట్ నుంచి పరుగుల వరద పారాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read: Rohit Vs Jaiswal: జైస్వాల్‌ను హోటల్‌లో వదిలేసి ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయిన రోహిత్ టీం!