Rinku Singh Wedding: రింకూ సింగ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ప్రియా సరోజ్.. జూన్ 8న క్రికెటర్ ఎంగేజ్‌మెంట్.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలుసా
Rinku Singh Priya Saroj Wedding: సామాజిక పార్టీ ఎంపీ ప్రియా సరోజ్, క్రికెటర్ రింకు సింగ్ నవంబర్ 18న వారణాసిలో వివాహం చేసుకోనున్నారు. జూన్ 8న లక్నోలో నిశ్చితార్థం.

Priya Saroj and Rinku Singh Wedding Date: టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఐపీఎల్ రాణించి టీమిండియాకు ఎంపికైన రింకూ సింగ్ మొన్నటివరకూ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. జూన్ 8న అతడి నిశ్చితార్థం కాగా, నవంబర్ నెలలో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నాడు రింకూ సింగ్. ఇంతకీ రింకూ సింగ్ పెళ్లిచేసుకునేది సాధారణ అమ్మాయిని మాత్రం కాదు.
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్, ప్రియా సరోజ్ ల నిశ్చితార్థం జూన్ 8న లక్నోలో ఘనంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు ప్లాన్ చేశాయి. అయితే ప్రియా సరోజ్ మరెవరో కాదు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా ఆమె సేవలు అందిస్తున్నారు. లోక్‌సభకు ఎన్నికైన అతి పిన్న వయస్కుల లో ప్రియా సరోజ్ ఒకరని తెలిసిందే. ఎంగేజ్‌మెంట్ అనంతరం నాలుగు నెలలకు వారణాసిలో నవంబర్ 18న రింకూ సింగ్, ప్రియా సరోజ్ వివాహ బంధంలోకి అడుగుపెడతారు. వారణాసిలోని తాజ్ హోటల్‌లో వీరి వివాహం జరగనుంది.
ప్రియా సరోజ్, రింకు సింగ్ మ్యారేజ్ న్యూస్ బయటకు రావడంతో క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాజకీయ వర్గాలు ప్రియా సరోజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. వీరి ఎంగేజ్‌మెంట్, వివాహంపై తాజా, మాజీ క్రికెటర్లతో పాటు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. రింకూ సింగ్, ప్రియా సరోజ్ వివాహానికి హాజరై సందడి చేయనున్నారు.
ప్రియా సరోజ్, రింకూ సింగ్ వివాహం గురించి ఈ ఏడాది జనవరిలో తొలిసారి వైరల్ అయింది. రింకూ సింగ్, ప్రియా సరోజ్ కుటుంబాలు అన్ని వివరాలు చెక్ చేసుకుని, ముహుర్తాల కోసం ఎదురుచూశారు. పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, వివాహం చేసుకోవాలని భావిస్తున్నారంటూ పెద్దలు తెలిపారు. దీంతో రెండు కుటుంబాల్లోనూ వివాహ సందడి కనిపిస్తోంది.
ప్రియా సరోజ్, రింకు సింగ్ పరిచయం ఎలా..
ప్రియా సరోజ్ తండ్రి తుఫానీ సరోజ్ సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత. తన కుమార్తె ప్రియాకు ఒక స్నేహితురాలి తండ్రి క్రికెటర్. ఆయన ద్వారానే రింకూ సింగ్, ప్రియా సరోజ్ తొలిసారి కలిశారని సమాచారం. వీరిద్దరికి చాలా కాలం కిందట పరిచయం అయింది. వారి పరిచయం ప్రేమగా మారింది. ప్రియా, రింకూలు తరచుగా ఫోన్లో టచ్‌లో ఉంటున్నారు. తమ ప్రేమను పెద్దలకు చెప్పడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ నెలలో ఎంగేజ్ మెంట్, నవంబర్ నెలలో వివాహం జరిపించడానికి ముహుర్తం ఫిక్స్ చేశారు.
26 ఏళ్ల ప్రియా సరోజ్ ఉత్తరప్రదేశ్‌లోని మచ్చిలిషెహర్ ఎంపీగా ఉన్నారు. ఆమె తండ్రి తుఫానీ సరోజ్ గతంలో అదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా చేశారు. రింకూ సింగ్ టీమిండియా క్రికెటర్, అతడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఐపీఎల్ టీ20లో అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ లీగ్ తరువాత రెండు కుటుంబాలు అలీగఢ్‌లో కలిసి చర్చించిన అనంతరం జూన్ 8న నిశ్చితార్థం, నవంబర్ 18న మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఐపీఎల్ లో రింకూ టీమ్ కేకేఆర్ లీగ్ స్టేజీకి పరిమితం కావడంతో వెంటనే ఇరు కుటుంబాలు ముహూర్తం కోసం చూసి తేదీలు నిశ్చయించారు.





















