IPL Fan Park In Kakinada: కాకినాడలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్.. ఫ్రీ ఎంట్రీతో క్రికెట్ అభిమానులకు పండగే.. లక్కీ డ్రా సైతం
IPL 2025: ఐపీఎల్ ఫైనల్ క్రీడా సంబరం కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తుండగా ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు కాకినాడలో భారీగా ఐపీఎల్ ప్యాన్ పార్క్ ను సిద్ధం చేస్తున్నారు..

IPL Fan Park In Kakinada | ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జూన్ 3, 2025న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి RCB ఫైనల్స్‌కు నేరుగా అర్హత సాధించగా క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో జూన్ 1 న పంజాబ్ కింగ్స్ (PBKS), ముంబై ఇండియన్స్ (MI) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ విజేత ఫైనల్స్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు), ముంబై ఇండియన్స్ (ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన జట్టు) తలపడతాయి. దీంతో ఐపీఎల్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.. అందుకే కాకినాడ జిల్లా వాసుల కోసం రాజ్యసభ సభ్యడు, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ ఐపీఎల్ ప్యాన్ పార్క్ ఈవెంట్‌ను భారీగా ఏర్పాట్లు చేయిస్తున్నారు... దీంతో ముఖ్యంగా కాకినాడ నగర వాసులు అయితే ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు నుంచి కాకినాడకు షిప్ట్..
జూన్ 1 న జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్, జూన్ 3న జరగనున్న ఐపీఎల్ ఫైనల్ కు సంబందించి ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఈవెంట్లు మొదట గుంటూరులో నిర్వహించాలని భావించారు. తరువాత కాకినాడ డీఎస్ఏ DSA గ్రౌండ్స్ కు మారాయి. రాజ్యసభ సభ్యుడు, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ చొరవతోనే ఈ ఈవెంట్లు కాకినాడకు మారాయని స్థానికులు చెబుతున్నారు.
ఫ్యాన్ పార్క్‌లో ఇవీ ప్రత్యేకతలు..
ఐపీఎల్ క్వాలిఫయర్ 2 మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ చూసేందుకు కాకినాడ నగర క్రికెట్ అభిమానులతోపాటు జిల్లా నలుమూలలనుంచి అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున కాకినాడ డీఎస్ఏ గ్రౌండ్స్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.. ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఈవెంట్‌లోకి ప్రవేశం పూర్తిగా ఉచితం కాగా హాజరైన క్రికెట్ అభిమానులకు లక్కీ డ్రా ద్వారా అదిరిపోయే గిఫ్ట్‌లు అందివ్వనున్నారు..
భారీ ఎల్ఇడి స్క్రీన్‌లపై ప్రత్యక్ష ఐపీఎల్ మ్యాచ్ ప్రదర్శనలు
సంగీతం, డీజేలు, స్థానిక ప్రదర్శనలతో వినోద విభాగాలు,
కాకినాడ స్పెషల్స్‌తో ఫుడ్ కోర్టులు,
కుటుంబానికి అనుకూలమైన కార్యక్రమాలు, పిల్లల కోసం ఆటల ప్రాంతాలు,
వెర్చువల్ బ్యాటింగ్, ఫేస్ పెయింటింగ్, 360° ఫోటో బూత్స్,
ఉచిత ప్రవేశం, లక్కీ డ్రా , ఐపీఎల్ మెర్చండైజ్ బహుమతులు ఉండనున్నాయి..
హర్షం వ్యక్తం చేస్తున్న క్రికెట్ అభిమానులు..
ఐపీఎల్ క్రికెట్ వేడుకను ఫ్యాన్ పార్కు రూపంలో కాకినాడకు తీసుకురావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని అతిపెద్ద నగరాల తరహాలో తమ ప్రాంతంలోనూ ఫ్యాన్ పార్కు ఏర్పాటు అయిందని భావోద్వేగానికి లోనవుతున్నారు కాకినాడ నగర వాసులు. ప్రతి కుటుంబం, ప్రతి యువత, ప్రతి క్రికెట్ అభిమాని ఐపీఎల్ ఫ్యాన్ పార్కుకు వచ్చి నగరం పేరు మార్మోగేలా చెయ్యాలని రాజ్యసభ సభ్యుడు, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ ఓ ప్రకటన ద్వరా ఈ ఈవెంట్స్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.





















