Ind Vs Aus Sydney Test: రోహిత్‌ను ఆడించాలని బీసీసీఐ ఒత్తిడి - తోసిపుచ్చిన గంభీర్, ఐదో టెస్టు నుంచి తొలగింపు!
Rohit Sharma: గతేడాది నుంచి అటు కెప్టెన్ గా, ఇటు ప్లేయర్ గా టెస్టుల్లో రోహిత్ గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడు. తాజాగా పూర్ ఫామ్ కొనసాగుతుండటంతో ఐదో టెస్టు నుంచి తనను తప్పించినట్లు సమాచారం.
Rohit Sharma News: భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో జరిగే ఐదో టెస్టులో బరిలోకి దిగడం దాదాపుగా అసాధ్యంగా మారింది. జట్టు నుంచి అతడిని తప్పించడానికే టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 5 టెస్టుల బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు కేవలం 6 మాత్రమే కావడం గమనార్హం. అలాగే కెప్టెన్సీలోనూ ఎలాంటి మెరుపులు లేవని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కచ్చితంగా డ్రా కావాల్సిన మెల్ బోర్న్ టెస్టులో విఫలమైన రోహిత్‌ను పక్కన పెట్టాలని భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ నిర్ణయించాడు. రోహిత్‌ను ఆడించాలని బోర్డులో కీలక ఉన్నతాధికారి నుంచి రిక్వెస్టు వచ్చినా గంభీర్ ససేమిరా అన్నట్లు తెలుస్తోంది.
తొలి కెప్టెన్‌గా చెత్త రికార్డు..
ఐదో టెస్టులో డ్రెస్సింగ్ రూంకే పరిమితం కావడం వల్ల కెప్టెన్‌గా ఉండి, జట్టు నుంచి తొలగింపునకు గురైన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ అప్రతిష్ట మూటకట్టుకోనున్నాడు. ఇన్నేళ్ల భారత క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘట్టం ఎప్పుడు నమోదు కాలేదు. గతంతో ఎంఎస్ ధోనీ, అనిల్ కుంబ్లే సిరీస్ మధ్యలోనే వైదొలిగినా, తమంతట తామే రిటైర్మెంట్ ప్రకటించారే కానీ, ఇలా ఉద్వాసనకు గురి కాలేదు. ఇక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఈ టెస్టులో నెగ్గడం తప్పనిసరి కావడంతో గంభీర్ ఏమాత్రం ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. అందుకే రోహిత్ స్థానంలో శుభమాన్ గిల్‌ను జట్టులోకి తీసుకున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ తన పాత ఓపెనర్ స్థానంలోకి వెళ్తుండగా, మూడో స్థానంలో గిల్ బరిలోకి దిగనున్నాడు. మరో ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ ఆడనున్నాడు.
కెప్టెన్‌గా బుమ్రా..
నిజానికి రోహిత్ డ్రాపౌట్ విషయం అధికారికం కాకపోయినప్పటికీ, శుక్రవారం ఉదయం టాస్ వేసే వేళకు దీనిపై స్పష్టత రానుంది. టాస్ కోసం నేరుగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వచ్చినట్లయితే రోహిత్ బెంచ్‌కే పరిమితమైనట్లు. ఇక ఈ సిరీస్‌లో బుమ్రా ఆల్రెడీ సారథ్య బాధ్యతలు వహించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ పిచ్ అయిన పెర్త్‌లో భారత్‌కు కెప్టెన్సీ వహించిన బుమ్రా.. ఆ మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ఆటతీరుతో జట్టుకు 295 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. ముఖ్యంగా తను ముందుండి ఆసీస్‌ను కట్టడి చేసి ఫలితాన్ని సాధించాడు. ఇక రెండో టెస్టు నుంచి పగ్గాలు చేపట్టిన రోహిత్, ఆ టెస్టుతో పాటు మెల్‌బోర్న్‌లో భారత్ ఓడిపోగా, వర్షం అంతరాయం వల్ల మాత్రమే బ్రిస్బేన్ టెస్టు డ్రాగా ముగిసింది. ఇక కుమారుడు జన్మించడం వల్ల తొలి టెస్టులో రోహిత్ ఆడలేదు.