Ind Vs Eng 1st Odi: నేడే తొలి వన్డే.. నూతనోత్సాహంలో భారత్, బరిలోకి దిగ్గజ ప్లేయర్లు రోహిత్, విరాట్, మెగాటోర్నీకి ముందు సన్నాహకంగా..
భారత జట్టులో నూతన ప్లేయర్లు ఆడబోతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, శుభమాన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తదితరుల రాకతో భారత బ్యాటింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది.

Team India News: ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ ముగిసి నాలుగు రోజులైన కాలేదు, అప్పుడే వన్డే సమరం కూడా ప్రారంభమవబోతోంది. గురువారం నుంచి నాగపూర్ లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డే పోరు స్టార్టవుతుంది. ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫికి ముందు రెండు జట్లకు ఈ సిరీస్ ఎంతో ప్రతిష్టాత్మకం. దీంతో ఇరుజట్లు తమ ప్రధాన ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్నాయి. ఇంగ్లాండ్ జట్టులో కేవలం ఒక్కమార్పే జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే తుది జట్టును ప్రకటించిన ఇంగ్లీష్ టీమ్.. దిగ్గజ ప్లేయర్ జో రూట్ ను మిడిలార్డర్లో ఆడించనుంది. ఇక భారత్ విషయానికొస్తే టీ20 జట్టుకి, వన్డే జట్టుకి చాలా వ్యత్యాసం ఉంది. ఇందులో ఆరేడు మంది దాక నూతన ప్లేయర్లు బరిలోకి దిగబోతున్నారు. వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, శుభమాన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తదితరుల రాకతో భారత బ్యాటింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. ఫార్మాట్ కు తగ్గట్లుగా అనుభవం కలిగిన ప్లేయర్లు బరిలోకి దిగుతుండటంతో ఈ సిరీస్ లో భారతే ఫేవరేట్ గా బరిలోకి దిగబోతోంది. 2017 ఫైనల్లో ఓడిపోయిన భారత్, ఈసారి ఎలాగైనా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని నెగ్గాలని పట్టుదలగా ఉంది. అందుకు ఈ సిరీస్ ను యూజ్ చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు కుర్రాళ్లతో కూడిన భారత్ చేతిలో 1-4తో సిరీస్ ఓడిపోయిన ఇంగ్లాండ్, ఈ సిరీస్ నెగ్గి ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు మెగాటోర్నీకి ముందు ఆత్మవిశ్వాసంతో బరిలోక దిగాలని భావిస్తోంది. ఇక వెదర్ విషయానికొస్తే ఎండగా ఉండటంతో పిచ్ నెమ్మదిగా మారుతుంది. దీంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు తక్కువ. రాత్రి వేళల్లో మంచు కురిసే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశముంది. డ్యూ లేకపోతే ఛేదన మరింత కష్టం కానుంది.
వరుణ్ ని ఆడిస్తారా..?
సమ్మర్ కావడంతో నాగపూర్ లోని పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందన్న నేపథ్యంలో భారత్ ముగ్గురు లేదా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. జట్టు కూర్పు విషయానికొస్తే ఓపెనర్లుగా రోహిత్, గిల్, వన్ డౌన్ లో కోహ్లీ, మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, పేసర్లుగా మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, స్పెషలిస్టు స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తిని ఆడించే అవకాశముంది. దీంతో రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ పెవిలియన్ కే పరిమితమవ్వచ్చు. మరో స్పిన్నర్ కావాలనుకుంటే పటేల్ స్థానంలో యాదవ్ ను ఆడించే అవకాశముంది. గత కొంతకాలం టెస్టుల్లో విఫలమవుతున్న రోకో జంట.. ఈ సిరీస్ లో పరుగుల దాహం తీర్చుకోవాలని భావిస్తోంది. లేకపోతే రోహిత్, కోహ్లీలు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో మరింత ఒత్తిడితో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఆ టోర్నీలో విఫలమైతే వాళ్ల కెరీర్ కు ఎండ్ కార్డు పడే అవకాశముంది. ఇరుజట్ల మధ్య 107 మ్యాచ్ లు జరుగగా, 58 వన్డేల్లో భారత్ గెలుపొందగా, 44 మ్యాచ్ ల్లో ఇంగ్లాండ్ విజయం సాధించింది.
సిరీస్ సాధించాలని..
టీ20 సిరీస్ ఓటమితో డీలా పడిన ఇంగ్లాండ్ వన్డేల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈక్రమంలో వెటరన్ స్టార్ రూట్ ను జట్టుకు యాడ్ చేసింది. వన్డే ప్రపంచకప్ తర్వాత తన తొలి వన్డే మ్యాచ్ గురువారం రూట్ ఆడబోతున్నాడు. భారత్ తో జరిగిన టీ20 సిరీస్ మాదిరిగానే వన్డే సిరీస్ లో ఇంగ్లాండ్ కూర్పు ఉండబోతోంది. మూడో నెంబర్లో జో రూట్ ఆడటం, బట్లర్ స్థానం మార్పు మాత్రమే కీలకాంశాలుగా ఉన్నాయి. ఓపెనర్లుగా బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ బరిలోకి దిగుతారు. వన్ డౌన్ లో జో రూల్, మిడిలార్డర్లో వరుసగా హారీ బ్రూక్, జోస్ బట్లర్ ఆడతారు. ఆల్ రౌండర్ల కోటాలో లియామ్ లివింగ్ స్టన్, జాకబ్ బెతెల్ బరిలోకి దిగుతారు. పేసర్లుగా బ్రైడెన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, సాఖిబ్ మహ్మూద్ ఆడతారు. జట్టులో ఏకైక స్పిన్నర్ గా ఆదిల్ రషీద్ బరిలోకి దిగుతాడు. ఈనెల 6న నాగపూర్ , 9న కటక్, 12న అహ్మదాబాద్ లో వరుసగా మూడు వన్డేలు జరుగనున్నాయి. వన్డే సిరీస్ టీవీల్లో స్పోర్ట్స్ 18 (2) ఛానెల్, డిస్నీ హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
Also Read: ICC Vs Srinath: చాంపియన్స్ టోర్నీ నుంచి తప్పుకున్న శ్రీనాథ్, మరో భారత అంపైర్ కూడా.. ఆ వివాదమే కారణమా..?




















