IND vs SL 3rd ODI: క్లీన్ స్వీప్ గెలుపా! ఊరట విజయమా!- నేడు భారత్- శ్రీలంక ఆఖరి వన్డే
శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ను ఇప్పటికే 2-0తో గెలుచుకున్న భారత్ ఇప్పుడు క్లీన్ స్వీప్ పై కన్నేసింది. నేడు తిరువనంతపురం వేదికగా భారత్- శ్రీలంకల మధ్య ఆఖరిదైన మూడో వన్డే జరగనుంది.
IND vs SL 3rd ODI: శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ను ఇప్పటికే 2-0తో గెలుచుకున్న భారత్ ఇప్పుడు క్లీన్ స్వీప్ పై కన్నేసింది. మరోవైపు ఒక్క మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని శ్రీలంక భావిస్తోంది. నేడు తిరువనంతపురం వేదికగా భారత్- శ్రీలంకల మధ్య ఆఖరిదైన మూడో వన్డే జరగనుంది.
మధ్యాహ్నం 1.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరి ఇది గెలిచి టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తుందా! లేక శ్రీలంక పరువు నిలుపుకుంటుందా! అనేది చూడాలి.
బ్యాటర్ల నిలకడలేమి
2 మ్యాచ్ లు గెలిచినప్పటికీ భారత బ్యాటింగ్ లో నిలకడ లోపించింది. మొదటి మ్యాచ్ లో రోహిత్, గిల్, కోహ్లీ రాణించటంతో భారత్ భారీ స్కోరు సాధించి సునాయాస విజయం సాధించింది. అయితే రెండో టీ20లో వారు ముగ్గురూ విఫలమయ్యారు. శ్రేయస్ కు మంచి ఆరంభమే లభించినప్పటికీ దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. ఇక పాండ్య తన స్థాయికి తగ్గట్లు ఆడడంలేదు. దీంతో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి టీమిండియా శ్రమించాల్సి వచ్చింది. కేఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ మ్యాచ్ గెలిచింది. శ్రీలంకను వైట్ వాష్ చేయాలంటే టీమిండియా టాపార్డర్ నిలకడ ప్రదర్శించాలి. ఎవరో ఒకరిద్దరు కాకుండా అందరూ సమష్టిగా రాణించాలి.
బౌలింగ్ నో టెన్షన్
గత 2 మ్యాచ్ ల్లోనూ భారత బౌలర్లు సమష్టిగా రాణించారు. మొదటి టీ20లో రెండో ఇన్నింగ్స్ లో మంచు ప్రభావంలోనూ ఆకట్టుకున్నారు. ఇక రెండో మ్యాచ్ లో శ్రీలంకను స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ ఆరంభంలో అద్భుతంగా బంతులు వేస్తున్నాడు. అతనికి షమీ, ఉమ్రాన్ మాలిక్ ల నుంచి మంచి సహకారం అందుతోంది. ఉమ్రాన్ పరుగులు ఎక్కువగా ఇస్తున్నప్పటికీ వికెట్లు తీస్తున్నాడు. ఇక స్పిన్ విషయానికొస్తే అక్షర్ ఆకట్టుకుంటున్నాడు. రెండో టీ20లో చాహల్ స్థానంలో వచ్చిన కుల్దీప్ 3 వికెట్లతో చెలరేగి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ కూడా అందుకున్నాడు. మరి చాహల్ కోలుకున్న నేపథ్యంలో కుల్దీప్ జట్టులో ఉంటాడా లేదా అనేది అనుమానమే. బౌలింగ్ విభాగం ఇదే ప్రదర్శన పునరావృతం చేస్తే శ్రీలంకపై క్లీన్ స్వీప్ విజయం నల్లేరు మీద నడకే అవుతుంది.
పరువు కోసం లంక
తొలి 2 మ్యాచుల్లో ఓడి సిరీస్ ను కోల్పోయిన శ్రీలంక కనీసం చివరి మ్యాచ్ లో అయినా నెగ్గి ఊరట పొందాలనుకుంటోంది. రెండు టీ20ల్లో ఆ జట్టు మంచి ప్రదర్శనే చేసినప్పటికీ ఓటమి చెందక తప్పలేదు. బ్యాటింగ్ లో ఆ జట్టు కెప్టెన్ దాసున్ శనక వారికి బలం. అతనితోపాటు కుశాల్ మెండిస్, పాథుమ్ నిశ్సాంక, అవిష్క ఫెర్నాండో కీలకం కానున్నారు. గత మ్యాచ్ లో అరంగేట్రం చేసిన నువానిదు ఫెర్నాండో అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అలాగే బౌలింగ్ విభాగంలో చమిక కరుణరత్నే, కసున్ రజిత, లాహిరు కుమారలు నిలకడగా రాణిస్తున్నారు. వీరితోపాటు స్పిన్నర్లు రాణిస్తే శ్రీలంక విజయం వైపు అడుగులు వేయవచ్చు. తొలి 2 మ్యాచుల్లో ఓడిన శ్రీలంక ఇందులో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. కాబట్టి ఆ జట్టును తేలికగా తీసుకుంటే భారత్ కు భంగపాటు తప్పదు.
టీమిండియా తుది జట్టులో మార్పులు!
మూడో వన్డే కోసం టీమిండియా తుది జట్టులో కనీసం 4 మార్పులు జరిగేలా కనిపిస్తున్నాయి. టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సూర్యకుమార్ యాదవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చవచ్చు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో సూర్య సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్ కూడా మూడో వన్డేలో అవకాశం పొందవచ్చు. బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ సాధించి తిరిగి జట్టులోకి రావాలని ఇషాన్ ఎదురుచూస్తున్నాడు. వీరిద్దరితో పాటు ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లను కూడా మూడో వన్డేలో తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
పిచ్ పరిస్థితి
తిరువనంతపురం పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే మ్యాచ్ ఆరంభంలో పేస్ బౌలర్లు లబ్ధి పొందవచ్చు. రెండో ఇన్నింగ్స్ లో మంచు ప్రభావం ఉంటుంది. కాబట్టి టాస్ కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. చిన్న బౌండరీలు కాబట్టి భారీ స్కోరుకు ఛాన్స్ ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అయితే వర్షం అంతరాయం ఉండదు.
భారత్ తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ/ మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్/ యుజ్వేంద్ర చాహల్.
శ్రీలంక తుది జట్టు (అంచనా)
నువానిదు ఫెర్నాండో, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, దాసున్ శనక, ధనంజయ డిసిల్వా, వానిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, చమిక కరుణరత్నే, లాహిరు కుమార, కాసున్ రజిత.
— BCCI (@BCCI) January 14, 2023
Optional training done ✅
— BCCI (@BCCI) January 14, 2023
Ready for the series finale 👍🏻#TeamIndia | #INDvSL | @mastercardindia pic.twitter.com/L4MuCcKp8A