India Vs New Zealand : నేడే కివీస్ తో తొలి టీ20... ఉత్సాహంగా టీమిండియా యువ జట్టు
India Vs New Zealand : న్యూజిలాండ్ తో మూడు టీ20 ల సిరీస్ లో భాగంగా ఇవాళ(శుక్రవారం)టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. వెల్లింగ్టన్ లో స్కై మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.
India Vs New Zealand: టీ20 ప్రపంచకప్ ముగిసి ఇంకా వారం రోజులు కూడా కాలేదు. అప్పుడే టీమిండియా మరో పొట్టి సిరీస్ కు సిద్ధమైపోయింది. న్యూజిలాండ్ తో మూడు టీ20 ల సిరీస్ లో భాగంగా ఇవాళ(శుక్రవారం) తొలి మ్యాచ్ ఆడనుంది. వెల్లింగ్టన్ లో స్కై మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. మరి ఇరు జట్ల బలాబలాలు, కీలక ఆటగాళ్లు గురించి తెలుసుకుందామా....
కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, దినేశ్ కార్తీక్ లాంటి సీనియర్ల గైర్హాజరీలో కుర్ర జట్టుతో టీమిండియా బరిలోకి దిగుతోంది. కుర్రాళ్లతో నిండిన జట్టయినప్పటికీ హార్దిక్ పాండ్య నేతృత్వంలోని భారత జట్టు బలంగానే ఉంది. రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్, సంజూ శాంసన్, దీపక్ హుడా, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లతో మెరుగ్గా కనిపిస్తోంది. అయితే వీరిలో తుది జట్టులో ఎవరుంటారో తెలియదు. సూర్య టీ20 ప్రపంచకప్ లో అద్భుతంగా రాణించి సూపర్ ఫాంలో ఉన్నాడు. మిగిలిన యువ ఆటగాళ్లు కూడా రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు.
వారిద్దరికీ ఈసారైనా ఛాన్స్ ఉంటుందా!
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ పోటీల్లో భారత్ 6 మ్యాచ్ లు ఆడింది. అయితే లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం కల్పించలేదు. ఆసీస్ పిచ్‌లు లెగ్‌స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయని మాజీలు చెప్పినా.. భారత కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ అటువైపుగా ఆలోచనే చేయలేదు. అలాగే డెత్ ఓవర్లలో అండగా నిలుస్తాడని భావించి ఎంపిక చేసిన హర్షల్ పటేల్‌కూ ఛాన్స్ దక్కలేదు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లోనైనా వీరిద్దరికి అవకాశం ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. టీ20 ఫార్మాట్‌లో లెగ్ స్పిన్నర్లు ప్రభావం చూపుతారనేది మాజీల వాదన.
ఇక యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఎట్టకేలకు జాతీయ జట్టులో మళ్లీ చోటు సంపాదించాడు. కుల్‌దీప్ కూడా తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. ఆల్‌రౌండర్లు దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ తమ అవకాశం కోసం వేచి చూస్తున్నారు.
ఓపెనర్లుగా ఇషాన్, గిల్!
టీమ్‌ఇండియా యువ సంచలనం ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించే అవకాశముంది. ఇషాన్ గత కొంతకాలంగా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ యువ బ్యాటర్ భారత్ తరఫున ఇప్పటివరకు 19 టీ20లు ఆడి 131.15 స్ట్రైక్‌రేట్‌తో 543 పరుగులు చేశాడు. శుభమన్ గిల్ ఈ సిరీస్‌తో టీ20ల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. ఇషాన్‌కు తోడుగా గిల్ ఓపెనర్‌గా వచ్చే అవకాశముంది. మూడో స్థానంలో శ్రేయస్ అయ్యర్, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగొచ్చు. వికెట్ కీపర్‌గా వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఆరో స్థానంలో సంజూ శాంసన్, ఏడో స్థానంలో ఆల్‌రౌండర్, కెప్టెన్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ చేయొచ్చు. బౌలింగ్ విషయానికొస్తే.. సీనియర్ లెగ్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్‌కు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. పేస్ విభాగంలో భువనేశ్వర్ కుమార్‌కు తోడుగా యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లను తీసుకునే అవకాశముంది.
భారత్ తుది జట్టు (అంచనా)
ఇషాన్ కిషన్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, యుజేంద్ర చాహల్,భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
ప్రపంచకప్ జట్టుతోనే కివీస్!
భారత్ లానే వెస్టిండీస్ కూడా టీ20 ప్రపంచకప్ సెమీస్ లోనే వెనుదిరిగింది. అయితే పొట్టి కప్పులో బరిలోకి దిగిన జట్టులో ఒకరిద్దరు మినహా మిగిలినవారిని టీమిండియాతో జరిగే టీ20 సిరీస్ కు ఎంపిక చేశారు. ట్రెంట్ బౌల్ట్‌కు విశ్రాంతినిచ్చిన కివీస్ మేనేజ్‌మెంట్ కీలకమైన బ్యాటర్లు ఫిన్ అలెన్, బ్రాస్‌వెల్, డేవన్ కాన్వే, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, జీమ్మీ నీషమ్‌లను ఎంపికచేసింది. ప్రపంచకప్‌లో పెద్దగా రాణించని ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్‌కు రెస్ట్ ఇస్తారని అంతా భావించారు. అయితే కేన్‌కే నాయకత్వ పగ్గాలను అప్పజెప్పారు. టిమ్ సౌథీ, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, ఐష్ సోధి, లాకీ ఫెర్గూసన్‌తో కూడిన బౌలింగ్ దళం అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే మ్యాచ్‌లు జరిగేది న్యూజిలాండ్‌లోనే కాబట్టి వారికి వారి పిచ్‌లపై పూర్తి అవగాహన ఉంటుంది.
న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా)
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.
పిచ్ పరిస్థితి
ఇవాళ(శుక్రవారం) సాయంత్రం వెల్లింగ్టన్ లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావచ్చు.
లైవ్ స్ట్రీమింగ్
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 లైవ్ స్ట్రీమింగ్ అమెజాన్ ప్రైమ్‌లో (Amazon Prime) అందుబాటులో ఉంది. తొలిసారిగా ప్రైమ్ ఈ హక్కులను దక్కించుకుంది. ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను ప్రకటించింది. టీవీలో దూరదర్శన్ లో మాత్రమే ప్రత్యక్ష ప్రసారం కానుంది.
మీకు తెలుసా:
న్యూజిలాండ్, భారత్ లు ఇప్పటివరకు 20 టీ20 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 11 మ్యాచుల్లో గెలవగా... న్యూజిలాండ్ 9 మ్యాచుల్లో విజయం సాధించింది.
ఈ ఫార్మాట్‌లో మిచెల్ శాంట్నర్ బౌలింగ్ లో సంజూ శాంసన్ రెండు సార్లు ఔటయ్యాడు. కేవలం 7 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు.
భువనేశ్వర్ కుమార్ ఈ సంవత్సరం 36 టీ20 వికెట్లు తీసుకున్నాడు.
TICK..TICK..BOOM 💥💥
— BCCI (@BCCI) November 17, 2022
All charged up for the #NZvIND T20I series opener#TeamIndia 🇮🇳 pic.twitter.com/AsNSTeMqq8