Ind VS WI 2nd Test Preview Update: క్లీన్ స్వీపే టార్గెట్ గా.. వెస్టిండీస్ తో రెండో టెస్టులో భారత్ ఢీ.. అన్ని విభాగాల్లో పటిష్టంగా టీమిండియా.. ఒత్తిడిలో విండీస్..
తొలి మ్యాచ్ లో ఇన్నింగ్స్ విజయం సాధించాక, రెండో టెస్టులో గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ లో కొన్ని మార్పులు ఉండవచ్చు. విండీస్ ఉనికి చాటుకోవాలని ఆరాట పడుతోంది.

Ind VS wi 2nd test latest News: వెస్టిండీస్ జట్టుతో శుక్రవారం నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇండియా రెండో టెస్టు ఆడనుంది. ఇప్పటికే తొలి టెస్ట్ ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. ఈ మ్యాచ్ లో విజయం సాధించి, రెండు మ్యాచ్ ల సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మ్యాచ్ వేదికైన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇండియాకు తిరుగులేని రికార్డు ఉంది. 1987 నుంచి ఈ వేదికపై ఇండియా ఓడిపోలేదు. అప్పటి నుంచి తొమ్మిది విజయాలు, రెండు డ్రాలను సాధించింది. ఇక ఈ వేదిక అనాదిగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటూ వస్తోంది. చివరిసారి ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా పదివికెట్లతో సత్తా చాటాడు. అప్పుడు పుల్ టర్నర్ గా ఏర్పాటు చేసిన ఈ వేదికను.. ఈసారి మాత్రం సమతూకం ఉండేలా రూపొందిస్తున్నారు.
Want to win everything that we have in the upcoming months: Shubman Gill
— BCCI (@BCCI) October 9, 2025
Captain Shubman Gill speaks about his aspirations after being appointed as the #TeamIndia ODI skipper 🇮🇳🙌#INDvWI | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/htiVcwXHNd
అందరి ఫోకస్ అక్కడే..
తొలి టెస్టులో భారత్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేసింది. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా సెంచరీలతో సత్తా చాటారు. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ బౌలింగ్ కూడా తేలిపోయింది. కేవలం ఐదు వికెట్లను మాత్రమే సాధించగలిగారు. ప్రీమియర్ బౌలర్లు అల్జారీ జోసెఫ్, షీమర్ జోసెఫ్ గాయాలతో దూరం కావడంతో బౌలింగ్ పదును లేకుండా పోయింది. ఇక భారత బ్యాటింగ్ విషయానికొస్తే ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రాహుల్ ఆడతారు. మూడో నెంబర్లో సాయి సుదర్శన్ నిరూపించుకోవాల్సి ఉంది. ఇన్ని అవకాశాలిచ్చినా తను వేస్ట్ చేసుకుంటున్నాడు. ఈ మ్యాచ్ లో నిరూపించుకోలేక పోతే తన స్థానం ప్రమాదంలో పడే అవకాశముంది. ఇక నాలుగో నెంబర్లో కెప్టెన్ శుభమాన్ గిల్ కుదురుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ జురేల్.. ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాడు.
ఆల్ రౌండర్ల జోరు..
సినియర్ ఆల్ రౌండర్ జడేజా అటు బ్యాట్, ఇటు బంతితో రాణిస్తున్నాడు. మరో అల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ సత్తా చాటుతున్నాడు. ఇక సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్ లో తేలిపోయాడు. ఈ మ్యాచ్ లో తను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక గత మ్యాచ్ లో బ్యాటింగ్ రాలేదు కానీ, ఈ సారి బ్యాటింగ్ వస్తే రెండు చేతులతో అందిపుచ్చుకోవాలి. బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చి, ప్రసిధ్ కృష్ణను ఆడించొచ్చు. మరో పేసర్ హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ఆకట్టుకుంటున్నాడు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సత్తా చాటుతున్నాడు. ఈ మ్యాచ్ లో నితీశ్ లేదా కుల్దీప్ కు రెస్ట్ ఇచ్చి, అక్షర్ పటేల్ ను ఆడించే అవకాశం కూడా ఉంది. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో విఫలమవుతున్న విండీస్ ఈ మ్యాచ్ కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. మ్యాచ్ తొలి రెండున్నర రోజులు బ్యాటింగ్ కు అనుకూలిస్తుండటంతో కాస్త పెద్ద స్కోరు చేయాలని యోచిస్తోంది.




















