India T20 Captaincy: బీసీసీఐ కఠిన చర్యలు - హార్దిక్‌కు టీ20, కేఎల్ రాహుల్‌కు వన్డే, టెస్టు కెప్టెన్సీ?
India T20 Captaincy: టీమ్‌ఇండియాను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు బీసీసీఐ ముహూర్తం నిర్ణయించింది! టీ20 ఫార్మాట్లో సంస్కరణలు చేపట్టనుందని తెలిసింది.
India T20 Captaincy: టీమ్‌ఇండియాను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు బీసీసీఐ ముహూర్తం నిర్ణయించింది! టీ20 ఫార్మాట్లో సంస్కరణలు చేపట్టనుందని తెలిసింది. న్యూజిలాండ్ పర్యటన నుంచే మార్పులు మొదలవుతాయని సమాచారం. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్‌లో హిట్‌మ్యాన్ సేన ఘోర పరాజయం పాలవ్వడం, 2013 ఐసీసీ ట్రోఫీలు రాకపోవడంతో కఠిన చర్యలు తీసుకోనుంది. రోహిత్ శర్మను క్రమంగా తప్పించి హార్దిక్ పాండ్యకు టీ20 కెప్టెన్సీ అప్పగిస్తారని తెలుస్తోంది.
మంచి ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా పేరుకు పెద్దే జట్టే అయినా టీ20 క్రికెట్లో టీమ్‌ఇండియా ప్రదర్శన మారడం లేదు. ఐసీసీ టీ20 ప్రపంచకప్పుల్లో ఘోరంగా తడబడుతోంది. కనీసం ఫైనల్ చేరడం లేదు. ఒక్కోసారైతే గ్రూప్ దశ నుంచే నిష్క్రమిస్తోంది. ఇంగ్లాండ్ వంటి దేశాలు ఆధునిక క్రికెట్ ఆడుతోంటే భారత్ మాత్రం ఇంకా పాత పద్ధతిలోనే ఆడుతోంది. పవర్ ప్లేలో తక్కువ ఆడటం, మిడిల్ ఓవర్లలో కాస్త పుంజుకోవడం, డెత్ ఓవర్లలో వీరబాదుడుకే ప్రయత్నిస్తోంది. మిగతా జట్లేమో పవర్‌ప్లేను సాధ్యమైనంత ఉపయోగించుకుంటున్నాయి.
'కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో సందేహం లేదు. ఇదో చేదు గుళిక. మెరుగైన సన్నద్ధత కోసం టీమ్‌ఇండియాను ముందుగానే ఆసీస్‌కు పంపించాం. జస్ప్రీత్ బుమ్రా సహా ఆటగాళ్లు గాయపడటంతో ప్రణాళికలు పట్టాలు తప్పాయి. కానీ ఆట స్వభావం ఇలాగే ఉంటుంది. ఇంగ్లాండ్ సైతం జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ లేకుండానే ఆడటం చూశాం. అయితే సెమీస్ రోజు వారు ఇబ్బంది పడలేదు. కెప్టెన్సీ గురించి చర్చించాల్సి ఉంది. న్యూజిలాండ్ తర్వాత మేం చర్చిస్తాం' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 35. అంటే 2024 టీ20 ప్రపంచకప్‌నకు అతడు 37కు చేరుకుంటాడు. ఈ మధ్యలో వన్డే ప్రపంచకప్, టెస్టు జట్టును రెండేళ్లు నడిపించాల్సి బాధ్యత అతడిపై ఉంటుంది. తరచూ గాయాల పాలవుతుండటంతో 2024 కోసం ఇద్దరు కెప్టెన్ల పద్ధతి అనుసరించొచ్చని సమాచారం. టీమ్‌ఇండియా వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ గెలవడం అవసరం. ఇందుకు హిట్‌మ్యాన్ సహా ఆటగాళ్లంతా ప్రెష్‌గా, ఫిట్‌నెస్‌తో ఉండాలి. అందుకే టెస్టు, వన్డేలపై రోహిత్ దృష్టి పెట్టేలా చేయనున్నారు. క్రమంగా టీ20ల నుంచి తప్పిస్తారు. వన్డే, టెస్టు కెప్టెన్సీకి కేఎల్ రాహుల్‌ను ఎంచుకోవచ్చని తెలిసింది.
'పెద్ద సిరీసులు, ఐసీసీ టోర్నీల కోసం రోహిత్‌ను వరుసగా రొటేట్ చేస్తాం. అయితే కెప్టెన్‌ను ఎక్కువగా రొటేషన్ చేయడం కుదరదు. ఇప్పుడు టీ20లు ఫోకస్‌లో లేవు కాబట్టి క్రమంగా అతడిని తప్పించి హార్దిక్ పాండ్య లాంటి వాళ్లకు పూర్తి స్థాయి కెప్టెన్సీ అప్పగిస్తాం' అని బీసీసీఐ అధికారి తెలిపారు. నిజానికి కెప్టెన్సీ రేసులోకి హార్దిక్ విచిత్రంగా వచ్చాడు. గాయపడి, స్టార్లు లేని గుజరాత్‌ను నడిపించి, విజేతగా నిలపడంతో అందరి దృష్టిలో పడ్డాడు.