IND Vs WI: ఇది కూడా పాయే - రెండో టీ20లోనూ ఓటమి పాలైన భారత్!
భారత్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ రెండు వికెట్లతో విజయం సాధించింది.
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో కూడా భారత జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. అనంతరం వెస్టిండీస్ 18.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో వెస్టిండీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సాధించింది. మరొక్క మ్యాచ్ ఓడిపోయినా భారత్ సిరీస్‌ను కోల్పోయినట్లే.
వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లో ఫాంలో ఉన్న నికోలస్ పూరన్ (67: 40 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ (51: 41 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో రాణించాడు. వెస్టిండీస్ బౌలర్లలో అకియల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, రొమారియో షెపర్డ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.
నికోలస్ పూరన్ షో...
153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు ప్రారంభంలోనే రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే బ్రాండన్ కింగ్ (0: 1 బంతి), జాన్సన్ ఛార్లెస్‌లను (2: 3 బంతుల్లో) అవుట్ చేశాడు. దీంతో వెస్టిండీస్ కేవలం మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో ఉన్నంత కాసేపు మెరుపులు మెరిపించిన కైల్ మేయర్స్ (15: 7 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు.
ఆ తర్వాత నికోలస్ పూరన్ (67: 40 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), కెప్టెన్ రొవ్‌మన్ పావెల్ (21: 19 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)... వెస్టిండీస్‌ను తిరిగి మ్యాచ్‌లోకి తీసుకువచ్చారు. వీరు నాలుగో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. ముఖ్యంగా నికోలస్ పూరన్ భారత బౌలర్లపై బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. పిచ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ దాంతో నాకు పని లేదన్నట్లు ఆడాడు. అయితే కీలకమైన సమయంలో మొదట రొవ్‌మన్ పావెల్, తర్వాత నికోలస్ పూరన్ అవుట్ అయ్యారు. కానీ ఆఖర్లో అకియల్ హుస్సేన్ (16 నాటౌట్: 10 బంతుల్లో, రెండు ఫోర్లు), అల్జారీ జోసెఫ్ (10 నాటౌట్: 8 బంతుల్లో, ఒక సిక్సర్) తప్పు జరగనివ్వలేదు.
తిలక్ వర్మ సూపర్ ఇన్నింగ్స్...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ టీమిండియాకు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (7: 9 బంతుల్లో, ఒక సిక్సర్) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో హెట్‌మేయర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ (1: 3 బంతుల్లో) కూడా త్వరగా అవుటయ్యాడు. దీంతో భారత్ 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
ఫాంలో ఉన్న తిలక్ వర్మ (51: 41 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) పరిస్థితికి తగ్గట్లు ఆచితూచి ఆడాడు. పిచ్ నిదానంగా ఉండటంతో పరుగులు సాధించడం కష్టమైంది. మరో ఎండ్‌లో ఇషాన్ కిషన్ (27: 23 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) తనకు చక్కటి సహకారం అందించాడు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ మూడో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. అనంతరం రొమారియో షెపర్డ్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఇషాన్ కిషన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఈ భాగస్వామ్యం విడిపోయింది. తర్వాత వచ్చిన సంజు శామ్సన్ (7: 7 బంతుల్లో, ఒక ఫోర్) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి అకియల్ హోస్సేన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు.
అనంతరం తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (24: 18 బంతుల్లో, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరు ఐదో వికెట్‌కు 38 పరుగులు జోడించారు. ఈ లోపు తిలక్ వర్మ తన అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అర్థ సెంచరీ అయిన వెంటనే తిలక్ అవుట్ కావడం భారత్‌ను గట్టి దెబ్బ కొట్టింది. చివరి వరుస బ్యాటర్లు కాస్త వేగంగా ఆడటంతో భారత్ 150 పరుగుల మార్కును దాటింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు సాధించింది. వెస్టిండీస్ బౌలర్లలో అకియల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, రొమారియో షెపర్డ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.