IND vs SL 1st T20: నేడే భారత్- శ్రీలంక తొలి టీ20- టీమిండియా యువ జట్టు తొలి విజయం అందుకుంటుందా!
IND vs SL 1st T20: శ్రీలంకతో టీ20 సిరీస్ కు టీమిండియా సిద్ధమైంది. నేడు ముంబయిలోని వాంఖడే వేదికగా రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది.
IND vs SL 1st T20: శ్రీలంకతో టీ20 సిరీస్ కు టీమిండియా సిద్ధమైంది. నేడు ముంబయిలోని వాంఖడే వేదికగా రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్. రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి వారు లేకుండానే భారత్ ఈ సిరీస్ లో బరిలో దిగనుంది. పూర్తిగా కుర్రాళ్లతో నిండిన జట్టును ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య నడిపించనున్నాడు.
2024 టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా భారత్ ఇప్పటినుంచి అడుగులు వేయనుంది. ఈ క్రమంలోనే సీనియర్లకు విశ్రాంతినిచ్చి కుర్రాళ్లపై బీసీసీఐ దృష్టి పెట్టింది. లంకతో సిరీస్ కు యువ ఆటగాళ్లతో కూడిన జట్టు ప్రకటించింది. మరి హార్దిక్ పాండ్య నేతృత్వంలోని ఈ యువ జట్టు అంచనాలకు తగ్గట్లుగా రాణిస్తుందో లేదో చూడాలి.
ఓపెనర్లుగా వారిద్దరు!
ఒక ఓపెనర్ గా ఇషాన్ కిషన్ బరిలో దిగడం ఖాయమే. ఇటీవలే ముగిసిన బంగ్లాతో వన్డే సిరీస్ లో కిషన్ డబుల్ సెంచరీ బాదాడు. ఇక మరో ఓపెనర్ గా శుభ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ లలో ఎవరిని తీసుకుంటారో చూడాలి. గిల్ ఇంకా టీ20 అరంగేట్రం చేయలేదు కాబట్టి రుతురాజ్ ఇన్నింగ్స్ ప్రారంభించడమే లాంఛనమే అనిపిస్తోంది. ఇక 3, 4 స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ లు ఉన్నారు. 2022లో సూర్య సూపర్ ఫాంలో ఉన్నాడు. ఈ ఏడాదీ అదే దూకుడు కనబరచాలని జట్టు కోరుకుంటోంది. ఇక సంజూ ఐపీఎల్ లో లాగానే తనకిష్టమైన నాలుగో స్థానంలో ఆడతాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఆ తర్వాత వరుసగా ఆల్ రౌండర్లు వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా ఉన్నారు.
బౌలింగ్ భారం వారిదే
ఇక బౌలింగ్ విషయానికొస్తే ఈ సిరీస్ లో సీనియర్ బౌలర్ హర్షల్ పటేల్. అతనికి తోడుగా అర్హదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ లు పేస్ దళాన్ని నడిపించనున్నారు. కొత్త కుర్రాళ్లు ముఖేష్ కుమార్, శివమ్ మావిలు ప్రస్తుతానికి బెంచ్ కే పరిమితమయ్యే అవకాశముంది. ఇక ప్రధాన స్పిన్నర్ బాధ్యతను యుజువేంద్ర చాహల్ మోయనున్నాడు.
శ్రీలంకను తక్కువ అంచనా వేయొద్దు
కొంతకాలం క్రితం వరకు బలహీనంగా కనిపించిన శ్రీలంక జట్టు ప్రస్తుతం మెరుగ్గా ఉంది. ఆసియా కప్ గెలుచుకున్న లంకేయులు ఉత్సాహంతో ఉన్నారు. దసున శనక సారథ్యంలో ఆ జట్టు ప్రదర్శన క్రమక్రమంగా మెరుగవుతోంది. హసరంగ, శనక, చమిక కరుణరత్నే, ధనంజయ డిసిల్వా లాంటి ఆల్ రౌండర్లు.. నిశాంక, కుశాల్ మెండిస్, అసలంక లాంటి బ్యాటర్లు నిలకడగా రాణిస్తున్నారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ లోనూ ఆ జట్టు మంచి ప్రదర్శన చేసింది. కాబట్టి లంక జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆ జట్టును తేలికగా తీసుకుంటే మాత్రం భారత్ కు భంగపాటు తప్పదు.
భారత తుది జట్టు (అంచనా)
ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా, యుజువేంద్ర చాహల్, హర్షల్ పటేల్, అర్హదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
శ్రీలంక తుది జట్టు ( అంచనా)
పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), భానుక రాజపక్సే, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ శనక (కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, లాహిరు కుమార, ప్రమోద్ మదుషన్/దిల్షన్ మధుశంక.
ఎక్కడ చూడాలి
స్టార్ స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్ లైవ్ టెలికాస్ట్ చూడవచ్చు. అలాగే డిస్నీప్లస్ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
పిచ్ రిపోర్ట్
వాంఖడే స్టేడియంలో పరుగుల వరద ఖాయమే. అయితే టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ కు మొగ్గు చూపే అవకాశముంది. వర్ష భయం లేదు.
A new year 🗓️
— BCCI (@BCCI) January 2, 2023
A new start 👍🏻
A new Vice-captain - @surya_14kumar - for the Sri Lanka T20I series 😎#TeamIndia had their first practice session here at Wankhede Stadium ahead of the T20I series opener in Mumbai 🏟️#INDvSL | @mastercardindia pic.twitter.com/qqUifdoDsp