IND vs SA T20 WC: మెగా టోర్నీలో మొదటి ఓటమి - దక్షిణాఫ్రికాను గెలిపించిన మిల్లర్!
టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఐదు వికెట్లతో ఓటమి పాలైంది. ఈ టోర్నీలో భారత్‌కు ఇదే మొదటి పరాజయం.
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్లతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఎయిడెన్ మార్క్రమ్ ( 52: 41 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), డేవిడ్ మిల్లర్ (59 నాటౌట్: 46 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు.
134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ కూడా విఫలం అయింది. క్వింటన్ డికాక్ (1: 3 బంతుల్లో), టెంబా బవుమా (10: 15 బంతుల్లో, ఒక సిక్సర్), రిలీ రౌసో (0: 2 బంతుల్లో) త్వరగా అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు.
వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 76 పరుగులు జోడించారు. అయితే ఈ దశలో మార్క్రమ్ అవుటయినా, డేవిడ్ మిల్లర్ మ్యాచ్‌ను ముగించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి ఒకే ఓవర్లో రోహిత్ శర్మ (15: 14 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), కేఎల్ రాహుల్‌లను (9: 14 బంతుల్లో, ఒక సిక్సర్) అవుట్ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 26 పరుగులు మాత్రమే. ఫాంలో ఉన్న విరాట్ కోహ్లీ (12: 11 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా ఈ మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. అక్షర్ పటేల్ స్థానంలో వచ్చిన దీపక్ హుడా (0: 3 బంతుల్లో) ఏకంగా డకౌటయ్యాడు.
సూర్య తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వారిలో ఎవరూ కనీసం 10 పరుగులు కూడా చేయలేకపోయారు. ఒంటరి పోరాటం చేసిన సూర్యకుమార్ యాదవ్ (68: 40 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) కూడా 19వ ఓవర్లో అవుటయ్యాడు దీంతో టీమిండియా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 133 పరుగులకే పరిమితం అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి నాలుగు వికెట్లు, వేన్ పార్నెల్ మూడు వికెట్లు తీసుకున్నారు. ఆన్రిచ్ నోర్జేకు ఒక వికెట్ దక్కింది.
View this post on Instagram