IND vs SA 1st Test Highlights: సైమన్ హార్మర్ స్పిన్ మ్యాజిక్.. తొలి టెస్టులో టీమిండియా ఓటమి, 1-0 ఆధిక్యంలో సఫారీలు
IND vs SA 1st Test Score update: దక్షిణాఫ్రికా కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో భారత జట్టును ఓడించింది. అయితే 15 ఏళ్ల తర్వాత భారత గడ్డపై దక్షిణాఫ్రికాకు ఇది తొలి విజయం.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోయింది. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక జట్టు దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో భారత్ మీద విజయం సాధించింది. కేవలం 124 పరుగులు ఛేదించడంలో భారత జట్టు విఫలమైంది. పిచ్ బౌలర్లకు అనుకూలించింది.
ఆతిథ్య భారత్ పరిస్థితులను బాగా ఉపయోగించుకున్నా, పర్యాటక జట్టు సైతం అదే స్థాయిలో బౌలింగ్ తో రాణించింది. సైమన్ హార్మర్ భారత జట్టును దెబ్బతీశాడు. టీమిండియా నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. గత 15 ఏళ్లలో భారత గడ్డపై దక్షిణాఫ్రికా గెలిచిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. ఇది కేవలం రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కాగా, రెండవ, చివరి మ్యాచ్ నవంబర్ 22న గౌహతిలో ప్రారంభం కానుంది. భారత జట్టు తిరిగి పుంజుకుని సిరీస్న్ సమం చేయాలనుకుంటుంది.
లక్ష్యానికి 31 పరుగులు దూరంలో నిలిచిన భారత్
ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులు చేసింది. భారత్ 30 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది, కానీ అప్పటికి ఈ ఉపరితలంపై బ్యాటింగ్ చేయడం ఏమాత్రం సులభం కాదని స్పష్టమైంది. రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా దక్షిణాఫ్రికాపై నాలుగు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ చెరో రెండు వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ ఒక్కొక్క వికెట్ తీశారు.
చివరికి 124 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు, భారత్ ఛేదించడంలో విఫలమైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ వరుసగా 0, 1 పరుగులకు మార్కో జాన్సెన్‌కు అవుట్ కావడంతో ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే కష్టతరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను ఇబ్బంది పెట్టిన సైమన్ హార్మర్ రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు.
South Africa win the 1st Test by 30 runs.#TeamIndia will look to bounce back in the 2nd Test.
— BCCI (@BCCI) November 16, 2025
Scorecard ▶️https://t.co/okTBo3qxVH #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/21LHhUG5Rz
వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ప్రయత్నం వృధా
ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ ఒక్కడే కాస్త పోరాడాడు. వికెట్లు పడిపోతున్నప్పుడు మరో ఎండ్ లో ఎక్కువ కాలం పాటు క్రీజులో నిలబడ్డాడు. సుందర్ 92 బంతుల్లో 31 పరుగులు చేశాడు. పరుగులు తక్కువగా అనిపించవచ్చు, కానీ, ఈ పిచ్‌లో పరుగులు చేయడం చాలా కష్టంగా మారింది.
చివర్లో అక్షర్ పటేల్ మెరుపులు..
అవతలివైపు వరుస వికెట్లు పడటంతో అక్షర్ పటేల్ కూడా స్కోరు వేగాన్ని పెంచడానికి ప్రయత్నించాడు. కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో ఓ ఫోర్, 2 సిక్సర్లు కొట్టాడు. మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి అదే ఓవర్లో కేశవ్ మహరాజ్ కు వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత తర్వాతి బంతికే మహ్మద్ సిరాజ్ ను ఔట్ చేశాడు కేశవ్ మహరాజ్ . దాంతో భారత్ 93 పరుగులకు ఆలౌట్ అయి ఓటమి చెందింది.
తొలి టెస్ట్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ - 159 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ - 189 ఆలౌట్
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ - 153 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ - 93 ఆలౌట్
తొలి ఇన్నింగ్స్ లో మార్‌క్రమ్ 31, రికెల్టన్ 23, మల్డర్ 24, టోనీ డే జోర్జి 24 పరుగులు చేశారు. జస్ప్రిత్ బుమ్రా 5 వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా 159 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్, కుల్దీప్ చెరో 2 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది.
రాహుల్ 39, వాషింగ్టన్ సుందర్ 29, రిషబ్ పంత్ 27, జడేజా 27 పరుగులతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 189 పరుగులకు ఆలౌటై 30 పరుగుల ఆధిక్యంలో ఉంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 4 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా (55) హాఫ్ సెంచరీ, కార్బి్న్ బాచ్ 25 పరుగులు చేయడంతో 153 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా భారత్ కు 124 పరుగుల టార్గెట్ మాత్రమే ఉంది. కానీ టీమిండియా 93 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు మార్కో జాన్సన్ ఔట్ చేయగా.. సైమన్ హార్మర్ 4 వికెట్లతో రాణించారు. ఓవరాల్ టెస్టులో 8 వికెట్లు తీసి సఫారీల విజయంలో కీలకపాత్ర పోషించాడు.





















