IND vs SA : బర్త్ డే రోజున విరాట్ అరుదైన రికార్డు, తొలి భారత బ్యాటర్‌గా మైల్ స్టోన్
ODI World Cup 2023: టీమిండియా రన్‌మెషిన్ కింగ్ కోహ్లీ జన్మదినం నాడు అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
టీమిండియా రన్‌మెషిన్ కింగ్ కోహ్లీ జన్మదినం నాడు....... అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ దిశగా సాగుతున్న విరాట్... మరో రికార్డును బద్దలు కొట్టాడు. ప్రొటీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 43 పరుగులు చేసిన విరాట్.. ఆ జట్టుపై అన్ని ఫార్మాట్లలో కలిపి 3 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. సఫారీలపై ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా కోహ్లీ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. సౌతాఫ్రికాపై ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 57 మ్యాచ్‌లాడిన కోహ్లీ 54 సగటుతో 2,957 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 43 పరుగుల వద్ద కోహ్లీ 3 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. సఫారీలపై కోహ్లీ 7 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు చేశాడు. దక్షిణాఫ్రికాతో 30 వన్డే మ్యాచ్‌లాడిన కోహ్లీ 61 సగటుతో 1403 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలున్నాయి. వన్డే ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో 3 మ్యాచ్‌లాడిన కోహ్లీ 21 సగటుతో 65 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో శతకం దిశగా సాగుతున్న కోహ్లీ ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు.
కోల్‌కత్తా వేదికగా ప్రపంచకప్‌లో భాగంగా భారత్, సౌతాఫ్రికా మ్యాచ్ జరగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియాకు అదిరే ఆరంభం లభించింది. రోహిత్ శర్మ ధనాధన్ బ్యాటింగ్‌తో భారత జట్టు స్కోరు జెట్ వేగంతో దూసుకెళ్లింది. 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో రోహిత్ 40 పరుగులు చేశాడు. అనంతరం 23 పరుగుల చేసిన గిల్ కూడా అవుటయ్యాడు. ఇప్పుడు కోహ్లీ, శ్రేయస్స్ అయ్యర్ జట్టును ముందుకు నడిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో పుట్టిన రోజు నాడు కోహ్లీ సెంచరీ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. కోహ్లీ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే వన్డే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేస్తాడు. సచిన్ 49 సెంచరీలు చేయగా.. కోహ్లీ ఇప్పటివరకు 48 సెంచరీలు చేశాడు. పుట్టిన రోజునాడు కోహ్లీ సెంచరీ చేసి సచిన్ రికార్డును సమం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
గత మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్స్ అయ్యర్ మరోసారి దానిని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉన్నాడు. ఇటు టీమిండియా బౌలింగ్ విభాగం పిచ్‌పై నిప్పులు చెరుగుతోంది. శ్రీలంకను కేవలం 55 పరుగులకే కుప్పకూల్చి సత్తా చాటింది. ఆడిన మూడు మ్యాచుల్లో మహమ్మద్ షమీ రెండోసార్లు అయిదు వికెట్లు తీసి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. బుమ్రా, సిరాజ్ కూడా మెరుపులు మెరిపిస్తున్నారు. కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా కూడా రాణిస్తుండడంతో టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది.
ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు అప్రతిహాత జైత్రయాత్ర సాగిస్తుంటే.... సఫారీ జట్టు కూడా అదే తరహాలో ముందుకు సాగుతోంది. ఒక్క నెదర్లాండ్స్ మినహా భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో అసలు దక్షిణాఫ్రికాకు ఓటమే లేదు. పవర్ హిట్టర్లతో నిండిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్.. భారత బౌలర్లకు సవాల్ విసరనుంది. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు 428 దక్షిణాఫ్రికా పేరు మీదే ఉంది. అయిదు మ్యాచుల్లో ప్రొటీస్ 300కుపైగా పరుగులు చేసింది. డి కాక్ ఏడు మ్యాచ్‌ల్లో 545 పరుగులతో ఈ ప్రపంచకప్‌లో టాప్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. కానీ లక్ష్యాన్ని ఛేదించడమే ప్రొటీస్‌ను ఇబ్బంది పెడుతోంది. దక్షిణాఫ్రికా పాకిస్థాన్‌పై చివరి వికెట్‌కు విజయం సాధించింది.