IND vs SA 1st ODI: చెప్తే అర్థమవ్వడం లేదా? శంషీ, బవుమాపై ఫైర్ అయిన డికాక్
IND vs SA 1st ODI: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (Quinton DeKock) ఫైర్ అయ్యాడు! కెప్టెన్ తెంబా బవుమా, స్పిన్నర్ తబ్రైజ్ శంషిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
IND vs SA 1st ODI: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (Quinton DeKock) ఫైర్ అయ్యాడు! కెప్టెన్ తెంబా బవుమా, స్పిన్నర్ తబ్రైజ్ శంషిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకే ఓవర్లో రెండు డీఆర్‌ఎస్‌లను వృథా చేయడమే అతడి కోపానికి కారణం. అతడే మాత్రం ఉత్సాహం చూపించకున్నా బౌలర్, కెప్టెన్ నిర్ణయాలు తీసుకోవడంతో అసహనం వ్యక్తం చేశాడు.
Quinton de Kock stone cold to Shamsi and he ended up being right! 😂#INDvSA pic.twitter.com/J4oeP3zlho
— 🏏Flashscore Cricket Commentators (@FlashCric) October 6, 2022
లక్నో నగరంలోని ఏకనా స్టేడియంలో గురువారం భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డేలో తలపడ్డాయి. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా స్వల్ప తేడాతో మ్యాచులో ఓటమి పాలైంది. అయితే శంషి వేసిన 30వ ఓవర్లో సఫారీలు రెండు డీఆర్‌ఎస్‌లను వృథా చేశారు. సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్ కీలకంగా ఆడుతుండటమే ఇందుకు కారణం. తొలి బంతిని శార్దూల్ ఆడాడు. అతడి ప్యాడ్లను తాకడంతో శంషీ గట్టిగా అప్పీల్ చేశాడు. ఔటివ్వకపోడంతో బవుమా డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. డౌన్ ద లెగ్ వెళ్తున్నట్టు తేలడంతో సమీక్ష వృథా అయింది.
మళ్లీ ఆఖరి బంతినీ శార్దూలే ఆడాడు. బంతి అతడి ప్యాడ్లను తాకడంతో డికాక్‌ను అడిగేందుకు శంషీ వెళ్లాడు. కానీ డికాక్ ఏమీ మాట్లాడుకుండా అవతలి ఎండ్‌కు వచ్చేశాడు. అస్సలు ఆసక్తి చూపించలేదు. విచిత్రంగా శంషీ మళ్లీ బవుమాను కన్‌విన్స్ చేశాడు. బంతి లెగ్ సైడ్ వెళ్తున్నట్టు కనిపించడంతో రెండో డీఆర్‌ఎస్ వృథా అయింది. దాంతో డికాక్ కెప్టెన్ బవుమా, శంషీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గట్టిగానే మాటలన్నాడు. ప్రస్తుతం ఇదంతా వైరల్‌గా మారింది.
Quinton de kock and his non chalance, that devil may care walk after Shamsi's appeal! Epic 😂😂
— Immortality (@ajay36mittal) October 6, 2022
Audition for next James Bond!#IndvsSA #IndvSA
IND vs SA 1st ODI Highlights
భారత్‌తో జరిగిన మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా తొమ్మిది పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అనంతరం భారత్ 40 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 240 పరుగులు మాత్రమే చేసింది. దీంతో తొమ్మిది పరుగులతో ఓటమి పాలైంది. సంజు శామ్సన్ (86 నాటౌట్: 63 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు) ఎంత పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. రెండో వన్డే ఆదివారం రాంచీలో జరగనుంది.
సంజు షో సరిపోలేదు
250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆశించిన ఆరంభం లభించలేదు. ఎనిమిది పరుగులకే ఓపెనర్లు శిఖర్ ధావన్ (4: 16 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (3: 7 బంతుల్లో) అవుటయ్యారు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ (19: 42 బంతుల్లో, ఒక ఫోర్), ఇషాన్ కిషన్ (20: 37 బంతుల్లో, మూడు ఫోర్లు) పరిస్థితిని కుదుట పరిచే ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రయత్నంలో వీరు మరీ నెమ్మదిగా ఆడటంతో కావాల్సిన రన్‌రేట్ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తోడు వీరిద్దరూ వెంట వెంటనే అవుటవ్వడంతో కష్టాలు మరింత పెరిగాయి.
ఆ తర్వాత సంజు శామ్సన్ (86 నాటౌట్: 63 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (50: 37 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) వేగంగా ఆడారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. ఆ తర్వాత అయ్యర్ అవుట్ కావడంతో శార్దూల్ ఠాకూర్ (33: 31 బంతుల్లో, ఐదు ఫోర్లు) క్రీజులోకి వచ్చాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 93 పరుగులు జోడించారు. చివరి ఐదు ఓవర్లలో 73 పరుగులు చేయాల్సిన దశలో సంజు శామ్సన్ చెలరేగాడు. మొదటి రెండు ఓవర్లలో 28 పరుగులు రావడంతో విజయంపై ఆశలు పెరిగాయి. తర్వాతి రెండు ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే రావడంతో పాటు మూడు వికెట్లను కూడా భారత్ కోల్పోయింది. చివరి ఓవర్లో 30 పరుగులు కావాల్సిన దశలో సంజు శామ్సన్ 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో భారత్ 40 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది.