IND Vs PAK: వర్షం కారణంగా ఆదివారం ఆట రద్దు - సోమవారం తిరిగి ప్రారంభం కానున్న మ్యాచ్!
భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఆదివారం జరుగుతున్న ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డేకు వాయిదా పడింది. సోమవారం ఈ మ్యాచ్ జరగనుంది.
ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో సోమవారం రిజర్వ్ డేకు మ్యాచ్‌ను వాయిదా వేశారు. భారత జట్టు 24.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ (8 బ్యాటింగ్: 16 బంతుల్లో), కేఎల్ రాహుల్ (17 బ్యాటింగ్: 28 బంతుల్లో, రెండు ఫోర్లు) ఉన్నారు. రేపు (సోమవారం) మ్యాచ్ ఇక్కడ నుంచే ప్రారంభం కానుంది.
నిజానికి ఆదివారమే మ్యాచ్‌ను ప్రారంభించడానికి నిర్వాహకులు ఎంతో ప్రయత్నించారు. కానీ భారీ వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ రెడీ చేయడం ఆలస్యం కావడం, అంపైర్లు పిచ్‌ను పరీక్షించి నిర్ణయం తీసుకునే సమయానికి తిరిగి వర్షం పడటంతో రిజర్వ్‌డేకు వాయిదా వేయక తప్పలేదు.
ఉడకని పాక్ పేస్ పప్పులు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ప్రారంభంలోనే వికెట్లు తీసి పాకిస్తాన్‌కు శుభారంభాన్నిచ్చే పేస్ దళం పప్పులు ఈ మ్యాచ్‌లో ఉడకలేదు. భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (58: 52 బంతుల్లో, 10 ఫోర్లు), రోహిత్ శర్మ (56: 49 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. మొదటి 10 ఓవర్లలో పాక్ బౌలర్లను బాదే బాధ్యతను శుభ్‌మన్ గిల్ తీసుకున్నాడు.
షహీన్ షా వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్, ఐదో ఓవర్లలో శుభ్‌మన్ గిల్ మూడేసి బౌండరీలు కొట్టాడు. దీంతో స్కోరు పరుగులు పెట్టింది. కానీ మరో ఎండ్‌లో నసీం షా కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. తన మొదటి మూడు ఓవర్లలో కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ అతని తర్వాతి రెండు ఓవర్లలో గిల్ 17 పరుగులు రాబట్టాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ కోల్పోకుండా భారత్ 61 పరుగులు చేసింది.
స్పిన్నర్ షాదాబ్ ఖాన్ బౌలింగ్‌కు వచ్చాక స్టీరింగ్ రోహిత్ చేతిలోకి వెళ్లింది. షాదాబ్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో గిల్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 37 బంతుల్లోనే గిల్ 50 కొట్టడం విశేషం. ఇదే ఓవర్లో రోహిత్ శర్మ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. ఇక షాదాబ్ ఖాన్ వేసిన తర్వాతి ఓవర్లో రోహిత్ కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 42 బంతుల్లోనే రోహిత్ 50 కొట్టాడు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత భారత్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు రోహిత్, గిల్ వరుస ఓవర్లలో అవుటయ్యారు. దీంతో భారత్ కేవలం రెండు పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. విరాట్ కోహ్లీ (8 బ్యాటింగ్: 16 బంతుల్లో), కేఎల్ రాహుల్ (17 బ్యాటింగ్: 28 బంతుల్లో, రెండు ఫోర్లు) క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా వర్షం పడి మ్యాచ్ రేపటికి (సోమవారం) వాయిదా పడింది.
On to the reserve day 🌧
— ICC (@ICC) September 10, 2023
India will resume their innings tomorrow as persistent rain has put a halt on proceedings 😯#AsiaCup2023 | #INDvPAK | 📝: https://t.co/01BrLxunr3 pic.twitter.com/sDwzdRGtuC
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial