Emerging Asia Cup Final: దంచికొట్టిన పాకిస్తాన్ - భారత్ ముందు కొండంత లక్ష్యం
IND A vs PAK A Final: ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో భారత్ ‘ఎ’ - పాకిస్తాన్ ‘ఎ’ మధ్య జరుగుతున్న ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్‌లో పాక్ భారీ స్కోరు చేసింది.
Emerging Asia Cup Final: టోర్నీ ఆసాంతం రాణించిన భారత యువ బౌలర్లు కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో చేతులెత్తేశారు. దాయాది పాకిస్తాన్ బ్యాటర్లు చెలరేగిన వేళ.. కొలంబో వేదికగా జరుగుతున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ - 2023లో పాక్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 352 పరుగుల భారీ స్కోరు సాధించింది. పాక్ బ్యాటర్ తయ్యబ్ తాహిర్ (71 బంతుల్లో 108, 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో భారత బౌలర్లను ఆటాడుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే టాపార్డర్ బ్యాటర్లు భారీ స్కోర్లు చేయాల్సిందే..
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న ఫైనల్‌లో టాస్ గెలిచిన భారత జట్టు సారథి యశ్ ధుల్.. పాకిస్తాన్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. అతడి నిర్ణయం తప్పు అని తెలియడానికి భారత్‌కు పెద్ద టైమ్ పట్టలేదు. పాక్ ఓపెనర్లు సయీమ్ అయూబ్ (51 బంతుల్లో 59, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) తో పాటు సహిబ్జద ఫర్హాన్ (62 బంతుల్లో 65, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తొలి వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. నాలుగు రోజుల క్రితమే ఇదే పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన రాజ్‌వర్ధన్ హంగర్గేకర్ పెద్దగా ప్రభావం చూపలేదు. ఎట్టకేలకు స్పిన్నర్ మానవ్ సుతర్ వేసిన 18వ ఓవర్లో అయూబ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కొద్దిసేపటికే ఫర్హాన్ కూడా రనౌట్ అయ్యాడు.
పరాగ్ మ్యాజిక్..
వన్ డౌన్‌లో వచ్చిన ఒమైర్ యూసుఫ్ (35 బంతుల్లో 35, 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మరో బ్యాటర్ తయ్యూబ్ తాహిర్‌తో కలిసి అతడు పాక్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. పరాగ్ వేసిన 28వ ఓవర్లో ఒమైర్.. అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరుసటి బంతికే కాసిమ్ అక్రమ్ ను పరాగ్ డకౌట్‌గా వెనక్కిపంపాడు. మహ్మద్ హరిస్(2)ను నిషాంత్ సింధు ఎల్బీగా ఔట్ చేశాడు. 28.4 ఓవర్లలో పాకిస్తాన్.. 187-5గా నిలిచింది.
తయ్యూబ్ దూకుడు
వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను తయ్యూబ్, ముబాసిర్ ఖాన్ (47 బంతుల్లో 35, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పునర్నిర్మించాడు. భారత స్పిన్నర్ల దాడిని సమర్థంగా అడ్డుకున్న తయ్యూబ్.. పేసర్లను కూడా ఆటాడుకున్నాడు. 42 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న తయ్యూబ్.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. మరో 22 బంతులలోనే అతడి సెంచరీ పూర్తయింది. వచ్చిన బంతిని వచ్చినట్టుగా బౌండరీకి తరలించాడు. ముబాసిర్ అండతో పాకిస్తాన్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ఇద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 126 పరుగులు జోడించారు. ఆఖరికి తయ్యూబ్.. హంగర్గేకర్ వేసిన 45వ ఓవర్లో ఐదో బంతికి అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
Tahir toh Maahir nikla! A century in the final. #INDvPAKonFanCode #ACCMensEmergingAsiaCup pic.twitter.com/ujPT05J2Fw
— FanCode (@FanCode) July 23, 2023
లోయరార్డర్ బ్యాటర్లు కూడా బ్యాట్ ఝుళిపించడంతో పాకిస్తాన్.. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పరాగ్, హంగర్గేకర్ తలా రెండు వికెట్లు తీయగా.. హర్షిత్, సుతర్, సింధులు తలా ఓ వికెట్ తీశారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial