IND vs PAK, Asia Cup 2023: ‘రోకో’ ఖేల్ ఖతం - ఆదుకోని అయ్యర్ - కష్టాల్లో టీమిండియా
పల్లెకెలె వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత టాపార్డర్‌కు పాక్ పేసర్లు చుక్కలు చూపించారు.
IND vs PAK, Asia Cup 2023: భారీ అంచనాల మధ్య ఆసియా కప్‌లో బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో పోరులో తడబడుతోంది. టాపార్డర్ బ్యాటర్లలో ముగ్గురు చేతులెత్తేయడంతో పది ఓవర్లు ముగిసేసరికే టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్ పనిపట్టేందుకు పక్కా ప్రణాళికతో వచ్చిన పాక్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిది టీమిండియాకు వరుస షాకులిచ్చాడు. రోహిత్ శర్మ తో పాటు విరాట్ కోహ్లీలను ఔట్ చేసి భారత్‌ను ఆదిలోనే దెబ్బతీశాడు. ఆసియా కప్ ప్రారంభానికి ముందు ‘రోకో (రోహిత్, కోహ్లీ) ఈజ్ బ్యాక్’ అని అభిమానులు ఈ ఇద్దరిమీద భారీ అంచనాలు పెట్టుకున్నా ఈ ధ్వయం మాత్రం దారుణంగా విఫలమయ్యారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు శుభారంభమేమీ దక్కలేదు. 22 బంతులాడి రెండు బౌండరీలతో టచ్ లోనే కనిపించిన రోహిత్ శర్మ .. కొద్దిసేపు వర్ష విరామం తర్వాత వచ్చీ రాగానే షహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. వర్షం వెలిశాక తాను ఎదుర్కొన్న నాలుగో బంతికే రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆఫ్ వికెట్ వైపుగా లోపలికి చొచ్చుకువచ్చిన బంతిని డిఫెన్స్ ఆడే క్రమంలో రోహిత్ మిస్ అయినా బాల్ మాత్రం తన గ్యాన్ని ముద్దాడింది. భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
కోహ్లీదీ అదే బాట..
పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటేనే కసిగా ఆడే కోహ్లీ అయినా నిలబడతాడేమో అనుకుంటే అతడిదీ అదే పరిస్థితి. ఎదుర్కున్న నాలుగో బంతికి బౌండరీ కొట్టి ఖాతా తెరిచిన విరాట్.. తర్వాత అఫ్రిది వేసిన ఉచ్చులో చిక్కాడు. ఏడో ఓవర్లో మూడో బంతిని తప్పుగా అంచనావేసిన కోహ్లీ.. వికెట్ల మీదకు ఆడుకున్నాడు. కోహ్లీ ఖేల్ ఖతం.
Glimpses from the first 4 overs before rain interrupted play! It was a captivating battle between bat and ball. Shaheen Afridi and Naseem Shah bowled impeccable lines and lengths, but the Indian openers appeared formidable against the new ball! 🤩#AsiaCup2023 #PAKvIND pic.twitter.com/BRDyCYXt1P
— AsianCricketCouncil (@ACCMedia1) September 2, 2023
అయ్యర్ ఆదుకోలే..
ఇద్దరు టాపార్డర్ బ్యాటర్లు ఔట్ అయిన నేపథ్యంలో ఫోర్త్ ప్లేస్ లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అయినా భారత్‌ను ఆదుకుంటాడనుకుంటే అదీ జరుగలేదు. హరీస్ రౌఫ్ వేసి 8వ ఓవర్లో రెండు బౌండరీలు కొట్టి జోరుమీద కనిపించిన అయ్యర్.. అతడే వేసిన పదో ఓవర్లో ఐదో బంతికి పెవిలియన్ చేరాడు. రౌఫ్ వేసిన పదో ఓవర్లో ఐదో బంతిని పుల్ షాట్ ఆడబోయి ఫకర్ జమాన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో భారత్ మూడో వికెట్‌ను కూడా కోల్పోయింది.
మళ్లీ అడ్డుకున్న వర్షం..
ఆటకు వర్షం రెండోసారి అంతరాయం కలిగించింది. ఐదో ఓవర్లో ఒకసారి వర్షం కురవడంతో 20 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. మళ్లీ హరీస్ రౌఫ్ 12వ ఓవర్ వేసే క్రమంలో రెండో బంతి పడ్డాక మరోసారి వర్షం రావడంతో ఆటను అంపైర్లు తాత్కాలికంగా నిలిపేశారు. ప్రస్తుతానికి పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి భారత్.. 11.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 51 పరుగులు సాధించింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial