IND Vs PAK Asia Cup 2022: పగ తీర్చుకున్న పాకిస్తాన్ - సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియాపై విక్టరీ!
ఆసియా కప్‌లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఐదు వికెట్లతో ఘనవిజయం సాధించింది.
ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్తాన్ పగ తీర్చుకుంది. సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియాపై ఐదు వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 19.5 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహ్మద్ నవాజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
రిజ్వాన్ షో
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ తన మొదటి వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (14: 10 బంతుల్లో, రెండు ఫోర్లు) ఈ మ్యాచ్‌లో కూడా విఫలం అయ్యాడు. అయితే మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (71: 51 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) వేగంగా ఆడాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఫకార్ జమాన్ (15: 18 బంతుల్లో, రెండు ఫోర్లు) ఇబ్బంది పడ్డా... తన తర్వాత వచ్చిన మహ్మద్ నవాజ్ (42: 20 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) మాత్రం చెలరేగి ఆడాడు. నవాజ్, రిజ్వాన్ జోడి 11 నుంచి 16 ఓవర్ల వరకు ప్రతి ఓవర్లోనూ 10 పరుగులకు పైగానే రాబట్టింది.
అయితే కీలక సమయంలో నవాజ్‌ను భువీ, రిజ్వాన్‌ను హార్దిక్ పాండ్యా అవుట్ చేయడంతో భారత్ తిరిగి మ్యాచ్‌లోకి వచ్చింది. కానీ రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఆసిఫ్ అలీ (16: 8 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను అర్ష్‌దీప్ సింగ్ వదిలేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత భువీ వేసిన ఓవర్లో ఆసిఫ్ అలీ మూడు బౌండరీలు కొట్టడంతో ఆ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. దీంతో చివరి ఓవర్‌లో ఏడు పరుగులు చేయాల్సి వచ్చింది. అర్ష్‌దీప్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ ఐదో బంతి వరకు వచ్చింది. 19.5 ఓవర్లలో పాకిస్తాన్ మ్యాచ్‌ను ముగించింది.
ఫాంలోకి వచ్చిన కింగ్
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్, రాహుల్ అదిరే ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మొదటి మ్యాచులో ఇబ్బందిపెట్టిన పాక్ యువ బౌలర్ నసీమ్ షా బౌలింగ్ ను ఆటాడుకున్నారు. అయితే రౌఫ్ వేసిన ఆరో ఓవర్లో భారీ షాట్ కొట్టబోయి రోహిత్ (28) ఔటయ్యాడు. ఆ వెంటనే రాహుల్ (28) కూడా స్పిన్నర్ షాదాబ్ ఖాన్ వేసిన తొలి బంతికే క్యాచ్ ఔటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్య తొలి బంతినే బౌండరీకి తరలించాడు. అయితే స్పిన్నర్లు బౌలింగ్ కి వచ్చాక స్కోరు వేగం తగ్గింది. కోహ్లీ అడపాదడపా బౌండరీలు కొడుతున్నా అనుకున్నంత వేగంగా పరుగులు రాలేదు. పది ఓవర్లు ముగిసేసరికి సూర్యకుమార్(13) వికెట్ కోల్పోయి 93 పరుగులు చేసింది. కోహ్లీకి జతకలిసిన పంత్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన హార్దిక్ 2 బంతులు మాత్రమే ఆడి డకౌట్ గా వెనుదిరిగాడు.
అయితే ఓవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో కోహ్లీ నిలకడగా ఆడి స్కోరు వేగం మందగించకుండా చూశాడు. దీపక్ హుడాతో కలిసి అప్పుడప్పుడూ బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. 18వ ఓవర్లో సిక్స్ తో అర్థశతకం పూర్తిచేసుకున్నాడు. అయితే అదే ఓవర్లో హుడా(16) వికెట్ ను కోల్పోయింది. చివరి ఓవర్లో కోహ్లీ(60) ఔటయ్యాడు. రవి బిష్ణోయ్ చివరి 2 బంతుల్లో 2 బౌండరీలు కొట్టాడు.