Mount Maunganui Weather Reports: రెండో టీ20 జరిగేనా? మౌంట్‌మాంగనూయ్‌లో 4 రోజులు భారీ వర్షాలు!
IND vs NZ T20: టీమ్‌ఇండియా అభిమానులకు చేదువార్త! భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 సజావుగా సాగకపోవచ్చు. మౌంట్ మాంగనూయ్‌లో నాలుగైదు రోజులుగా వర్షాలు పడుతున్నాయి.
IND vs NZ T20, Mount Maunganui Weather Report: టీమ్‌ఇండియా అభిమానులకు చేదువార్త! భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 సజావుగా సాగకపోవచ్చు. మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న మౌంట్ మాంగనూయ్‌లో నాలుగైదు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారం.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ నిష్క్రమణ తర్వాత టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. సీనియర్లకు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం ఈ సిరీసుకు పూర్తిగా కుర్రాళ్లనే పంపించింది. దాంతో వారెలా ఆడతారో చూడాలని అభిమానులు ఆసక్తితో ఉన్నారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యేట్టు ఉన్నాయి. ట్రాన్స్ టాస్మేనియా ప్రాంతంలో నెల రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. లానినా ప్రభావం ఉండటమే ఇందుకు కారణం. అందుకే ఆస్ట్రేలియాలో ప్రపంచకప్ మ్యాచులు కొన్ని బంతి పడకుండానే రద్దయ్యాయి. కొన్ని మధ్యలో ఆగిపోయాయి.
వాస్తవానికి శుక్రవారం వెల్లింగ్టన్‌లో భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 ఆడాల్సి ఉంది. ఉదయం నుంచి అక్కడ వర్షం కురుస్తూనే ఉంది. మ్యాచ్ సమయానికి మరింత ఎక్కువైంది. వరుణుడు కరుణించకపోవడంతో టాస్, బంతి పడకుండానే మ్యాచ్ రద్దైంది. ఇప్పుడు ఆటగాళ్లు మౌంట్ మాంగనూయ్‌లో అడుగు పెట్టారు. వారికి స్థానికులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఎన్నో ఆశలతో రెండో మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న క్రికెటర్లకు ఇప్పుడు నిరాశే ఎదురవుతోంది.
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు 36 శాతం, 8 గంటలకు 49 శాతం, 9 గంటలకు 64 శాతం, 10 గంటలకు 64 శాతం, 11 గంటలకు 40 శాతం, 12 గంటలకు 34 శాతం వర్షం కురుస్తుందని అంచనా. సరిగ్గా మ్యాచ్ సైతం 8 గంటలకు మొదలై 12 వరకు జరుగుతుంది. వాతావరణ శాఖ అంచనా చూస్తుంటే కనీసం టాసైనా పడుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
View this post on Instagram
View this post on Instagram