IND vs NZ: భారత్-కివీస్ మ్యాచ్‌లో పరుగుల వరద ఖాయమా! వాంఖడేలో పిచ్ ఎలా ఉంది?
ODI World Cup 2023: భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే వేదికగా జరగనుంది. తొలుత బ్యాటింగ్‌కు అనుకూలించే వాంఖడే పిచ్..మ్యాచ్ గడుస్తున్నా కొద్దీ బౌలర్లకు అనుకూలిస్తుంది.
World Cup 2023 First Semi Final: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ అంతిమ దశకు చేరుకుంది. దీపావళి రోజున భారత్-నెదర్లాండ్స్ మధ్య జరిగిన ఆఖరి మ్యాచ్‌తో లీగ్ దశ విజయవంతంగా ముగిసింది. ఇక మిగిలింది నాకౌట్ పోరు మాత్రమే. రేపు(బుధవారం) నుంచి ఈ ఆసక్తికర, ఉత్కంఠభరిత సమరానికి తెరలేవనుంది. ఈ మహా సంగ్రామంలో తొలి సెమీస్‌లో భారత్-న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఈ ప్రపంచకప్ ఆరంభానికి ముందు జట్టు తుది కూర్పు, మిడిలార్డర్ వైఫల్యం వంటి సమస్యలతో కనిపించిన రోహిత్ సేన.. బరిలోకి దిగాక మాత్రం అంచనాలను మించి రాణిస్తోంది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. గత నెల ఆస్ట్రేలియాతో ప్రారంభమైన రోహిత్‌సేన ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌ల ప్రస్థానం... నెదర్లాండ్స్‌తో మ్యాచ్ వరకు నిరాటంకంగా సాగింది. ఇక మిగిలింది రెండు మ్యాచ్‌లే. ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే ముచ్చటగా మూడోసారి టీమిండియా కప్పును ముద్దాడుతుంది.
భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే వేదికగా జరగనుంది. ఈ పిచ్‌పై పరుగుల వరద ఖాయమని మాజీలు అంచనా వేస్తున్నారు. తొలుత బ్యాటింగ్‌కు అనుకూలించే వాంఖడే పిచ్..మ్యాచ్ గడుస్తున్నా కొద్దీ బౌలర్లకు అనుకూలిస్తుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు దాదాపుగా బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. గత ప్రపంచకప్ మ్యాచుల్లోనూ వాంఖడే పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇక్కడ దక్షిణాఫ్రికా రెండు సార్లు భారీ స్కోర్లు నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఏడు వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్‌పై కూడా ఎనిమిది వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. ఈ రెండు మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసి దక్షిణాఫ్రికా భారీ స్కోర్లు నమోదు చేయడమే కాకుకుండా ఘన విజయాలు కూడా సాధించింది.
అనంతరం శ్రీలంకపై టీమ్‌ఇండియా కూడా 357 పరుగులు చేసింది. లంక బౌలర్లను ఊచకోత కోసింది. ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లు లంకేయులను 55 పరుగులకే కుప్పకూల్చి ఘన విజయం సాధించారు. ఇక ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. అనంతరం విజయం ముంగిట అఫ్గాన్ బోల్తా పడింది. 91 పరుగులకే ఏడు వికెట్లను తీసి విజయం దిశగా సాగుతున్న అప్ఘానిస్థాన్‌ను మ్యాక్స్‌వెల్ అద్భుత ఇన్నింగ్స్ అడ్డుకుంది. అఫ్గాన్ బౌలర్లను ఊచకోత కోసిన మ్యాక్స్‌వెల్ డబల్ సెంచరీతో కంగారులకు చిరస్మరణీయ విజయం అందించాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసే జట్టుకే ఎక్కువ విజయావకాశాలుంటాయి. మొదట బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేయొచ్చు. ఈ ఎర్రమట్టి పిచ్ ఆట సాగుతున్నా కొద్దీ పేసర్లు, స్పిన్నర్లకూ అనుకూలించే అవకాశం ఉంది. దీంతో ఛేదనలో పరిస్థితులు బౌలింగ్‌కు అనువుగా మారే ఆస్కారముంది.
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీస్ జరిగే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ బౌలింగ్, బ్యాటింగ్‌కు సమానంగా సహకరించే అవకాశాలున్నాయి. ఈ టోర్నీలో ఇక్కడ మొదట బంగ్లాదేశ్‌పై 229 పరుగులు చేసిన నెదర్లాండ్స్ అనంతరం ప్రత్యర్థిని 142కే ఆలౌట్ చేసింది. మరో మ్యాచ్‌లో మొదట బంగ్లా 204 చేయగా పాకిస్థాన్ 32.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఇక దక్షిణాఫ్రికాపై భారత్ 326/5 భారీ స్కోరు చేసి బౌలింగ్‌లో చెలరేగి సఫారీ జట్టును 83కే కుప్పకూల్చింది.