IND vs NZ : ఇలాంటి మ్యాచ్‌లప్పుడే అదృష్టం కలిసి రావాలి- ఒత్తిడి కొత్తకాదు- రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
Ind vs NZ First Semi Final Match: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. ఫైనల్ చేరాలంటే అడ్డుగా ఉన్న న్యూజిలాండ్‌తో అసలు సిసలు మ్యాచ్‌కు సమాయత్తమైంది.
IND vs NZ Semi Final World Cup 2023 At Mumbai: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత్(India) కీలక పోరుకు సిద్ధమైంది. ఫైనల్ చేరాలంటే అడ్డుగా ఉన్న న్యూజిలాండ్(New Zealand)తో అసలు సిసలు మ్యాచ్‌కు సమాయత్తమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్న ఇరు జట్లు వ్యూహ, ప్రతి వ్యూహాలతో సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా సారధి రోహిత్ శర్మ(Rohit Sharma) కీలక వ్యాఖ్యలు చేశాడు. ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుందని... ఇప్పుడు తాము అదే నమ్మకంతో, ధైర్యంతో బరిలోకి దిగుతున్నామని హిట్‌మ్యాన్ స్పష్టం చేశాడు. ఇలాంటి మ్యాచ్‌లప్పుడే కాస్త అదృష్టం కూడా కలిసి రావాలని... అది ఈ మ్యాచ్‌లో తమకు కలిసి వస్తుందని బలంగా నమ్ముతున్నట్లు రోహిత్ తెలిపాడు. టోర్నీలో తొలి ఐదు మ్యాచ్‌లలో తాము లక్ష్యాన్ని ఛేదించామని, తర్వాతి నాలుగు మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్ చేశామని కాబట్టి బ్యాటింగ్ అయినా.. ఛేజింగ్ అయినా తమకు ఒకటే అని హిట్‌మ్యాన్ తేల్చి చెప్పాడు. ప్రపంచకప్ లీగ్ దశలో జరిగిన తొమ్మిది మ్యాచుల్లో ఇప్పటికే తమను తాము అన్ని రకాలుగా పరీక్షించుకున్నామని.. ఇక మిగిలింది దానిని అమల్లో పెట్టడమే అని రోహిత్ శర్మ వెల్లడించారు. గత మ్యాచ్‌లతో పోలిస్తే న్యూజిలాండ్‌తో జరిగి సెమీఫైనల్ మ్యాచ్ ప్రాధాన్యత ఏమిటో మాకు తెలుసని.. అయినాసరే ఇప్పటి వరకు ఎలా ఆడామో అలా ఆడితే చాలని రోహిత్ వెల్లడించాడు.
ఒత్తిడి తమకు కొత్తేం కాదని.. ఆ ఒత్తిడిని ఎన్నో సార్లు ఎదుర్కొని సత్తా చాటామని గుర్తు చేశాడు. ప్రపంచకప్‌లాంటి లీగ్ మ్యాచుల్లో సెమీస్ అయినా లీగ్ మ్యాచ్ అయినా ఒత్తిడి తప్పకుండా ఉంటుందని... తమపై ఆ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుందని రోహిత్ తెలిపాడు. ఎన్నోసార్లు ఒత్తిడిని తాము దాటి వచ్చామని తెలిపాడు. ఇప్పుడు భారత క్రికెట్ జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎన్నోసార్లు ఒత్తిడిని అనుభవించి.. ఆ ఒత్తిడి నుంచి ఎన్నోసార్లు జట్టును రక్షించారని రోహిత్ గుర్తు చేశాడు. న్యూజిలాండ్ ఎంతో తెలివైన, క్రమశిక్షణ కలిగిన జట్టని. ప్రత్యర్ధిని బాగా అర్థం చేసుకొని తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటారని రోహిత్ అన్నాడు. 1983లో భారత్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ప్రస్తుత జట్టులో ఎవ్వరూ పుట్టనే లేదని... 2011లో ఇప్పుడున్న సగం మంది క్రికెటర్లు అసలు ఆడడమే మొదలు పెట్టలేదని రోహిత్ అన్నాడు. గత ప్రపంచకప్‌లో ఏం జరిగిందనేది.. వర్తమానంలో న్యూజిలాండ్‌తో నాకౌట్ మ్యాచుల్లో ఏం జరిగిందనేది తమకు అవసరమే లేదని రోహిత్ తేల్చి చెప్పాడు. కానీ ఇప్పుడున్న జట్టుకు మూడోసారి ప్రపంచకప్‌ను అందించే సువర్ణావకాశం దక్కిందని తెలిపాడు.
ప్రపంచకప్ లీగ్ దశలో పరాజయమే లేకుండా సెమీఫైనల్‌కు చేరుకున్న టీమిండియా.. నేడు కీలక పోరుకు సిద్ధమైంది. ముంబయిలో(Mumbai)ని వాంఖడే వేదిక(Wankhede Stadium) గా న్యూజిలాండ్‌తో నాకౌట్ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న రోహిత్ సేన.. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించడం ఖాయమన్న అంచనాలు ఉన్నా సెమీస్ ఫోబియా అభిమానులను కలవరపెడుతోంది. ICC టోర్నీల్లో భారత్‌పై కివీస్‌కు ఘనమైన రికార్డు ఉన్నా ఈ మ్యాచ్‌లో వాటన్నింటినీ పటాపంచలు చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. గత ప్రపంచకప్ సెమీస్‌లో ఎదురైన పరాభవానికి ఈ సెమీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన కసిగా ఉంది.