IND vs BAN 1st ODI: రాహుల్‌పై రాహుల్ అటెన్షన్! ప్రాక్టీస్ సెషన్లో పాఠాలు చెప్పిన కోచ్
IND vs BAN 1st ODI: వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా దృష్టి సారించాడు. వేర్వేరు స్థానాల్లో ఆడుతున్నప్పుడు బ్యాటింగ్ దృక్పథం ఎలా ఉండాలో అతడికి బోధించాడు.
IND vs BAN 1st ODI
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీసుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఆటగాళ్లు ఉదయం, సాయంత్రం నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా దృష్టి సారించాడు. వేర్వేరు స్థానాల్లో ఆడుతున్నప్పుడు బ్యాటింగ్ దృక్పథం ఎలా ఉండాలో అతడికి బోధించాడు. బంతిని ఎదుర్కొనేటప్పుడు బ్యాటర్ మైండ్‌సెట్ ఎంత స్పష్టంగా ఉండాలో వివరించాడని తెలిసింది.
ఏడాదిగా ఇబ్బంది
ఐపీఎల్‌ను మినహాయిస్తే ఏడాది కాలంగా కేఎల్ రాహుల్ ఇబ్బంది పడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో పరుగులు చేయలేకపోతున్నాడు. ఇన్‌స్వింగింగ్ డెలివరీలకు బోల్తా పడుతున్నాడు. బంతిని ఎదుర్కొనేటప్పుడు రెండు, మూడు షాట్ల గురించి ఆలోచిస్తూ వికెట్ ఇచ్చేస్తున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ మెరుగైన ఆరంభాలు ఇవ్వలేదు. పాకిస్థాన్, దక్షిణాఫ్రికా వంటి కఠిన ప్రత్యర్థులపై ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. తన స్థాయికి తగినట్టు బ్యాటింగ్ చేయలేదు. దీంతో విమర్శల పాలయ్యాడు.
వన్డేల్లో మిడిలార్డర్
న్యూజిలాండ్ సిరీసులో విశ్రాంతి తీసుకున్న కేఎల్ రాహుల్ బంగ్లా పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే ఇప్పుడు భిన్నమైన పాత్రలోకి మారుతున్నాడు. టీ20ల్లో మాదిరిగా ఓపెనింగ్ చేయడు. రోహిత్ శర్మకు జోడీగా శిఖర్ ధావన్ ఉన్నాడు. దాంతో మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు రానున్నాడు. వాస్తవంగా రెండేళ్లుగా అతడు 4, 5 స్థానాల్లోనే ఆడుతున్నాడు. నాలుగో స్థానంలో 6 మ్యాచులాడి 41 సగటు, 84 స్ట్రైక్‌రేట్‌తో 209 పరుగులు చేశాడు. ఐదో స్థానంలో 10 వన్డేల్లో 56 సగటు, 113 స్ట్రైక్‌రేట్‌తో 453 పరుగులు సాధించాడు. ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి.
పోటీ ఎక్కువే
మిడిలార్డర్లోనూ కేఎల్ రాహుల్‌కు పోటీ ఎక్కువగానే ఉంది. ఓపెనర్లుగా రోహిత్, శిఖర్ వస్తారు. వన్‌డౌన్ ఎప్పటికీ కింగ్ కోహ్లీదే. 4, 5 స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ పోటీకి ఉన్నారు. ఒకవేళ 4లో సూర్య ఆడితే రాహుల్ 5లో వస్తాడు. పంత్ 6కు పరిమితం అవుతాడు. శ్రేయస్‌కు చోటు దొరక్కపోవచ్చు. వేర్వేరు ఫార్మాట్లలో వేర్వేరు స్థానాల్లో వస్తున్నప్పుడు బ్యాటర్ మైండ్‌సెట్ స్పష్టంగా ఉండాలి. అందుకే రాహుల్ ద్రవిడ్ కేఎల్‌పై దృష్టి పెట్టాడు. టెక్నిక్ పరంగానూ కొన్ని సూచనలు చేశాడు. బంతిని ఎదుర్కొనేటప్పుడు ఎలా ఆలోచించాలో వివరించాడు. ద్రవిడ్‌కు కెరీర్లో ఓపెనింగ్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు ఆడిన అనుభవం ఉందన్న సంగతి తెలిసిందే.
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ డిసెంబర్ 4న జరగనుంది. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ డిసెంబర్ 7న జరగనుంది. అదే సమయంలో ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ డిసెంబర్ 10న జరగనుంది. ఈ సిరీస్ మొత్తం మూడు మ్యాచ్‌లు మీర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరుగుతాయి. దీంతో పాటు ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి 18 వరకు చిట్టగాంగ్లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరగనుంది. ఈ టెస్టు సిరీస్ లో చివరి మ్యాచ్ డిసెంబర్ 22 నుంచి 26 వరకు ఢాకాలో జరగనుంది
బంగ్లాదేశ్ పర్యటనకు భారత జట్టు
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఎమ్.డి. సిరాజ్, దీపక్ చాహర్, యశ్ దయాళ్.