Warner ruled out: ఏంటి వార్నర్ - ఇంత పనిచేశావ్! మిగతా 2 టెస్టుల నుంచి ఔట్!
Warner ruled out: ఆస్ట్రేలియాకు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి! టీమ్‌ఇండియాతో చివరి రెండు టెస్టులకు డేవిడ్ వార్నర్ (David Warner) దూరమవుతున్నాడు.
Warner ruled out:
ఆస్ట్రేలియాకు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి! టీమ్‌ఇండియాతో చివరి రెండు టెస్టులకు డేవిడ్ వార్నర్ (David Warner) దూరమవుతున్నాడు. గాయం కారణంగా బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. కోలుకొనేందుకు సిడ్నీకి పయనమవుతున్నాడని సమాచారం. మార్చి చివర్లో జరిగే వన్డే సిరీసుకు అందుబాటులో ఉంటాడని తెలిసింది.
దిల్లీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) రెండో టెస్టులో తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj) వేసిన ఓ బంతి వార్నర్ మోచేతుల్ని తాకుతూ వెళ్లింది. నొప్పితో విలవిల్లాడిన అతడు నొప్పి నివారణ మందులు తీసుకొని బ్యాటింగ్ కొనసాగించాడు. మరికాసేపటికే ఇంకో బంతి అతడి హెల్మెట్‌కు తాకింది. దాంతో డీలేయిడ్ కంకషన్ రూపంలో క్రీజును వదిలాడు. మ్యాచ్ తర్వాత స్కానింగ్ చేయించుకోగా హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ అయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
వార్నర్ కంకషన్ నుంచి బయటపడ్డప్పటికీ మోచేతి గాయం నుంచి కోలుకోలేదు. చిన్నపాటి చీలికే అయినా ప్రాక్టీస్‌లో నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. మూడో టెస్టు ఆడాలని సోమవారం రాత్రి వరకు ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాత అతడి కదలికలు, ఆటతీరును నిపుణులు పరిశీలించారు. గాయం మరింత తీవ్రం కాకూదని సిరీస్ నుంచి తప్పించారు. దాంతో కుటుంబంతో కలిసి అతడు స్వదేశం వెళ్లనున్నాడు.
గాయపడిన డేవిడ్ వార్నర్ స్థానంలో ట్రావిస్ హెడ్ (Travis Head) జట్టులోకి రానున్నాడు. దిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్సులో మెరుగైన స్కోరు చేశాడు. డేవీ లేని లోటును పూడ్చాడు. ఓపెనింగ్ వచ్చి 43 పరుగులు చేశాడు. మంచి టచ్‌లో కనిపించాడు. ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ ఫిట్‌నెస్ సాధించాడని ఆ జట్టు కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ చెప్పాడు. ఇండోర్ టెస్టుకు సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. మిచెల్ స్టార్క్ సైతం అందుబాటులో ఉన్నాడన్నారు. కాగా ఇప్పటికే జోష్ హేజిల్‌వుడ్ సిరీస్‌కు దూరమయ్యాడు. కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవ్వడంతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా వెళ్లిన సంగతి తెలిసిందే.
రెండో టెస్టు రీక్యాప్!
IND vs AUS 2nd Test: అద్భతాలు జరగలేదు. అంచనాలు మారలేదు. ఫలితం తారుమారు కాలేదు. సొంతగడ్డపై భారత్ ను ఓడించడం ఎంత కష్టమో మరోసారి నిరూపిస్తూ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం సాధించింది. రవీంద్ర జడేజా సూపర్ స్పెల్ కు రోహిత్, పుజారా, కోహ్లీ, శ్రీకర్ భరత్ ల సమయోచిత బ్యాటింగ్ తోడైన వేళ టీమిండియా కంగూరూలను మట్టికరిపించింది.
రెండోరోజు ఆధిపత్యం ప్రదర్శించిన ఆస్ట్రేలియాను మూడోరోజు లంచ్ లోపే ఆలౌట్ చేయడం దగ్గరే భారత్ విజయానికి పునాది పడింది. రెండో రోజు చివరి సెషన్ లో దూకుడుగా ఆడి భారత్ ను ఆత్మరక్షణలో పడేసిన ఆసీస్ బ్యాటర్లు.. మూడో రోజుకొచ్చేసరికి తేలిపోయారు. అశ్విన్, జడేజాల ధాటికి ఒక్క సెషన్ కూడా పూర్తిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ముఖ్యంగా జడ్డూ తన బౌలింగ్ తో కంగారూలకు కంగారు పుట్టించాడు. క్రీజులో బ్యాటర్లను నిలవనీయకుండా చేశాడు. మరోవైపు అశ్విన్ చక్కని సహకారం అందించాడు. వీరి స్పిన్ మాయాజాలానికి 52 పరుగులకే ఆసీస్ చివరి 9 వికెట్లను కోల్పోయింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఛేదనలో రోహిత్ శర్మ (20 బంతుల్లో 31), విరాట్ కోహ్లీ (31 బంతుల్లో 20), ఛతేశ్వర్ పుజారా (74 బంతుల్లో 31 నాటౌట్), శ్రీకర్ భరత్ (22 బంతుల్లో 23 నాటౌట్) రాణించారు. అంతకుముందు రవీంద్ర జడేజా (7 వికెట్లు), అశ్విన్ (3) లు చెలరేగటంతో రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 113 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో సిరీస్ లో టీమిండియా 2-0 ఆధిక్యం సాధించింది.