Pant vs Sanju: సంజూతో బీకేర్ ఫుల్ పంత్! లేదంటే ఫ్యూచర్లో ఫ్యూచర్ ఉండదు!
Rishabh Pant vs Sanju Samson: రిషభ్ పంత్..! గతంలో టీమ్‌ఇండియాకు భవిష్యత్తు అన్నారు. ఇప్పుడు డీకేకు ఛాన్సులు ఇస్తున్నారు. మరి సంజూని తీసుకుంటే తప్పేంటన్న ప్రశ్నలు పెరుగుతున్నాయి?
Pant vs Sanju: రిషభ్ పంత్..! గతంలో టీమ్‌ఇండియాకు భవిష్యత్తు అన్నారు. ఇప్పుడు అతడి భవితవ్యం ఏంటో ఎవరికీ తెలియడం లేదు. ఒకప్పుడు వీ వాంట్ రిషభ్ పంత్ అన్నోళ్లే ఇప్పుడు వదిలేస్తే బెటర్ అంటున్నారు. కొన్ని రోజులుగా తుది పదకొండు మందిలో అతడికి అవకాశమే దొరకడం లేదు. ఒకవేళ వచ్చినా అతడు పరుగులేం చేయకుండా ఇబ్బంది పెడుతున్నాడు. దాంతో దినేశ్ కార్తీక్‌ను తీసుకోవడం అనివార్యంగా మారింది. అలాంటప్పుడు సంజూ శాంసన్‌ను తీసుకుంటే తప్పేంటని అంతా ప్రశ్నిస్తున్నారు.
ఇష్టమైన ఫార్మాట్లో కష్టంగా!
అసలు రిషభ్ పంత్ అంటే గుర్తొచ్చే ఫార్మాటే టీ20. అలాంటిది ఇప్పుడతడు పొట్టి ఫార్మాట్లో చోటు దక్కించుకోవడం లేదు. ఐపీఎల్‌లో ఒంటిచేత్తో సిక్సర్లు బాది ప్రత్యర్థులను వణికించిన అతడు ఇప్పుడు సులభంగా ఔటైపోతున్నాడు. మునుపటి స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయడం లేదు సరికదా చెత్త షాట్లతో ఔటై విసిగిస్తున్నాడు. వన్డే, టెస్టు క్రికెట్లో అతడిని వికెట్ కీపర్‌గా కొనసాగించి టీ20ల్లోకి సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌ను తీసుకుంటే బెటరన్న సూచనలు వినిపిస్తున్నాయి. అవసరమైతే కేఎల్ రాహుల్‌తో కీపింగ్ చేయించుకోవచ్చు కదా అన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.
గత్యంతరం లేకే డీకే!
ఆసియాకప్ ముందు నుంచీ టీమ్‌ఇండియాకు ఇదే తలనొప్పి. దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్‌లో ఎవరిని పక్కన పెట్టాలో తెలియక టీమ్ మేనేజ్‌మెంట్ తలపట్టుకుంటోంది. ఇద్దరినీ అకామిడేట్ చేసే సిచ్యువేషన్ లేదు. ఎలాగూ బ్యాటింగ్‌లో పంత్ విఫలం అవుతున్నాడని డీకేకు ఛాన్స్ ఇచ్చేస్తున్నారు. కనీసం ఆఖరి 4 ఓవర్లలోనైనా అతడు షాట్లు కొడతాడని నమ్ముతున్నారు. ఆసీస్ మ్యాచుకు ముందు 2022 నుంచి టీ20ల్లో ఆఖరి 5 ఓవర్లలో డీకే 184 స్ట్రైక్‌రేట్‌తో 418 పరుగులు చేశాడు. దాదాపుగా 3.6 బంతులకు ఒకసారి బౌండరీ లేదా సిక్స్ కొడుతున్నాడు. లెఫ్ట్ హ్యాండర్ కోటాలో అక్షర్ పటేల్ లేదా జడ్డూను తీసుకుంటున్నారు కాబట్టి పంత్ కథ దాదాపు ముగిసినట్టే అనిపిస్తోంది.
పంత్ vs డీకే vs సంజూ
రిషభ్ పంత్ ఇప్పటి వరకు 58 టీ20లు ఆడి 934 పరుగులు చేశాడు. సగటు 24, స్ట్రైక్‌రేట్ 127. మూడు హాఫ్ సెంచరీలు కొట్టాడు. విచిత్రంగా 27 వన్డేల్లో 37 సగటు, 109 స్ట్రైక్‌రేట్‌తో అతడు 840 రన్స్ చేశాడు. ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2022లో 17 టీ20లు ఆడి 133 స్ట్రైక్‌రేట్, 26 సగటుతో 311 రన్స్ సాధించాడు. ఛేజింగ్‌లో అతడి గణాంకాలు మరీ పేలవంగా ఉన్నాయి. ఆసీస్‌లో 3 మ్యాచులాడి కొట్టింది 20 రన్స్. మొత్తం 171 టీ20ల్లో 145 స్ట్రైక్‌రేట్, 32 సగటుతో 4301 రన్స్ సాధించాడు. మరోవైపు డీకే టీమ్‌ఇండియా తరఫున 51 టీ20ల్లో 140 స్ట్రైక్‌రేట్, 28 సగటుతో 598 రన్స్ కొట్టాడు. మొత్తంగా టీ20ల్లో 134 స్ట్రైక్‌రేట్, 28 సగటుతో 6853 రన్స్ సాధించాడు. 2022లో డీకే 19 టీ20ల్లో 132 స్ట్రైక్‌రేట్, 20 సగటుతో 199 కొట్టాడు. ఆసీస్ గడ్డపై 4 మ్యాచుల్లో 60 రన్స్ చేశాడు. సంజూ శాంసన్ టీమ్‌ఇండియా తరఫున 16 టీ20లే ఆడాడు. 136 స్ట్రైక్‌రేట్, 22 సగటుతో 296 పరుగులు సాధించాడు. అయితే 220 టీ20ల్లో 133 స్ట్రైక్‌రేట్, 29 సగటుతో 5452 రన్స్ కొట్టాడు. ఇక 2022లో 6 టీ20ల్లో 159 స్ట్రైక్‌రేట్, 45 సగటుతో 179 రన్స్ చేశాడు. ఆసీస్‌లో 3 టీ20ల్లో 48 కొట్టిన అనుభవం ఉంది.
బీకేర్ ఫుల్ పంత్!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత దినేశ్ కార్తీక్‌ను ఎలాగూ తీసుకోరు. వయసు మీద పడటమే ఇందుకు కారణం. కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తారు. అలాంటప్పుడు రిషభ్ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ మధ్య పోటీ నెలకొంటుంది. ఓపెనింగ్ స్లాట్ ఖాళీగా లేదు కాబట్టి ఇషాన్‌కు ఛాన్సులు కష్టమే! లెఫ్ట్ హ్యాండర్ కావాలనుకుంటే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ అందుబాటులో ఉంటారు. వారు గనక ఫామ్‌లో ఉంటే పంత్‌కు అవకాశాలు దొరకడం కష్టమవుతుంది. దినేశ్ కార్తీక్ ఎలాగూ రైట్ హ్యాండర్. అలాంటి మ్యాచ్ ఫినిషిర్ పాత్రను సంజూ పోషిస్తే, మంచి ఫామ్‌లో ఉంటే అతడిని ఎంతో కాలం దూరం పెట్టలేరు. పైగా ఈ మధ్యన నిలకడగా ఆడుతున్నాడు. బౌన్సీ వికెట్లపైనా నిలబడి సిక్సర్లు కొట్టగల సామర్థ్యం అతడి సొంతం. వికెట్ కీపర్ బ్యాటర్, లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర కోచింగ్‌లో రాటుదేలుతున్న సంగతి మరవొద్దు. పంత్ గనక అవకాశాలు ఒడిసిపట్టకపోతే ఫ్యూచర్లో ఫ్యూచర్ ఉండదు!!