IND Vs AFG, T20 World Cup 2024: సూర్యా దంచేశాడు-బుమ్రా కూల్చేశాడు, అఫ్గాన్‌పై టీమిండియా ఘన విజయం
India vs Afghanistan: టీ20 ప్రపంచ కప్ సూపర్-8 లో తన ఆటను టీమ్‌ఇండియా ఘనంగా మొదలుపెట్టింది. అఫ్గానిస్థాన్‌పై 47 పరుగుల తేడాతో విజయం సాధించింది.
India vs Afghanistan , T20 World Cup Highlights: టీ 20 ప్రపంచకప్( T20 World Cup 2024) సూపర్ ఎయిట్(Super 8) మ్యాచ్‌లో టీమిండియా(Team India) తొలి అడుగు బలంగా వేసింది. అఫ్గాన్(Afghanistan)తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ రాణించిన రోహిత్ సేన... అఫ్గాన్‌పై గెలుపొందింది. బ్యాటింగ్ సూర్య భాయ్ అర్ధ శతకంతో మెరవగా.. పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్లో బుమ్రా నాలుగు ఓవరలో కేవలం పది పరుగులే మూడు వికెట్లు నేలకూల్చి అఫ్గాన్ పతనాన్ని శాసించగా.. మిగిలిన బౌలర్లు కూడా రాణించారు. అఫ్గాన్ బ్యాటర్లలో ఒమ్రాజాయ్ 26 పరుగులతో కాసేపు పోరాడినా అది ఓటమి అంతరాన్ని తగ్గించేందుకు మాత్రమే ఉపయోగ పడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 180 పరుగులు చేయగా.. అఫ్గాన్ 134 పరుగులకే కుప్పకూలి 47 పరుగుల తేడా ఓడింది. బుమ్రా(Bumrah) నాలుగు ఓవర్లు వేసి ఒక మెయిడిన్‌తో ఏడు పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసి అఫ్గాన్ పతనాన్ని శాసించాడు.
అఫ్గాన్ పోరాడినా...
టీమిండియా నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. రహ్మతుల్లా గుర్బాజ్‌ను అవుట్ చేసిన స్టార్ పేసర్ బుమ్రా... మరోసారి భారత్‌కు శుభారంభం అందించాడు. వికెట్లకు దూరంగా విసిరిన బంతిని వెంటాడిన గుర్బాజ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో అఫ్గాన్ 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. పవర్ ప్లే నాలుగో ఓవర్‌లోనే బంతి అందుకున్న అక్షర్ పటేల్ వికెట్ తీసి అఫ్గాన్‌ను కష్టాల్లోకి నెట్టాడు. 11 బంతుల్లో ఎనిమిది పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్‌ను అక్షర్ అవుట్ చేశాడు. దీంతో 23 పరుగుల వద్ద అఫ్గాన్ రెండో వికెట్ కోల్పోయింది. అయితే ఇదే స్కోరు వద్ద మరో వికెట్ తీసిన బుమ్రా అఫ్గాన్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేశాడు. నాలుగు బంతుల్లో రెండు పరుగులు చేసిన జజాయ్‌ను బుమ్రా అవుట్ చేశాడు. దీంతో అదే 23 పరుగుల వద్ద అఫ్గాన్ మూడో వికెట్ కోల్పోవడంతో ఆ జట్టు పరాయజం దాదాపుగా ఖాయమైంది. అయితే ఒమ్రాజాయ్-నజీబుల్లా జద్రాన్ అఫ్గాన్‌ను కాసేపు ఆదుకున్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. అయితే రన్‌రేట్ భారీగా పెరిగి పోతుండడంతో వీరు భారీ షాట్లు ఆడక తప్పలేదు. నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించిన అనంతరం ఈ జంటను కుల్‌దీప్ యాదవ్ విడదీశాడు. దీంతో 67 పరుగుల వద్ద అఫ్గాన్ నాలుగో వికెట్‌కు కోల్పోయింది. ఆ తర్వాత వికెట్ల పతనం వేగంగా కొనసాగింది. నబీ 14, రషీద్ ఖాన్ 2, నూర్ అహ్మద్ ఆరు, నవీనుల్ హక్ డకౌట్ కావడంతో అఫ్గాన్ 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో రోహిత్ సేన 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా నాలుగు ఓవర్లలో ఏడు పరుగులే ఇచ్చి మూడు వికెట్లు నేలకూల్చాడు. అర్ష్‌దీప్3, కుల్‌దీప్ రెండు వికెట్లు తీశారు.
భారత బ్యాటింగ్ ఇలా
అంతకముందు సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా ధనాధన్ బ్యాటింగ్ చేయడంతో టీమిండియా 181 పరుగుల భారీ స్కోరు చేసింది. మెరుపు బ్యాటింగ్ చేసిన సూర్య 28 బంతుల్లో 5 ఫోర్లు, మూడు సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. 24 బంతులు ఆడిన పాండ్యా మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 32 పరుగులు చేసి అవుటయ్యాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, ఫరూకీ 3 వికెట్లు తీసి టీమిండియా మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.