World Cup 2023: ఈ అద్భుతాలు జరిగితేనే పాక్‌కు సెమీస్ ఆశలు
ODI World Cup 2023: ప్రపంచకప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఊపు మీద కనిపించిన దాయాది పాకిస్థాన్, వరుస పరాజయాలతో విమర్శలు ఎదుర్కొంటోంది. ఏదైనా అద్భుతం జరిగితే గానీ ఆ జట్టు టాప్-4లో నిలవడం కష్టం.
భారత్ వేదికగా జరుగతున్న ప్రపంచకప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఊపు మీద కనిపించిన దాయాది పాకిస్థాన్... ఇప్పుడు వరుస పరాజయాలతో విమర్శలు ఎదుర్కొంటోంది. మహా సంగ్రామంలో ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్ రెండు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. వన్డే ప్రపంచకప్‌లో పాక్ ఇంకో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లతో బాబర్ సేన తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచుల్లో గెలిచి అద్భుతం జరిగితే తప్ప పాకిస్థాన్ సెమీస్ ద్వారాలు పూర్తిగా మూసుకుపోయినట్లే. పాకిస్థాన్ సెమీస్ చేరే అవకాశాలు కేవలం 6 శాతం మాత్రమే ఉన్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే గానీ ఆ జట్టు టాప్-4లో నిలవడం కష్టం. ఇంతకీ ఆ అద్భుతాలు ఏంటంటే..
అద్భుతాలు ఇలా జరగాలి...
మొదట పాకిస్థాన్... బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లతో జరిగే మ్యాచుల్లో తప్పకుండా గెలవాలి. ఒక్క మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దు కాకుడదు. అలా అయితేనే వేరే జట్ల సమీకరణాలపై పాక్ సెమీస్ ఆశలు ఆధారపడి ఉంటాయి. పాకిస్థాన్ నాకౌట్‌కు చేరాలంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మిగిలిన మూడు మ్యాచుల్లో ఓడిపోవాలి. ఒకవేళ పాక్, న్యూజిలాండ్ కేవలం ఒకే మ్యాచ్ గెలిచినా బాబస్ సేనకు అవకాశం ఉంటుంది. ఎలా అంటే మిగిలిన మూడు మ్యాచుల్లో పాక్ భారీ తేడాతో విజయాలు సాధించి నెట్ రన్‌రేట్‌ను భారీగా పెంచుకోవాలి. అప్పుడు పాక్, ఆసిస్, న్యూజిలాండ్ ఒకే పాయింట్లతో ఉంటాయి కాబట్టి మెరుగైన రన్‌రేట్‌తో పాకిస్థాన్ సెమీస్ చేరవచ్చు. ఇలా వేరే జట్ల సమీకరణాలపై పాక్ సెమీస్ అవకాశాలు ఉన్నాయి. కానీ పసికూనలతో మ్యాచ్‌లు ఉన్న వేళ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంత తేలిగ్గా ఓడిపోతాయనుకోవడం అత్యాశే అవుతుంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే సగానికిపైగా మ్యాచ్‌లు పూర్తి కాగా.. సెమీఫైనల్ చేరే జట్ల విషయంలో స్పష్టత వస్తోంది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. టీమిండియా ఇప్పటికే అయిదు విజయాలతో అప్రతిహాత జైత్రయాత్ర కొనసాగిస్తుండగా నేడు జరిగే మ్యాచ్‌లు విజయం సాధిస్తే సెమీస్‌లో అడుగు పెట్టిన తొలి జట్టుగా రోహిత్ సేన నిలుస్తుంది. భారత్ సెమీస్ చేరే అవకాశాలు 98 శాతం ఉండగా.. ఆరు మ్యాచ్‌లు ఆడి ఐదింట్లో గెలిచిన సౌతాఫ్రికా సెమీస్ చేరే ఛాన్స్ 95 శాతం ఉంది. పాకిస్థాన్ కంటే సెమీస్ చేరే అవకాశాలు శ్రీలంక, అప్ఘానిస్థాన్‌లకు ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు జట్లు చెరో రెండు మ్యాచ్‌ల్లో గెలిచాయి. శ్రీలంక సెమీస్ చేరే అవకాశాలు 20 శాతం ఉండగా.. అప్ఘాన్ సెమీస్ చేరే అవకాశాలు 18 శాతం ఉన్నాయి.
సెమీస్ రేసులోకి దూసుకొచ్చిన ఆస్ట్రేలియా టాప్-4లో నిలిచే అవకాశాలు 76 శాతం ఉన్నాయి. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి.. ఆ తర్వాత భారత్, ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిన న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరే అవకాశాలు 75 శాతం ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన పాకిస్థాన్ సెమీస్ చేరే అవకాశాలు కేవలం 6 శాతమే ఉన్నాయి. ఇంగ్లండ్ సెమీస్ చేరే ఛాన్సు 4 శాతం మాత్రమే.